జగన్ ని ఓడించలేరా ? ఇక కష్టమేనా?

జగన్ ఈ పేరు ఏపీలో పదేళ్ళుగా మారుమోగుతోంది. అదే సమయంలో ఆయన అందరి కంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీకే విలన్ అయ్యారు. వైఎస్సార్ తోనే నానా బాధలు [more]

Update: 2020-05-07 14:30 GMT

జగన్ ఈ పేరు ఏపీలో పదేళ్ళుగా మారుమోగుతోంది. అదే సమయంలో ఆయన అందరి కంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీకే విలన్ అయ్యారు. వైఎస్సార్ తోనే నానా బాధలు పడిన టీడీపీకి ఆ తండ్రి కొడుకుగా జగన్ ఎదురువచ్చారు. వైఎస్సార్ కంటే జగన్ నాలుగాకులు ఎక్కువ చదివారు. ఆయన దూకుడు ముందు టీడీపీ ఎపుడూ దిగదుడుపు అవుతోంది. టీడీపీ చరిత్రలో డిపాజిట్లు పోగొట్టిన పార్టీగా ఉమ్మడి ఏపీలో టీఆర్ఎస్ తరువాత వైసీపీనే చెప్పుకోవాలి. ఎన్నో కూడికలు, వ్యూహాలు, ఎత్తులు పై ఎత్తులు వేస్తే కానీ 2014లో టీడీపీకి అరకొర మెజారిటీ సీట్లు దక్కలేదు. అక్కడికీ అరువు తెచ్చుకున్న మోడీ ఇమేజ్, జనసేన పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ కలసిరాకపోతే వైసీపీదే గెలుపు అన్న సంగతి ఓట్ల లెక్కలు తేల్చేశాయి. ఇన్ని చేసినా 68 సీట్లతో నాడు వైసీపీ గట్టి ప్రతిపక్షమైంది.

కుదేలు అయిందా…?

ఇక 2019 ఎన్నికల నాటికి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లు మాత్రమే సంపాదించి దారుణంగా చతికిలపడింది. టీడీపీని ఇంతలా కుదేలు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ అనే చెప్పాలి. ఇక గత ఏడాదిగా జగన్ ఒక వైపు తనదైన పరిపాలన చేస్తున్నా కూడా ఎక్కడికక్కడ టీడీపీని కట్టడి చేయడంలో మాత్రం విజయం సాధిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా జగన్ దూకుడుగా వెళ్తున్న తీరుతో టీడీపీ కార్యకర్తల నైతిక స్థైర్యాని దెబ్బతీశారని అంటున్నారు. ఒక రాజకీయ పార్టీకి ప్రాణప్రదమైన క్యాడర్ లో నిరాశ కలిగితే మాత్రం అది మరింత ప్రమాదమని అంటారు. ఇపుడు అదే టీడీపీలో జరుగుతోందని విశ్లేషణలు ఉన్నాయి.

చావో రేవో…?

ఓ విధంగా ఇపుడు టీడీపీ ఉన్న పరిస్థితి చావో రేవో అన్నట్లుగా ఉందని ఆ పార్టీలోనే గట్టిగా వినిపిస్తోంది. బడా నాయకులు, మంత్రులుగా చేసిన సీనియర్లు, పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న వారు కూడా ఇపుడు పెద్దగా బయటకు రావడంలేదంటే ఓ విధంగా సైకలాజికల్ గానే టీడీపీని వైసీపీ దెబ్బ తీస్తోందని అంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని ప్రచారం కూడా తమ్ముళ్లకు టెన్షన్ పుట్టిస్తోంది. అదే సమయంలో పార్టీపై ఆధారపడిన ఒక ప్రధాన సామాజికవర్గంపైన కూడా ఈ ప్రభావం గణనీయంగా పడుతోంది. 2019లో జరిగిన ఎన్నికలు టీడీపీని కేవలం ఒక ఎన్నిక వరకే ఓడించలేదని, రాజకీయంగా కూడా పతనం అంచుకు నెట్టేశాయని అంటున్నారు.

తట్టుకోవడం కష్టమే ….

జగన్ కి ప్రధాన శత్రువు టీడీపీ, ఇది రాజకీయాలకు అతీతమైన బధ్ధ వైరం. ఇక టీడీపీకి గట్టి మద్దతు ఇస్తున్న ప్రధాన కులం మీద కూడా వైసీపీ వ్యూహం ప్రకారం టార్గెట్ చేస్తోందని అంటున్నారు. ఇక ప్రభుత్వం మీద విమర్శలు చేసే వారి మీద ఎదురుదాడి కూడా టీడీపీ నుంచి అందిపుచ్చుకున్న వైసీపీ ఆ పార్టీ కంటే కూడా పక్కాగా అమలుచేస్తోంది. దాంతో మనకెందుకొచ్చిన తంటా అనుకునే తమ్ముళ్ళు సంఖ్య ఎక్కువైపోతోంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీని మరో నాలుగేళ్ళలో నామరూపాలు లేకుండా చేయాలన్న వైసీపీ యాక్షన్ ప్లాన్ తో వచ్చే ఎన్నికల్లో గెలుపు మాట దేముడెరుగు రాజకీయ పార్టీగానైనా ఉంటామా అన్న డౌట్లు కులపెద్దల్లోనే వస్తున్నాయట. అటు హస్తిన నుండి, దేశ విదేశాల్లో సైతం ఇపుడు టీడీపీ పతనం, దానిని అల్లుకుని ఉన్న బలమైన సామాజికవర్గం ఆందోళనే ప్రధాన చర్చగా ఉంది.

Tags:    

Similar News