లైట్ తీసుకుంటే… లాంగ్ రన్ లో లాస్ తప్పదా?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ విషయాన్ని అయినా లైట్ తీసుకుంటారు. ప్రధానంగా విపక్షాలు చేసే విమర్శలు పెద్దగా జగన్ పట్టించుకోరు. ఎంతటి తీవ్రమైన విమర్శలు చేసినా [more]

Update: 2020-05-06 08:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ విషయాన్ని అయినా లైట్ తీసుకుంటారు. ప్రధానంగా విపక్షాలు చేసే విమర్శలు పెద్దగా జగన్ పట్టించుకోరు. ఎంతటి తీవ్రమైన విమర్శలు చేసినా మంత్రులు స్పందిచాల్సిందే కాని ముఖ్యమంత్రి జగన్ మాత్రం పెదవి విప్పరు. ఇదే ఆయనకు లాంగ్ రన్ లో ఇబ్బంది అవుతుందంటున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయి 11 నెలలు కావస్తుంది. ఈ 11 నెలల్లో విపక్షాలు ప్రతిరోజూ విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఏదో ఒక అంశాన్ని తీసుకుని రాద్ధాంతం చేస్తూనే ఉన్నాయి.

అసెంబ్లీ సమావేశాల్లో తప్ప….

కానీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ వాటికి సమాధానం చెప్పరు. ఒక్క అసెంబ్లీలో తప్ప ఆయన మాట్లాడరు. అదీ సమావేశాలు ఉంటేనే. ఏడాది పొడవునా అసెంబ్లీ సమావేశాలు ఉండవు. అలాగని విపక్షాల విమర్శలు అసెంబ్లీ సమావేశాల వరకూ ఆగవు. చంద్రబాబు అయితే గత ఆరు నెలల నుంచి ఏదో ఒక రూపంలో మీడియా ముందుకు వచ్చి జగన్ ప్రభుత్వాన్ని తూర్పారపడుతున్నారు. కానీ జగన్ మాత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రధానంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పరు.

కేసీఆర్ తరహాలో…..

పొరుగునే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి విపక్షాల విమర్శలకు ధీటైన సమాధానం చెబుతారు. తానే స్వయంగా వచ్చి వారు చేస్తున్న విమర్శలను చిల్లరవిగా ప్రజల ముందు ఉంచుతారు. రైతుల నుంచి పంట కొనుగోలు చేయడం లేదన్న విపక్షాల విమర్శకు కేసీఆర్ ధీటైన సమాధానమే చెప్పారు. రైతుబంధు, ఉచిత కరెంటు, పంటకొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందీ వివరించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను కూడా కేసీఆర్ ప్రస్తావించి అక్కడి ప్రధాన ప్రతిపక్షానికి వాయిస్ లేకుండా చేస్తున్నారు. కానీ చంద్రబాబు నిత్యం మోదీని పొగుడుతూ తనపై బురద జల్లుతున్నా జగన్ మాత్రం పట్టించుకోరు.

ఎక్కడా లేని విధంగా చేస్తున్నా…..

దీనివల్ల నష్టపోయేది జగన్ మాత్రమే అని అంటున్నారు విశ్లేషకులు. నిజానికి 11 నెలల్లో జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు తెలంగాణాలోనూ చేయలేదు. అయినా తన పథకాల గురించి చెప్పుకోవడానికి జగన్ కు టైమ్ లేదు. ఇసుక, మద్యం, రేషన్ కార్డులు, పింఛను వంటి విషయాల్లో విపక్షాల విమర్శలకు జగన్ సమాధానం చెప్పకుంటే ప్రజలు విపక్షాల విమర్శలనే నమ్ముతారు. మంత్రులు ఉన్నారు కదా? అని జగన్ సంబరపడితే… రానున్న కాలంలో జగన్ కు భారం తప్పదు. ఇప్పటికైనా తాను ముఖ్యమంత్రిని అన్న వి‍షయాన్ని పక్కన పెట్టి పార్టీ అధినేతనన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలంటున్నారు. మరి జగన్ నోరు మెదపకుంటే లాంగ్ రన్ లో లాస్ అయ్యేది ఆయనే.

Tags:    

Similar News