జగన్ కి తపోభంగం అయిందా?

జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఒక తపస్సుగా తన పని తాను చేసుకుపోతున్నారు. జగన్ తాను అనుకున్న కార్యక్రమాలు పదేళ్ళుగా కంటున్న కలలు అన్నీ కూడా [more]

Update: 2019-11-16 14:30 GMT

జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఒక తపస్సుగా తన పని తాను చేసుకుపోతున్నారు. జగన్ తాను అనుకున్న కార్యక్రమాలు పదేళ్ళుగా కంటున్న కలలు అన్నీ కూడా ఒక్కసారిగా ఆచరణలో పెట్టాలన్న ఆలోచనతోనే రాత్రి పగలూ గడిపారు. ఆ సమయంలో ప్రతిపక్షాలను జగన్ అసలు పట్టించుకోలేదు. ఏపీలో ప్రతిపక్షం అసలు ఉందా అన్నధీమాతో పాటు, ప్రజలు తనకు ఇచ్చిన బంపర్ మెజార్టీ వెనక ఉన్న బాధ్యత గుర్తుకు వచ్చి కాబోలు జగన్ వడివడిగా లక్ష్య సాధన వైపు అడుగులుముందుకు పోయారు. ఇంతలో ఆరునెలల కాలం పూర్తి అయింది. జగన్ ఈ మధ్యలో పదుల సంఖ్యలో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. జనాలకు వరాలా దేవుడిలా మారిపోయారు, ప్రతిపక్షాల బీద ఏడుపులను జనం అసలు లెక్కచేయరని కూడా జగన్ భావించి ఉండొచ్చు. అయితే అదే జగన్ ఇపుడు జనాల మాట పక్కన పెడితే తానే చెవులు రిక్కించి మరీ విపక్షం విమర్శలను వింటున్నారు.

నో అంటూనే చేస్తున్నారు….

ఏపీలో విపక్షాలది అక్కసు, వారిది అసూయ అని తన మంత్రుల చేత అనిపిస్తూనే జగన్ కూడా వారు కోరుకున్నదే చేస్తున్నారు. ఇసుక మీద విపక్షం మొత్తం గోల చేస్తే జగన్ దాన్ని మొదట్లో సమర్ధంగా తిప్పికొట్టారు. వరదల వల్ల ఇసుక కొరత అన్నారు. మంచి పాలసీ కోసం కొంతకాలం ఆగామని కూడా వివరించారు. ప్రజలకు చాలా పారదర్శకంగా ఇసుకను తాము అందిస్తామని కూడా చెప్పారు. మరి ఇన్ని చెప్పిన జగన్ ఇపుడు ఇసుక వారోత్సవాలు చేస్తూండడమే విశేషం. అంటే ప్రతిపక్షం డిమాండ్ ఏదైతే ఉందో దానికి జగన్ కొంతమేర తలొగ్గారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏపీలో ఇసుక బాధిత జనం లక్షల్లో ఉన్నారని చెప్పినపుడు అడ్డంగా కొట్టేసిన జగన్ సర్కార్ ఇపుడు వారోత్సవాల పేరిట సక్రమంగా సరఫరా చేయాలంటోంది. అంటే దాని అర్ధం విపక్షాల ఉద్యమం కరెక్ట్ అని ఒప్పుకున్నట్లే కదా. ఇసుక కష్టాలతో జనం అల్లాడుతున్నట్లే కదా.

అక్కడా తడబాటు….

ఇక ఏపీలో ప్రాధమిక స్థాయిలో విద్యా బోధనను ఆగ్ల మాధ్యమంలో నిర్వహించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి ఎనిమిది వరకూ అంటూ మొదట ఆర్భాటంగా ప్రకటించింది. దాని మీద భాషావాదులతో పాటు టీడీపీ, జనసేన ఇతర పార్టీలు నిరసన వ్యక్తం చేసేసరికి ఒకటి నుంచి ఆరవ తరగతి వరకూ మాత్రమేనని ఒక మెట్టు జగన్ దిగారు. ఇక వచ్చే ఏడాది నుంచి అమలు అంటున్నారు. ఈ లోగా ఎన్ని మార్పులు చేర్పులు చేస్తారో చూడాలి.

డిఫెన్స్ లో పడ్డారా…?

అసలు ఇవన్నీ ఎందుకు ఒక విధానం ప్రకటించేటపుడే అన్ని వైపుల నుంచి ఆలోచన చేసుకుంటే ఈ పొరపాట్లు, తడబాట్లు, విపక్షాల విమర్శలు తప్పుతాయి కదా అంటున్నారు. ఇక జగన్ ఆంగ్ల బోధన విషయంలో తన సర్కార్ ని సమర్ధించుకోబోయి మరింత ఇబ్బందులో పడ్డారు. పవన్, వెంకయ్యనాయుడు, చంద్రబాబులని విమర్శించడం ద్వారా డిఫెన్స్ లో పడ్డారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ తపస్సుని భంగం చేయడంలో విపక్షాలు ఆరు నెలల్లోనే విజయం సాధించాయి. ముందు ముందు మరెన్ని విన్యాసాలతో జగన్ ని అడ్డుకుంటారో చూడాలి.

Tags:    

Similar News