జగన్ ని చూస్తే అదే గుర్తుకు వస్తోందా ?

ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. వారు మెచ్చుకుని నీవే మా నాయకుడివి అని వరమాల వేశాక వారిచ్చిన తీర్పును శిరసావహించడం వినా ఎవరికీ కూడా వేరే మార్గం [more]

Update: 2020-04-23 14:30 GMT

ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. వారు మెచ్చుకుని నీవే మా నాయకుడివి అని వరమాల వేశాక వారిచ్చిన తీర్పును శిరసావహించడం వినా ఎవరికీ కూడా వేరే మార్గం లేదు. అదే ప్రజాస్వామ్యంలో హుందాగా అనిపించుకుంటుంది. తెలుగుదేశం లాంటి నాలుగు దశాబ్దల పాటు జనంలో ఉన్న పార్టీకి ఈ విషయాలు తెలియక కాదు. కానీ అక్కసు, కక్ష వారి చేత ఈ మాటలు అనిపిస్తున్నాయి అనుకోవాలి. జగన్ పేరు ఎత్తిన ప్రతీసారి జైలు, బెయిలూ అన్న మాటలను చాలా సులువుగా తమ్ముళ్ళు వాడుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. కానీ ఇక్కడ జగన్ ఒక పార్టీ నాయకుడు మాత్రమే కాదు, అయిదు కోట్ల మంది ప్రజలకు ముఖ్యమంత్రి.

పరిహాసమేనా…?

ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తే అది శభాష్ అనిపిస్తుంది. అదే జనం వేరే వారిని ఎన్నుకుంటే మాత్రం ఈ జనాలకు ఏమీ తెలియదు అని ఓడిన నాయకులు నేరుగానే తిట్ల పురాణం లంకించుకుంటారు. అంటే తమవైపు ఉంటేనే ఓటరైనా, మరెవరైనా అన్న దారుణమైనా ఆలోచనలు వర్తమాన రాజకీయ నాయకులలో కలగడం బాధాకరం. జగన్ ని పట్టుకుని జైలు నుంచి వచ్చిన వాడు అంటూ తమ్ముళ్ళు అంటూంటే వారు ఆయన్ని నిందించడం లేదు. ఎన్నుకున్న ప్రజల తీర్పుని పరిహస్తున్నారు. మాకెందుకు ఓట్లు వేస్తారు, మేము డబ్బు పంచలేదు, జైలుకెళ్ళి రాలేదు అంటూ ఓ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు.

తర్కం ఉందా..?

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడే మాటలకు ఎటువంటి తర్కం అక్కరలేదు. ఆయన ఆవేశంగా మాట్లాడుతారు. ఆ మాటల దూకుడులో తిట్లు కూడా సులువుగా దొర్లిపోతూంటాయి. తాజాగా జగన్ ని ఆయన విమర్శిస్తూ జైలు నుంచి వచ్చిన నాయకుడు అని మళ్ళీ ఇంకొసారి సంభోదించారు. అంతటితో ఆగకుండా అటువంటి జగన్ ఒక రిటర్డ్ హై కోర్టు జడ్జిని ఆయన ఎన్నికల అధికారిగా నియమించడం అంటే ఇంతకంటే బాధాకరమైన విషయం ఉంటుందా? అని కూడా తెలివిగా ప్రశించారు. నిజమే ఎవరు అధికారంలో ఉంటే వారే ఇతరులను పదవుల్లో నియమిస్తారు. రాజ్యాంగం ప్రకారం వారు చేసినది కరెక్ట్. అక్కడ జైలు నుంచి వచ్చిన వారు ప్రధానులు, ముఖ్యమంత్రులు కాకూడదు అని నిబంధనలు విధించలేదు కూడా.

మిడిసిపాటేనా…?

ఈ దేశంలో బందిపోటు రాణీ ఫూలాన్ దేవి లోక్ సభకు ఎన్నిక అయింది. అలాగే నక్సలైట్ నాయకులు కూడా ప్రజా ప్రతినిధులు అయ్యారు. ఇక అనేక కేసులలో ఉన్న వారు సైతం ఉన్నత పదవుల్లో ఉన్నారు. నేరం రుజువు కానంతవరకూ వారు నిందితులుగానే ఉంటారు, తప్ప ముద్దాయిలు కారు అంటోంది మన న్యాయ శాస్త్రం. అలాంటపుడు జగన్ మీద సీబీఐ నమోదు చేసినది అభియోగాలు మాత్రమే. ఇక జగన్ జైలుకు వెళ్ళి పదహారు నెలల పాటు రిమాండులో ఉన్న సంగతి కూడా యావత్తూ ఆంధ్ర ప్రజానీకానికి తెలుసు. అన్నీ తెలిసే వారు ఓటేశాక పదే పదే మాజీ మంత్రులు, టీడీపీ పెద్దలు ఈ రకమైన విమర్శలు చేయడం ప్రజాస్వామ్య స్పూర్తికే కాదు, రాజ్యాంగానికి, న్యాయ సూత్రాలకూ విరుధ్ధం అన్నది తెలుసుకోలేరా. ఏది ఏమైనా జగన్ పాలనౌ విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు ఉంది కానీ ఆయన్ని దొంగ అనో, జైలు పక్షి అనో దారుణమైన వ్యక్తిగత విమర్శలు చేయడం మాత్రం ఎన్నుకున్న ప్రజలను కించపరచడమే అవుతుంది.

Tags:    

Similar News