జగన్ పెద్ద గీతే గీసినట్లుందిగా?

ప్రస్తుతం ఏపీ లో రాజకీయాలు కరోనా వైరస్ చుట్టూ తిరుగుతున్నాయి. ముందు సూచనలు, సలహాల పేరిట మీడియా లో రోజు కనిపించిన చంద్రబాబు ఆ తరువాత దూకుడు [more]

Update: 2020-04-12 06:30 GMT

ప్రస్తుతం ఏపీ లో రాజకీయాలు కరోనా వైరస్ చుట్టూ తిరుగుతున్నాయి. ముందు సూచనలు, సలహాల పేరిట మీడియా లో రోజు కనిపించిన చంద్రబాబు ఆ తరువాత దూకుడు పెంచారు. ఆయనకు తోడు తనయుడు నారా లోకేష్ ఆ వెనుక యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, బుద్దా వెంకన్న, బోండా ఉమ తదితరులంతా సందు దొరికినప్పుడల్లా జగన్ సర్కార్ ను ఒక ఆట ఆడేసుకుంటున్నారు. దీనికి తోడు అక్కడక్కడ వైద్య రంగంలో ఎదురవుతున్న సమస్యలు టిడిపి ఆరోపణలకు మరింత ఆజ్యం పోశాయి. ఇందులో కొన్ని రాజకీయ కారణాలతో కూడినవి అయినప్పటికీ ప్రజల్లో వైసిపి సర్కార్ పనితీరు బాగోలేదనే అభిప్రాయాన్ని వేగంగా వ్యాప్తి చెందేలా చేయడంలో విజయం సాధించారు.

గట్టి దెబ్బలు కొట్టింది అందుకేనా …?

ఈ వ్యవహారం మొదట్లో లైట్ తీసుకున్న జగన్ సర్కార్ ఇక లాభం లేదని టాపిక్ ని డైవర్ట్ చేసే కార్యక్రమానికి వ్యూహం రూపొందించినట్లే కనిపిస్తుంది. ఇందులో అమరావతి వ్యవహారం మరోసారి చర్చకు తీసుకురావడం. అది సరిపోలేదనే ఎన్నికల సంఘం అధ్యక్షుడు పదవీకాలం తగ్గించడం, ప్రస్తుతం ఉన్న ఆయన్ను సాగనంపి కొత్త వ్యక్తిని ఆఘమేఘాలపై నియమించడం వంటివి తెరపైకి తెచ్చారు. అనుకున్నట్లే ఇప్పుడు టిడిపి ఆరోపణలు విమర్శలు అన్ని ఇప్పుడు ఈ రెండు అంశాలకే మొదటి ప్రాధాన్యత అన్నట్లు మారిపోయింది. మూడో ప్రాధాన్యత అంశంగా కరోనా వైరస్ వ్యవహారంలో లోపాలు ఎత్తిచూపే ప్రక్రియ చేరిపోయింది.

ఎత్తుకి పైఎత్తు …

ఒక గీత చిన్నది చేయాలంటే పెద్ద గీత పెడితే సరిపోతుందనే రాజకీయ లెక్కతోనే టిడిపి పై మైండ్ గేమ్ స్టార్ట్ చేసి పైచెయి సాధించే ప్రయత్నంలో పడింది వైసిపి. ప్రస్తుతం ప్రజలకు ఇతర అంశాలు ప్రాధాన్యత కాదు. కేవలం కరోనా వ్యవహారం తప్ప ఎలాంటి రాజకీయాలను పట్టించుకోవడం లేదు. రాజకీయ విమర్శలు ఆరోపణలు చూడటమే వదిలేశారు. ఇదే అదనుగా వైసిపి సర్కార్ టిడిపి కి చుక్కలు చూపించాలనే డిసైడ్ అయినట్లు కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీన్ని చంద్రబాబు ఎలా తిప్పికొడతారో చూడాలి.

Tags:    

Similar News