జగన్ ను అర్జెంట్ గా దించేయాలే? ఎలా?

ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయాలనుకునే రకం రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది. ఏపీలో ఇపుడు కరోనా మహమ్మారి తో పోరు కంటే సొంత రాజకీయమే పెద్ద ఎత్తున [more]

Update: 2020-04-30 14:30 GMT

ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయాలనుకునే రకం రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుంది. ఏపీలో ఇపుడు కరోనా మహమ్మారి తో పోరు కంటే సొంత రాజకీయమే పెద్ద ఎత్తున సాగుతోంది. బద్ధ విరోధి జగన్ ని జనంలో వీలైనంత వరకూ బదనాం చేయాలన్నదే ఈ క్షుద్ర రాజకీయం. నిజానికి ఈ సమయంలో ఎవరూ కూడా పెదవి విప్పకూడదు. కానీ ఉన్నవీ, లేనివీ అన్నీ విప్పేస్తూ నగ్నంగా రాజకీయం చేస్తున్నారు. బరితెగించి మరీ పరువులు తీసుకుంటున్నారు. కొన్ని విపక్షాలకో, వారి మద్దతు మీడియాకో కానీ, ఎవరికీ ఈ బుధ్ది పుట్టిందో కానీ ఇపుడు హఠాత్తుగా ఏపీలో రాష్ట్రపతిపాలన కావాలట. ఇది నిజంగా వింతా,విడ్డూరమే.

ఎందుకు అలా…?

నిజానికి కరోనా విశ్వజనీనమైన సమస్య. ప్రపంచవ్యాప్తిగా మానవాళి ఎక్కడ ఉంటే అక్కడ కరోనా ఉంది. అటువంటి కరోనా విషయంలో చూసుకుంటే అగ్ర రాజ్యం అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ ఇలా అనేక బడా దేశాల్లో మరణాలు లెక్కలేనన్ని ఉన్నాయి. దారుణమైన నంబర్లో అక్కడ కరోనా కేసులు పెరిగాయి. కానీ అవన్నీ చూపించి అక్కడ పాలకులు అసమర్ధులు అని ఎవరైనా అన‌గలరా. అంటే వారిని ఏమంటారో. ఇక భారత దేశంలో చూసుకుంటే లాక్ డౌన్ ప్రకటించకముందు కరోనా పాజిటివ్ కేసులు కేవలం అయిదు వందలు మాత్రమే. తరువాత చూస్తే పాతిక ముప్పయివేలు నెల రోజుల్లో పెరిగాయి. అంతమాత్రం చేత మోడీని నిందించి తప్పుకో అంటారా.

జగన్ దిగాలట….

ఎంతసేపూ కుర్చీ మీద యావ. దాని కోసం చెత్త డిమాండ్లు చేస్తూ దిగజారిపోతున్న వైనం కళ్ల ముందే కనిపిస్తోంది. ఏపీలోని కొన్ని విపక్షాల పోకడలు ఇలా ఉంటే అనుకూల మీడియాలో రాతలు అంతకంటే దారుణంగా ఉన్నాయి. ఏపీలో గవర్నర్ పాలన పెట్టాలట. అపుడే కరోనా కట్టడి అవుతోందిట. ఈ రకమైన సలహాలు ఎందుకు ఇస్తున్నారో, ఎవరి కోసం ఇస్తున్నారో కూడా తెలిసిందే. కానీ ఈ పని ఎవరు చేయాలి. ఎందుకు చేయాలి. ఏ కారణం చూపించి చేయాలి. అలా చేసే వారు దేశంలో కూడా ఏం జరుగుతోంది. తాము ఏ విధంగా ఉన్నామో కూడా చూసుకుంటారుగా.

భరించలేరా…?

ఒక నెల గడిస్తే ఏపీలో జగన్ పాలనకు ఏడాది నిండుతుంది. అతి భారంగా విపక్షానికి ఈ ఏడాది గడచినట్లుంది. అన్నింటికీ మించి అధికారాన్ని దశాబ్దాల పాటు అనుభవించిన టీడీపీకి దాని అధినాయకునికి ఇంకా భారంగా ఉన్నట్లుంది. అందుకే ఆ పార్టీకి చెందిన నేతలు ఏపీలో జగన్ ఉండకూడదు అంటున్నారు. దానికి కరోనాను కూడా వాడేసుకుంటున్నారు. కరోనా విపత్తుని ఎదుర్కొనేందుకు జగన్ ని దించేసి రాష్ట్రపతి పాలన అయినా పెట్టాలి. లేకపోతే మరో ఏడాది రెండేళ్ళలో జమిలి ఎన్నికలు అయినా జరిపించి దించేయాలి. అదీ కుదరకపోతే అక్రమ కేసుల్లో తీర్పు తొందరగా ఇప్పించేసి జైల్లో కూర్చేబెట్టాలి. అదీ కూడదు అనుకుంటే బెయిల్ అయినా రద్దు చేసి జగన్ చేత కటకటాలు లెక్కించాలి. మొత్తానికి కనీస మాత్రంగానైన ప్రజాస్వామ్య స్పూర్తి, కరోనా వేళ మానవత్వపు ఛాయలు లేని కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న వికటాట్టహాసం చూస్తూంటే ఈ దేశానికి అయిదేళ్ళు ఎన్నికలు అవసరం లేదేమో. ప్రతీ ఏడాదికి కావాలేమో.

Tags:    

Similar News