జగన్.. ఒకే ఒక్కడు… ఆ ఒక్కటి మాత్రం అడక్కు

అవును. నిజమే. జగన్ ఒకే ఒక్కడు. ఆయనే పార్టీ. ఆయనే ప్రభుత్వం. రెండో మాటకు అక్కడ తావు లేదు. ఇదే ఇంప్రెషన్ ఇపుడు బయట కనిపిస్తోంది. నిజానికి [more]

Update: 2020-05-10 14:30 GMT

అవును. నిజమే. జగన్ ఒకే ఒక్కడు. ఆయనే పార్టీ. ఆయనే ప్రభుత్వం. రెండో మాటకు అక్కడ తావు లేదు. ఇదే ఇంప్రెషన్ ఇపుడు బయట కనిపిస్తోంది. నిజానికి ఏ ప్రాంతీయ పార్టీకైనా అధినాయకుడే సర్వాధికారి. ఆయన మాటే ఫైనల్. కానీ ప్రజాస్వామ్యయుగంలో ఉన్న తరువాత ఎంతో కొంత ఆ స్పూర్తి కనిపించేందుకైనా కాస్తా పూత పూస్తారు. మంత్రి వర్గ సమావేశాలు పెట్టినట్లుగా, పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా హడావుడి చేస్తారు. గతంలో చంద్రబాబు అయినా, తెలంగాణాలో కేసీఆర్ అయినా అదే చేస్తూ వస్తున్నారు. కానీ ఏపీలో జగన్ మాత్రం పూర్తి భిన్నం. కరోనా వైరస్ తరువాత ఏపీలో ఒకే ఒకసారి మంత్రివర్గ సమావేశం జరిగింది అంతే.

చర్చించాలిగా…?

నిజానికి మంత్రివర్గం అంటేనే ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించాక నెలకు రెండు సార్లు క్యాబినెట్ భేటీలు నిర్వహించేవారు. ఇపుడు ఏపీలో అసాధారణ పరిస్థితులు ఉన్నాయి. కరోనా మహమ్మారి ఉంది. దాంతో కనీసం రెండు నుంచి మూడు సార్లు అయినా మంత్రి వర్గం సమావేశం అయి చర్చిస్తే జనాలకు కూడా ప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతుంది. కరోనా వైరస్ విషయంలో సీరియస్ గా సర్కార్ ఉందన్న సంకేతాలు కూడా బయటకు వెలువడతాయి. కానీ జగన్ మాత్రం అన్నీ తానే అయి కరోనాపై అధికారుల స్థాయిలోనే సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ శాఖ మంత్రి తప్పనిసరి కాబట్టి ఉంటున్నారు. ఇక సీనియర్ మంత్రులతో సబ్ కమిటీని ఒకదాన్ని వేశారు.

అది జరిగేనా…?

తన మంత్రులతోన జగన్ మీటింగ్ పెట్టడంలేదు. ఇపుడు అఖిల పక్షం పేరిట చిన్నా చితకా పార్టీలను పిలిచి తలంటించుకునే సాహసం జగన్ చేస్తారా. అసలు చేయరు. పైగా జగన్ కొన్ని విషయాల్లో చంద్రబాబుని అనుసరిస్తారు. బాబు సీఎంగా ఉన్నపుడు అఖిలపక్షాన్ని పిలవలేదు కాబట్టి తానూ అంతే అంటారు. నిజానికి అఖిపక్షాన్ని పిలిచినా, మంత్రివర్గ సమావేశాలు తరచూ జరిపినా ఫైనల్ డెసిషన్ జగనే తీసుకుంటారు. అది అందరికీ తెలుసు. కానీ ఆ ప్రజాస్వామ్య ముద్ర అన్నది పడకపోతేనే విమర్శలు వెల్లువెత్తుతాయి. కానీ తీరు చూస్తూంటే జగన్ దేనికీ వెరవరు అన్నది తెలిసిందే.

వేడి తగ్గుతుంది…

అఖిల పక్షం వల్ల ఉపయోగం ఏంటంటే విపక్షాలకు ఆత్మ తృప్తి దొరుకుతుంది. తమను కూడా గుర్తించారన్న ఆనందం కనిపిస్తుంది. దాంతో ప్రభుత్వం మీద గట్టిగా విమర్శలు చేయడానికి కొంత మొహమాటం అడ్డు వస్తుంది. ఇక ప్రభుత్వం కూడా తాము తీసుకునే నిర్ణయాలు అన్నీ ఏకపక్షం కాదు, అందరితోనూ చర్చించి తీసుకున్నామని గట్టిగా చెప్పుకోవడానికి వీలు అవుతుంది. ఓ విధంగా ఇది సామరస్య వాతావరణానికి కొంతవరకూ దోహదపడేందుకు వీలు అవుతుంది. దీన్నే లౌక్యం అంటారు. గతంలో ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రులు అయిన వారు అరవై ఏళ్లు దాటిన వారు ఉండేవారు. వారి ఒంట్లో వేడి అప్పటికి బాగా తగ్గి ఉండడం, ఎవరిని ఎలా చేరదీసి జనాల వద్ద మార్కులు సంపాదించాలన్నది కూడా అర్ధమై ఉండేది. దాంతో వారు విపక్షాలను కూడా మచ్చిక చేసుకునేవారు. ఇపుడు మాత్రం అంతా మారిపోయింది. ఇక జగన్ ది దూకుడుతో కూడిన రాజకీయం. ఉడుకు రక్తంతో తీసుకునే నిర్ణయాలు కావడంతోనే బాగా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు.

Tags:    

Similar News