వాళ్లే నా టార్గెట్… ఏరివేత కొనసాగుతున్నట్లేనట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయి పదకొండు నెలలు కావస్తుంది. అయితే తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా చంద్రబాబు పరోక్షంగా అడ్డుతగులుతున్నారని జగన్ భావిస్తున్నారు. అందుకే [more]

Update: 2020-04-21 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయి పదకొండు నెలలు కావస్తుంది. అయితే తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా చంద్రబాబు పరోక్షంగా అడ్డుతగులుతున్నారని జగన్ భావిస్తున్నారు. అందుకే చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న అధికారులను ఒక్కొక్కరిగా తప్పించుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే ముఖ్యమైన స్థానాల్లో చంద్రబాబు హయాంలో పనిచేసిన అధికారులను నియమించలేదు. చంద్రబాబుకు సన్నిహితులుగా ఉన్న వారిని అప్రధాన పోస్టులకు పంపారు. దీంతో పాటు ఇప్పటికి ముగ్గురు అధికారులపై జగన్ చర్యలు తీసుకున్నారు.

ఏబీ వెంకటేశ్వరరావుతో మొదలై…..

జగన్ అధికారంలోకి రాగానే తొలుత దృష్టి పెట్టింది ఏబీ వెంకటేశ్వరరావుపైన. ఆయన చంద్రబాబు హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను అప్పట్లో పార్టీలోకి రప్పించింది కూడా ఏబీ వెంకటేశ్వరరావునే అని అంటారు. తొలుత ఆయనను ఏసీబీకి బదిలీ చేసిన జగన్ తర్వాత ఏబీ వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేశారు. సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో ఏబీ వెంకటేశ్వరరావు అవకతవకలకు పాల్పడినట్లు భావించి చర్యలు తీసుకున్నారు. దీనిని కేంద్ర హోంశాఖ కూడా సమర్ధించింది. ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ ను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది.

జాస్తి కృష్ణ కిషోర్ ను…..

ఇక మరో అధికారి జాస్తి కృష్ణ కిషోర్. ఆయన కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి డిప్యూటేషన్ పై చంద్రబాబు హయాంలో ఏపీకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేశారు. అయితే జాస్తి కృష‌్ణ కిషోర్ ఆర్థిక అభివృద్ధి మండలిలో అవకతవకలకు పాల్పడ్డారని జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే దీనిపై జాస్తి కృష్ణ కిషోర్ క్యాట్ ను ఆశ్రయించారు. ఆయన సస్పెన్షన్ ను క్యాట్ రద్దు చేసింది. విచారణలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకోవచ్చని, కానీ సస్పెన్షన్ సరికాదని క్యాట్ అభిప్రాయపడింది. ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతించింది.

నెక్ట్స్ ఎవరో? అనేది?

మూడో అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఈయన రిటైర్ట్ ఐఏఎస్ అయినప్పిటికీ గత చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించింది. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం జగన్ ఆగ్రహానికి కారణమయింది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పించి ఆయన స్థానంలో రిటైర్డ్ జడ్జి కనగరాజ్ ను నియమించారు. అయితే ఈ ముగ్గూరు ఒకే సామాజిక వర్గం వారన్నది టీడీపీ నేతల ఆరోపణ. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు జగన్ సర్కార్ కులం అంటగడుతుందని ఆరోపిస్తున్నారు. జగన్ మాత్రం చంద్రబాబు సహకరించేవారిని ఎవరినీ ఉంచడం లేదు. పసిగట్టి మరీ ఏరిపారేస్తున్నారు. కరోనా సమయమని కూడా చూడటం లేదు. మరికొందరు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. నెక్ట్ టార్గెట్ ఎవరన్న చర్చ ఇటు అధికారుల్లోనూ, టీడీపీలోనూ జరుగుతుండటం విశేషం.

Tags:    

Similar News