ఒకరి మరకలు మరొకరికి అంటించుకుంటున్నారుగా

మెరుపు వెనక మరక ఉంటుంది. పేరు వెనకే గోల ఉంటుంది. పదవులు ఉన్న వారికి పెదవి విప్పి చెప్పలేని బాధలెన్నో ఉంటాయి. ఇక ఒక్కో మెట్టూ ఎక్కుతూ [more]

Update: 2020-05-11 13:30 GMT

మెరుపు వెనక మరక ఉంటుంది. పేరు వెనకే గోల ఉంటుంది. పదవులు ఉన్న వారికి పెదవి విప్పి చెప్పలేని బాధలెన్నో ఉంటాయి. ఇక ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఉంటే విమర్శలు అలాగే వస్తూ ఉంటాయి. అందులో కొన్ని బ్రాండ్ గా కూడా ఉండిపోతాయి. నిజం అబద్దం తెలియనంతగా ఆ నేతలను అవి చిరకాలమూ వెంటాడుతాయి. విషయానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెన్నుపోటు బిరుదు ఉన్న సంగతి తెలిసిందే. ఇక వైఎస్ జగన్ రాజకీయ ప్రవేశమే అవినీతి ఆరోపణలతో మొదలైంది. లక్ష కోట్లు జగన్ తిన్నాడని టీడీపీ నేతలు తరచుగా ఆరోపణలు చేస్తూంటారు. ఇపుడు చిత్రమేంటంటే ఒకరి బురద మరొకరికి పూయాలని రెండు పార్టీల నేతలు తెల్లారి లేచినప్పటినుంచి విశ్వప్రయత్నం చేయడం.

జగన్ వెన్నుపోటుదారుడా..?

ముఖ్యమంత్రి జగన్ మీద వెన్నుపోటు ముద్ర వేయాలని టీడీపీ చాలాకాలంగా చేయని ప్రయత్నం లేదు. ఆ మాటకు వస్తే వైఎస్సార్ భౌతిక కాయం ఉండగానే సంతకాల సేకరణ జగన్ చేశాడని, పదవి కోసం ఆయన మానవత్వం మరచి ఎంతకైనా తెగిస్తాడని టీడీపీ తమ్ముళ్ళు గత పదేళ్ళుగా అంటూ వచ్చారు. అయితే దానికి మరిన్ని జోడించి ఇపుడు జగన్ ని ఏకంగా వెన్నుపోటుదారుడిని చేసేశారు. జగన్ తన తండ్రికి ముఖ్యమంత్రి పదవి, తనకు ఎంపీ పదవి ఇచ్చిన కాంగ్రెస్ ని, సోనియా గాంధీని వెన్నుపోటు పొడిచాడని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తాజాగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు. జగన్ కుర్చీ కోసం ఏదైనా చేసే మనిషని అయ్యన్న పాత పురాణం చదువుతున్నారు.

బాబు కోట్లు తిన్నారా…?

ఇక వైసీపీకి చంద్రబాబుని అవినీతిపరుడిని చేసి చూడాలని కోరిక. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు బాబు మీద పుస్తకాలు ప్రింట్ చేసి మరీ జాతీయ స్థాయిలో పంపిణీ చేసింది. జగన్ లక్ష కోట్లు తిన్నారని టీడీపీ అంటే బాబు అయిదు లక్షల కోట్లు అవినీతి చేశారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అంటే జగన్ మీద సీబీఐ కేసులు ఉన్నాయి, అదే తరహాలో బాబు మీద కూడా కేసులు పెట్టించి ఆయన్ని కూడా విచారించి జైళ్ళో పెట్టాలన్నది వైసీపీ నేతలు ఆలోచన, పట్టుదల.

ముద్ర పడితే….?

ఒకసారి ముద్ర పడితే దాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. జగన్ మీద కేసులు విచారణలో ఉన్నాయి. కానీ టీడీపీ సహా గతంలో విపక్షాలు చేసిన ఆరోపణల పుణ్యమాని సాదర జనం అందులో ఎంతో కొంత నిజం ఉందేమోనని సందేహించే పరిస్థితి ఏర్పడుతోంది. ఇక చంద్రబాబు తన పార్టీని రక్షించుకోవడానికి అందరి ఎమ్మెల్యేల మద్దతుతో టీడీపీని కైవశం చేసుకున్నారని టీడీపీ నాయకులు చెబుతారు. జనం మాత్రం అది వెన్నుపోటు అని నమ్ముతారు. సొంత మామకు అల్లుడు వెన్నుపోటు పొడిచారని కూడా ఇప్పటికీ చాలా మంది అనుకుంటారు. అందువల్ల కొన్ని విషయాల్లో నిజాలకూ, ప్రచారానికి అతి పెద్ద అంతరం ఉన్నా కూడా అది ఏ శుభ ముహూర్తాన జనం మెదళ్ళోకి పోయిందో కానీ అలాగే స్థిరపడిపోతుంది. ఒకరి మరక‌లు మరొకరికి అంటించే ప్రయత్నం చేయడం వల్ల మరింత అభాసుపాలు అవుతారు కానీ ఏ విధ‌మైన రాజకీయ ప్రయోజనం ఉండదని గ్రహించడం మంచిదేమో.

Tags:    

Similar News