జగన్ సైతం బాబు బాటలోనేనా?

ఏపీలో ఏం చేస్తున్నారు అని అంటే అప్పు చేసి పప్పు కూడు తింటున్నారు అని సమాధానం చెప్పుకోవాలి. నిజమే ఏపీ అంటే ఒకనాడు అన్న పూర్ణ. దేశానికి [more]

Update: 2020-04-11 02:00 GMT

ఏపీలో ఏం చేస్తున్నారు అని అంటే అప్పు చేసి పప్పు కూడు తింటున్నారు అని సమాధానం చెప్పుకోవాలి. నిజమే ఏపీ అంటే ఒకనాడు అన్న పూర్ణ. దేశానికి ధాన్యాగారం. కానీ ఇపుడు ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుల మూట. నవ్యాంధ్రా రుణాంధ్రాగా మారుతోంది. ఇది ఒక్క రోజులో జరగలేదు. గత ఆరేళ్ళుగా, ఇంకా చెప్పాలంటే నవ్యాంధ్రా పుట్టుకే అలా ఉందేమో. దాదాపుగా తొంబై వేల కోట రూపాయల అప్పులతో నవ్యాంధ్ర ఏర్పడింది. అప్పులు సమానంగా భాగం చేయలేదు, వివక్ష చూపించారని ఏపీ పెద్దలు గోలపెట్టినా కేంద్ర పెద్దలు తాంబూలలు ఇచ్చేశారు. తన్నుకు చావమన్నారు. దాంతో అంతే అప్పు అనుకుంటే అనుభవశాలి, అప్పటికి రెండు మార్లు సీఎం గా అనుభవం ఉన్న చంద్రబాబు తన అయిదేళ్ళ జమానాలో దాదాపుగా రెండున్నర లక్షల కోట్ల వరకూ కొత్తగా అప్పులు చేశారు. అది తడిసి మోపెడై మూడున్నర లక్షల కోట్ల అప్పుతో జగన్ సీఎం గా ఉన్న వేళకు ఏపీ తయారైంది.

అపుడే నలబై వేల కోట్లా…?

ఇక జగన్ పది నెలల పాలన ముగిసే వేళకు ఏపీలో అదనంగా మరో నలభై వేల కోట్లు అప్పు చేశారని టీడీపీలో తలపండిన మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు సెలవిచ్చారు. అంటే నెలకు నాలుగు వేల కోట్ల వంతున జగన్ సర్కార్ అప్పు చేసిందనుకోవాలి. ఇందులో నిజానిజాలు తెలియవు. ఎందుకంటే జగన్ సర్కార్ శ్వేతపత్రం ప్రకటించలేదు కాబట్టి. మొత్తానికి అంత కాకపోయినా కొంత అయినా అప్పు చేసి ఉండకపోతే ఏపీ బండి లాగడం కష్టం కాబట్టి జగన్ కూడా అదే రూట్లోకి వెళ్ళి ఉంటారన్నది నమ్మాల్సివస్తోంది.

పదివేల కోట్లట….

ఇక ఇపుడు చూసుకుంటే జగన్ సర్కార్ కరోనా వైరస్ కారణంగా, లాక్ డౌన్ నేపధ్యంలో ఏపీ ఆర్ధికంగా కుదేలు అయిందని దిగాలు పడుతోంది. కేంద్రాన్ని ఆదుకోమని కోరుతున్నా కూడా అది ఎంతవరకూ సాకారం అవుతుందో ఎవరికీ తెలియదు. ఇంకో వైపు ఉద్యోగుల జీతాలు, ప్రభుత్వ పెన్షనర్ల నెలవారీ సొమ్ము కూడా పెండింగులో పెట్టారు. ఈ నెలకు కాకపోయినా వచ్చేనెలకైనా ఈ మొత్తాలు చెల్లించాల్సిందే. లాక్ డౌన్ వల్ల కనీసంగా ఆరు నెలల వరకూ ఏపీ ఆర్ధికంగా కోలుకోదని అంటున్నారు. దాంతో అన్ని లెక్కలూ వేసుకున్న జగన్ సర్కార్ భారీ ఎత్తున అప్పు కోసం రెడీ అయిపోతోంది. కనీసంగా పదివేల కోట్లు అయినా లేకపోతే బతకలేమని కూడా నిర్ధారణకు వచ్చింది దాంతో కేంద్రాన్ని అప్పులపైన ఉన్న పరిమితిని తొలగించమని కోరుతోందిట.

కుదేలేనా…?

ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎక్కడా ఆర్దిక కార్యకలాపాలు జరగడం లేదు, ,ప్రదానంగా ఎక్సైజ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ లు, వాహనాల విక్రయ రిజిస్ట్రేషన్ లు మొదలైనవి అన్నీ నిలిచిపోయాయి. మరో వైపు ప్రతి వారం సగటున రూ.100 కోట్ల వరకు ఉండే రిజిస్ట్రేషన్ల ఆదాయం మార్చి చివరి వారంలో కేవలం రూ.3.08 కోట్లకే పరిమితమైందిట. ఇంకో వైపు మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. రోజుకు రూ.65 కోట్లు విలువ చేసే మద్యం అమ్మకాలు ఉంటాయి. అందులో దాదాపు 80 శాతం ప్రభుత్వానికి ఆదాయంగా వస్తుందనేది ఒక అంచనా. ఇక మార్చిలో కేవలం రూ.178 కోట్ల ఆదాయమే సమకూరింది. ఇందులో రూ.100 కోట్లు నష్టపోయినట్టు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాలుగా నెలకు రూ.15 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు వేసుకున్నారు.ఈ నేపధ్యంలో తొలి త్రైమాసికంలో రూ.10 వేల కోట్ల అదనపు రుణం రిజర్వు బ్యాంకు ద్వారా సమకూర్చుకునేందుకు ఎఫ్ఆర్బీఎం పరిమితి నుంచి మినహాయించాలని సైతం రాష్ట్రం కోరుతోంది. మరి దీనికి ఎంతవరకూ ఆమోదం లభిస్తుంది అన్నది చూడాలి. ఏది ఏమైనా ఏపీ అప్పులకుప్పగా మారుతోంది అన్నది సత్యం.

Tags:    

Similar News