జగన్ చెప్పిందే తారక‌మంత్రమా ?

దేశంలో లాక్ డౌన్ పెట్టడం కాదు కానీ వేసిన తాళం తీయలేక జుత్తు పీక్కోవాల్సివస్తోంది. లాక్ డౌన్ వల్ల పూర్తి ఫలితాలు వచ్చాయా అంటే సగం మాత్రమే [more]

Update: 2020-05-05 06:30 GMT

దేశంలో లాక్ డౌన్ పెట్టడం కాదు కానీ వేసిన తాళం తీయలేక జుత్తు పీక్కోవాల్సివస్తోంది. లాక్ డౌన్ వల్ల పూర్తి ఫలితాలు వచ్చాయా అంటే సగం మాత్రమే అని చెప్పాలి. ఇక లాక్ డౌన్ ఎపుడు ఎత్తేసినా కూడా కరోనా పొంచి ఉండనే ఉంది. లాక్ డౌన్ విధించడం వల్ల ఇప్పటికే 20 లక్షల కోట్లకు పైగా ఆర్ధిక నష్టం దేశం మొత్తానికి జరిగింది. సరే దాని వల్ల ఒనకూడిన భారీ ప్రయోజనం ఉందా> అని నిగ్గదీస్తే కేంద్రం వద్ద కూడా సమాధానం లేదు. అందుకే లాక్ డౌన్ ని ఒక అభ్యాసంగా తీసుకోవాలని జనాలకు చెప్పి చైతన్యపరచాలి. దానికి కేంద్ర పెద్దలకు ధైర్యం చాలడంలేదు. ఆ మాటకు వస్తే ఏ రాష్ట్రంలో చూసినా అక్కడ పాలకులు తాము వంచన చేసుకుంటూ జనాలకు వంచిస్తున్నారనే చెప్పాలి. కరోనా కట్టడికి లాక్ డౌన్ మార్గమని నిపుణులు ఎవరూ కూడా చెప్పలేదు. అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే.

జగన్ మోడల్ ….

ఈ నేపధ్యంలో లాక్ డౌన్ ని మెల్లగా సడలించాలన్న జగన్ సూచనలు ఇపుడు జాతీయ స్థాయిలో కూడా అమలవుతున్నాయి. నిజానికి గత నెల 14 వరకూ ఉన్న లాక్ డౌన్ ని పొడిగించాలా? వద్దా? అని ప్రధాని ముఖ్యమంత్రులతో వీడియో సమావేశం పెడితే జగన్ అడిగింది సడలింపులనే. నాడు పొరుగున ఉన్న కేసీఆర్ తో సహా అంతా లాక్ డౌన్ ని కొనసాగించమని కోరుతూ వచ్చారు. దాంతో జగన్ ప్రతిపాదన అవగాహనలేమితో కూడినదిగా, అనుభవం లేనిదిగా అంతా అడిపోసుకున్నారు. చిత్రమేంటంటే ప్రధాని మోడీ మాత్రం ఆ ప్రతిపాదనలోని సారాన్ని పట్టుకున్నారు. అందుకే ఆయన బతుకుతో పాటు బతుకు బండీ అవసరం అని అన్నారు. అంతే కాదు. గత నెల 20 నుంచి కొన్ని సడలింపులకు మొగ్గు చూపారు కూడా. ఇపుడు మరికాస్తా ముందుకు వచ్చి బాగా సడలింపులు ఇస్తున్నారు.

ఇదే సత్యమా…?

కరోనాతో కలసి జీవించకతప్పదు అన్నది జగన్ మాట. ఇలా జగన్ అన్నారో లేదో అలా ఏపీలోని విపక్షం మొత్తం ఆయన మీద పడిపోయింది. జగన్ చేతులెత్తేశాడని టీడీపీ అంటే కాపురం చేయమని చెప్పడానికి సిగ్గు లేదా ఆని మిగిలిన పార్టీలు అన్నాయి. సీపీఐ రామకృష్ణ లాంటి వారు అయితే ఇప్పటికీ దెప్పుతున్నారు. అంతగా జగన్ కి, ఆయన మంత్రులకు ఇష్టం ఉంటే వారే కరోనాతో సహజీవనం చేసుకోవచ్చు. మేము మాత్రం పోరాడుతామని అంటున్నారు. అక్కడ పోరాటం చేయల్సింది ఒకరో ఇద్దరో కాదు, మొత్తానికి జనం, వారిని ఆ దిశగా నడిపించాల్సింది పాలకులు. మరి ఆ పనే జగన్ చేస్తే తప్పు పట్టారు. కానీ ఇపుడు అదే జాతీయ స్థాయిలోనూ జీవిత సత్యమైంది.

కేటీఆర్ కూడా …..

కరోనా మహమ్మారి విషయంలో మందు లేదు, అది ఒక్క రోజుతో పోయేది కాదు, దాంతో కలసి ముందుకు సాగడమే ప్రజల ముందున్న కర్తవ్యం అని సాక్థాత్తూ తెలంగాణా మంత్రి, భావి వారసుడు కేటీఆర్ చెప్పుకొచ్చారు. అంటే లాక్ డౌన్ పేరిట అన్నీ మూసుకు కూర్చుంటే కధ ముందుకు సాగదని కేటీఆర్ సారం వినిపించారు. ఇదే మాట ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెబుతున్నారు. అక్కడ నాలుగు వేల పై చిలుకు కరోనా కేసులు ఉన్నాయి. అయినా సరే ఢిల్లీని తెరవాల్సిందే. మనం బతకాల్సిందేనని చెబుతున్నారు. ఇలా దేశంలో అంతా జగన్ మోడల్ రైట్ అంటున్నారు. ఎవరు అన్నారు అన్నది పక్కన పెట్టి ప్రాక్టికల్ గా ఆలోచిస్తే కరోనా పేరు చెప్పి మన బతుకులకు సంకెళ్ళు వేసుకోలేం కదా. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ జీవితాన్ని సాగించాలి. ఇదే మాట అందరూ చెబుతున్నారు. కరోనాకు వ్యాక్సిన్ వస్తుందో రాదో అన్నది ఎవరికీ తెలియదు. అందుకే ఇప్పటికీ ఇదే మార్గం. అంతే.

Tags:    

Similar News