అన్నీ నిలిచిపోయాయి.. కిం క‌ర్తవ్యం..?

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కొన్ని పథకాలు నిలిచిపోయాయి. గ‌డిచిన నెల రోజులుగా దేశంలో విధించిన లాక్‌డౌన్ కార‌ణంగా ఎక్కడిప‌నులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో జగన్ ఎంతో [more]

Update: 2020-04-26 08:00 GMT

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కొన్ని పథకాలు నిలిచిపోయాయి. గ‌డిచిన నెల రోజులుగా దేశంలో విధించిన లాక్‌డౌన్ కార‌ణంగా ఎక్కడిప‌నులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించినప‌థ‌కాలు ఎక్కడి గొంగ‌ళి అక్కడే అన్నచందంగా మారిపోయాయి. ఈ ప‌రిణామం ప్రభుత్వానికి త‌ల‌నొప్పిగా మారిన‌ప్పటికీ.. రాష్ట్రంలో క‌రోనా ఎఫెక్ట్ రోజు రోజుకు పెరుగుతున్న నేప‌థ్యంలో ఆయా కార్యక్రమాల‌ను ముందుకు తీసుకు వెళ్లే ప‌రిస్థితి ఎక్కడా క‌నిపించ‌డం లేదు. ఈ నెల 20 నుంచి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌కు కొన్ని వెసులుబాట్లు క‌ల్పించింది. ప‌నులు చేసుకునేందుకు అవ‌కాశం ఇచ్చింది.

ప్రతి రూపాయినా….

అయితే, ఆయా ప‌నుల‌ను కేవ‌లం గ్రీన్ జోన్ల‌లో మాత్రమే చేప‌ట్టాల్సి ఉంటుంద‌ని, రెడ్ జోన్ల‌లో వేలు పెట్టేందుకు, ప్రజ‌లు బ‌య‌టకు వ‌చ్చేందుకు, ప‌నులు చేసుకునేందుకు అవ‌కాశం లేద‌ని తేల్చి చెప్పింది. మ‌న రాష్ట్రం విష‌యానికి వ‌స్తే.. మొత్తం 13 జిల్లాల్లో కేవ‌లం విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం మిన‌హా అన్ని జిల్లాలు రెడ్ జోన్ల లోనే ఉన్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో ఎలాంటి ప‌నులు చేప‌ట్ట డానికి వీల్లేదు. పోనీ.. క‌రోనా ఇప్పట్లో వ‌దిలేలా క‌నిపిస్తోందా? అంటే అది కూడా లేదు. క‌రోనా ఎఫెక్ట్ మ‌రో ఆరు మాసాలు ఉంటుంద‌ని గ‌ణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప‌రిస్థితులు అన్నీ చ‌క్కబ‌డే స‌రికి ప్రభుత్వం వ‌ద్ద నిధులు కూడా నిండుకుంటాయి. దీంతో ప్రతి రూపాయినీ జాగ్రత్తగా ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్పడ‌డం ఖాయం.

ఇళ్ల స్థలాల పంపిణీ దగ్గర నుంచి…

ఫ‌లితంగా సీఎం జ‌గ‌న్ ప్రతిష్టాత్మకంగా భావించిన పేద‌ల‌కు ఇళ్ల పంపిణీ ఇప్పట్లో జ‌రిగేలా క‌నిపించ‌డం లేదు. అదే స‌మ‌యంలో విద్యా సంస్థల్లో ప్రతిష్టాత్మ‌కంగా భావించిన నాడు-నేడు కార్యక్రమాన్ని కూడా చేప‌ట్టే ప‌రిస్థితి లేదు. ఇక‌, మిగిలిన కార్యక్రమాల‌కు కూడా నిధులు వెచ్చించే ప‌రిస్థితి లేదు. మ‌రో కీల‌క ప్రాజెక్టు పోల‌వ‌రం, క‌డ‌ప ఉక్కు ప‌రిశ్రమ‌ల విష‌యం కూడా వెనుక‌బ‌డి పోతుంద‌ని అంటున్నాయి. పోల‌వ‌రం ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో చూస్తే ఈ ప్రభుత్వం తన హ‌యాంలో పూర్తి చేయగలదా? అన్న సందేహాలు అంద‌రికి వ‌చ్చేశాయి.

వచ్చే రెండేళ్ల పాటు….

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే రెండేళ్లపాటు కూడా ప్రభుత్వం ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి వెంటాడుతుంద‌ని చెబుతున్నారు. ఇదే జ‌రిగితే.. కొన్ని పథకాలపై జ‌గ‌న్ ప్రభుత్వం పెట్టుకున్న ఆశ‌ల‌ను క‌రోనా క‌బ‌ళించింద‌నే చెప్పాల్సి ఉంటుంది. ఇక‌, ఎన్నిక‌ల నాటికి ఈ ప‌రిస్థితి మెరుగు ప‌డిన‌ప్పటికీ.. చెప్పుకొనేందుకు ఏమీ ఉండే అవ‌కాశం కూడా లేదు. మ‌రి జ‌గ‌న్ త‌న వ్యూహాన్ని ఎలా మార్చుకుని ఎలా అమ‌లు చేస్తారో ? చూడాలి.

Tags:    

Similar News