జగన్ పంటి బిగువున భరిస్తున్నారా?

రెండు తెలుగు రాష్ట్రాలుగా ఉండడం వల్ల ప్రతీ దానికీ పోలిక పెట్టాల్సివస్తోంది. ఎందుకంటే ఆరేళ్ళ క్రితం వరకూ రెండూ ఉమ్మడి రాష్ట్రంలో భాగమే కాబట్టి. ఏ సమస్య [more]

Update: 2020-04-09 05:00 GMT

రెండు తెలుగు రాష్ట్రాలుగా ఉండడం వల్ల ప్రతీ దానికీ పోలిక పెట్టాల్సివస్తోంది. ఎందుకంటే ఆరేళ్ళ క్రితం వరకూ రెండూ ఉమ్మడి రాష్ట్రంలో భాగమే కాబట్టి. ఏ సమస్య వచ్చినా కూడా ముందు ఒక రాష్ట్రంలో ఎలా ఉంది అని మరో రాష్ట్రంలో ఆరా తీసే పరిస్థితి ఉంది. ఇక ఏపీలో అధికారంలోకి జగన్ వచ్చాక కొన్నాళ్ళ పాటు కేసీఆర్ ని తన దూకుడు నిర్ణయాలతో ఇబ్బంది పెట్టారు. అందులో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చాలా కీలకమైనది. ఇక జగన్ పాలన తొలి ఏడాది ముగియబోతోందనగా కేసీఆర్ వైపు నుంచి ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయని అంటున్నారు. కేసీఆర్ సహజంగానే తెలివైన నేతగా గుర్తింపు ఉంది. ఇక రాజకీయ వ్యూహాలను రూపొందిచడం, సందర్భానుసారంగా వ్యవహరించడంలో దిట్ట.

లాక్ డౌన్ విషయంలో …..

కేసీఆర్ తాజాగా లాక్ డౌన్ ఎత్తివేయవద్దని కేంద్రాన్ని కోరినట్లుగా మీడియా సమావేశంలో చెప్పారు. లాక్ డౌన్ ఉంటేనే దేశానికి శ్రీరామ రక్ష అని, లేకపోతే ఇండియా కూడా ఇటలీ, స్పెయిన్ మాదిరిగా మారిపోతుందని కూడా ఆయన‌ విశ్లేషించారు. కేసీయార్ అభిప్రాయంతో దేశంలోని చాలామంది సీఎంలు కూడా మద్దతుగా మాట్లాడారు. ఇక కేంద్రం సైతం ఈ విషయంలో లాక్ డౌన్ పొడిగించేందుకే సుముఖంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్పేశారు. అంటే లాక్ డౌన్ మరికొన్నాళ్ళు తప్పదన్నమాట. ఇది నిజంగా ఏపీకి ఇబ్బందికరమేనని అంటున్నారు.

జగన్ ఆలోచన అలా….

ఇక లాక్ డౌన్ విషయంలో జగన్ సర్కార్ ఆలోచనలు వేరేగా ఉన్నాయట. ఏప్రిల్ 14 తరువాత ఎపీలో లాక్ డౌన్ ని కొన్ని ప్రాంతాల్లో సడలించాలనుకుంటున్నట్లుగా ప్రభుత్వ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. కేవలం హాట్ స్పాట్స్, రెడ్ జోన్ ఏరియాల్లో మాత్రమే లాక్ డౌన్ని కొనసాగించి మిగిలిన చోట్ల ఎత్తివేయాలన్నది జగన్ ఆలోచన‌గా ఉందని చెబుతున్నారు. దీని వల్ల ఏపీలో ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకుంటాయని, ఏపీకి ఎంతో కొంత ఆదాయం వస్తుందని జగన్ సర్కార్ ఉద్దేశ్యంగా చెబుతున్నారు. ఇక జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న సినిమా హాళ్ళు, పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాలు వంటివాటిలో యధావిధిగా నిషేధం కొనసాగించి మెల్లగా బిజినెస్ సర్కిళ్ళల్లో వ్యాపార కార్యకలాపాలకు అవకాశం ఇవ్వాలని జగన్ ప్రభుత్వం ఆలోచిస్తోందిట. ఇపుడు కేసీయార్ నిర్ణయంతో జగన్ సర్కార్ పూర్తిగా ట్రబుల్లో పడిందని అంటున్నారు.

ఇక కుదేలేనా…?

ఇక ఏపీలో మరికొంతకాలం కనుక లాక్ డౌన్ కొనసాగితే ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా కుదేలు అవుతుందని జగన్ సర్కార్ భయపడుతోందిట. ఇప్పటికే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఏపీ ఆర్ధిక రంగం ఉందని అంటున్నారు. చేతికి ఒక్క రూపాయి రాదు, ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. దీంతో పంటి బిగువున 21 రోజుల లాక్ డౌన్ ను జగన్ సర్కార్ భరించింది. ఆ మాటకు వస్తే కేంద్రం లాక్ డౌన్ దేశవ్యాప్తంగా పెట్టకపోతే మార్చి 31తో ఎత్తివేయాలని జగన్ సర్కార్ మొదట అనుకుందిట. ఇక ఇపుడు ఓ వైపు ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నా అవన్నీ ఢిల్లీ ప్రార్ధనలకు వెళ్ళి వచ్చిన వారు, వారితో పాటు అంటించుకున్న వారే తప్ప కొత్తగా కేసులు పెరగలేదని వైసీపీ సర్కార్ భావిస్తోందిట. పైగా ఏపీలో కొన్ని జిల్లాలకే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని అంటున్నారు. దీంతో లాక్ డౌన్ కొనసాగించడంపైన వైసీపీలో కొంత భిన్నమైన అభిప్రాయం ఉందని అంటున్నారు. ఇదే విషయాన్ని మంత్రి పేర్ని నాని కూడా మీడియాకు చెప్పుకొచ్చారు. కరోనా ప్రభావం ఉన్న కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ని పరిమితం చేస్తే మంచిదని కూడా ఆయన అంటున్నారు. మొత్తానికి కేంద్రం కనుక లాక్ డౌన్ ని కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంటే ఏపీ బిగ్ ట్రబుల్లో పడడం ఖాయం అంటున్నారు.

Tags:    

Similar News