జగన్ పై ఆ వర్గంలో అంత అసంతృప్తి ఉందా?

నేను లాక్ డౌన్ సమయంలో ఈ మధ్య కొంత పాత మిత్రులతో ఫోన్ లో కాలక్షేపం చేశాను. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకునే ప్రయత్నంలో ఏపీలోని నలుగురైదుగరు [more]

Update: 2020-04-23 05:00 GMT

నేను లాక్ డౌన్ సమయంలో ఈ మధ్య కొంత పాత మిత్రులతో ఫోన్ లో కాలక్షేపం చేశాను. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకునే ప్రయత్నంలో ఏపీలోని నలుగురైదుగరు మిత్రులకు ఫోన్ చేశాను. వారంతా వివిధ వృత్తుల్లో ఉన్నవారే. ఉపాధ్యాయులు ఉన్నారు. వ్యాపారులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగితో పాటు ప్రయివేటు సంస్థలో పనిచేసే ఉద్యోగి కూడా ఉన్నారు. యోగ క్షేమాలతో పాటు కొంత రాజకీయాలను కూడా సహజంగానే మాట్లాడాను. విడతల వారీగా నేను వారితో జరిపిన సంభాషణల్లో నాకు అర్థమయింది జగన్ సంక్షేమ పథకాల పేరిట ప్రజాధనాన్ని పప్పు బెల్లాలుగా పంచి పెడుతున్నారని. ఇది వారి వ్యక్తి గత అభిప్రాయమే కావచ్చు. ఆందోళన కావచ్చు. ఎక్కువమంది ఇలాంటి అభిప్రాయంలోకి వెళితే జగన్ కు కొంత ఇబ్బంది తప్పదు.

ప్రజాధనాన్ని ఇబ్బడి ముబ్బడిగా….

కరోనా లాంటి కష్ట సమయంలోనూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకోకుండా జగన్ సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చిస్తున్నారన్నది కొందరి ఆరోపణ. అమ్మఒడి కార్యక్రమానికి ఒక్కొక్కరికి పదిహేను వేలు చెల్లించి, తన జీతంలో కోత పెట్టడమేంటని నా ఉపాధ్యాయ మిత్రుడి ఆవేదన. లాక్ డౌన్ సమయంలోనూ విద్యార్థుల ఇంటికి బియ్యం, పప్పు, ఉప్పు పంచడం అవసరామా? అని నన్ను ప్రశ్నించడం విశేషం. ఇలా పప్పు బెల్లాలుగా పంచుకుంటూ పోతే ఖాజానా ఖాళీ కాక ఏమవుతుందన్నది వాడి సూటి ప్రశ్న.. నిజమే జగన్ పది నెలల పాలనలో ఎక్కువగా సంక్షేమ పథకాలపైనే దృష్టి పెట్టారు.

సంక్షేమ పథకాలకు…..

అమ్మఒడి, ఫీజు రీఎంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ, ఆటోవాలాలకు పది వేలు, చివరకు దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనా బాధితులు కోలుకున్న వెంటనే రెండు వేలు ఇస్తూ జగన్ ఒక వర్గం ప్రజలకు చేరువవుతున్నారనే చెప్పాలి. అయితే నేను మాట్లాడిన వారంతా మధ్యతరగతి జీవులే. వారందరిదీ ఒకటే మాట. జగన్ కు ముందు చూపు లేదన్నది. అడిగినా, అడగకున్నా ఇలా పంచుకుంటూ వెళితే భవిష్యత్ లో ఎవరికి నష్టం అనేది గుర్తించడం లేదని వారంతా భావిస్తున్నారు.

కొన్ని వర్గాలు దూరమయ్యే….

ఆంధ్రప్రదేశ్ లో ఒకవర్గంలో మాత్రం జగన్ ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతుందన్నది వాస్తవం. ఇది నిధుల విడుదల చేయడం కావచ్చు. రాజధాని మార్పు కావచ్చు. ఏకపక్ష నిర్ణయాలు కావచ్చు. పేద వర్గాలను పక్కన పెడితే మధ్య, ఎగువ తరగతి వర్గాల్లో ఎక్కువ శాతం మంది ప్రజలు జగన్ పాలనపై పెదవి విరుస్తున్నారని చెప్పక తప్పదు. ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కన్పించే అవకాశముందని చెబుతున్నారు. అయితే ఈ వర్గం ప్రజలు ఎంత శాతం మంది ఉన్నారని, వారు ఏ మేరకు ప్రభావం చేస్తారన్నది పక్కన పెడితే జగన్ ప్రభుత్వం కొంత ఆలోచించుకుని అడుగులు వేయాల్సిన పరిస్థితి.

Tags:    

Similar News