రాక రాక వచ్చిన అవకాశాన్ని జగన్?

జగన్ పోరటయోధుడే. కానీ జీవితమంతా పోరాటం చేయమంటే ఆయనకూ చాలా కష్టమే. ఆయన పదేళ్ళ రాజకీయ జీవితం పూర్తిగా ముళ్ళ బాట. పోనీ ఇన్నాళ్ళకు జనం ఆశీర్వదించి [more]

Update: 2020-04-24 05:00 GMT

జగన్ పోరటయోధుడే. కానీ జీవితమంతా పోరాటం చేయమంటే ఆయనకూ చాలా కష్టమే. ఆయన పదేళ్ళ రాజకీయ జీవితం పూర్తిగా ముళ్ళ బాట. పోనీ ఇన్నాళ్ళకు జనం ఆశీర్వదించి బంపర్ మెజారిటీతో అధికారం దక్కిందనుకుంటే జగన్ ఏమైనా సుఖపడుతున్నాడా? కష్టాల మీద కష్టాలు అలా వెల్లువలా దూసుకువస్తున్నాయి. జగన్ కి అన్ని విధాలుగా అగ్ని పరీక్షనే పెడుతున్నాయి. జగన్ అనుకున్నది ఒకటి జరుగుతున్నది మరొకటిగా పరిస్థితి కనిపిస్తోంది. జగన్ ఏ విధంగానూ ముందుకు అడుగులు వేయకుండా చుట్టూ పద్మవ్యూహం ఏర్పడింది. దాన్ని నుంచి బయటపడితేనే జగన్ అజేయుడు అనిపించుకునేది.
అర్జునుడై గెలిచేది, నిలిచేది.

అన్నీ ఆగాయి…

జగన్ ఏది అనుకుంటే అది జరగని సీన్ ఇపుడు కనిపిస్తోంది. మూడు రాజధానుల ముచ్చటకే వస్తే అది ఇప్పటికి ఇలా ఆగినట్లేననుకోవాలి. ఓవైపు కోర్టుల్లో కేసులు ఉన్నాయి. మరో వైపు రాజకీయ పార్టీలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇంకో వైపు కరోనా మహమ్మారి ఎటూ కదలనీయడంలేదు. ఆ సంగతి అలా ఉంటే ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరి చేస్తూ జీవో తీసుకువస్తే వద్దని కోర్టుకెక్కిన పిటిషనర్లు అక్కడ విజయం సాధించారు. ఇక పోలవరం కధ కూడా కరోనా నేపధ్యంలో పడకేసేలా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు, అసలు జగన్ ఇచ్చిన నవరత్నాలు అయినా వచ్చే నాలుగేళ్ళూ అమలుకు నోచుకుంటాయా? అన్నది ఇపుడు పెద్ద చర్చగా ఉంది.

పెను సవాలేనా?

ఇవన్నీ ఒక ఎత్తు కరోనాను కట్టడి చేయడం మరో ఎత్తుగా పరిస్థితి ఉంది. ఈ విషయంలో ఎన్ని చేస్తున్నా కూడా మహమ్మారి దారికి రావడంలేదు. సరే ఏదోలా దాన్ని అదుపులోకి తెచ్చినా ఆ తరువాత పరిస్థితి ఏంటి? ఆర్ధికంగా ఏపీ కునారిల్లిపోయింది. అన్ని విధాలుగా ఏపీ అడుగంటిపోయింది. కేంద్ర సాయం అంటే ఇదివరకే అరకొరగా ఉండేది, ఇంతటి పెను విపత్తులో ఇపుడు అసలు ఆశిస్తే అంతకంటే అమాయకత్వం ఉండదేమో. ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టి ఏపీని మళ్ళీ పూర్వ స్థితికి నిలబెట్టడం అన్నది పెను సవాల్ గా ఉంది. జగనే కాదు, ఆ స్థానంలో చంద్రబాబు కూర్చున్నా అదంత సులువు కాదు. మరి జగన్ ఏ విధంగా తట్టుకుని అన్నీ సమస్యలు చక్కదిద్దుతారో.

చరిత్రలో ఎలా …?

జగన్ కి రాక రాక వచ్చిన ముఖ్యమంత్రి అవకాశం. దాన్ని తాను కాపాడుకుంటూ ముప్పయ్యేళ్ళు పాలిస్తానని, తన తండ్రి ఫోటో పక్కనే తన ఫోటో ఉండాలన్నది ఆశయమని జగన్ చెప్పుకువచ్చారు. మరి వైఎస్సార్ లా చరిత్రలో నిలిచేలా జగన్ పాలన ఇపుడున్న పరిస్థితుల్లో సాగుతుందా. నాడు వైఎస్ కి ఉన్న ఏ వెసులుబాటూ జగన్ కి లేదు. జగన్ ఒంటరి వారుగా ఉన్నారు. మంత్రులు, పార్టీ, ప్రభుత్వం అన్నీ ఉన్నా కూడా జగన్ ఒక్కడే. ఆయనే అన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి. వాటి ఫలాలు, ఫలితాలూ ఆయనే అనుభవించాలి. మరి జగన్ బిగ్ టాస్క్ ని ఎలా ఛేదిస్తారు. ఆయన కనుక ఈ విపత్కర పరిస్థితులను జయించి నిలబడితే మాత్రం చరిత్రలో గొప్పగా చెప్పుకోవడం ఖాయం. మరి ఆ విధంగా జరుగుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News