2021కి గాని దీనిపై క్లారిటీకి రాలేరట?

రాజధాని అమరావతి నుంచి తరలించేందుకు జగన్ కు మరికొంత సమయం పడుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మూడు రాజధానుల ప్రతిపాదన జగన్ చేసి మూడు నెలలకు [more]

Update: 2020-04-06 12:30 GMT

రాజధాని అమరావతి నుంచి తరలించేందుకు జగన్ కు మరికొంత సమయం పడుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మూడు రాజధానుల ప్రతిపాదన జగన్ చేసి మూడు నెలలకు పైగానే అవుతుంది. అప్పటి నుంచి అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. జగన్ ప్రభుత్వం మాత్రం తాము మూడు రాజధానుల ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నామని చెబుతోంది.

ఈ నెల చివరికే…?

నిజానికి ఏప్రిల్ చివరి నాటికి పరిపాలన రాజధానిని విశాఖపట్నంకు తరలించాలన్నది జగన్ నిర్ణయం. ఈ మేరకు అన్ని శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఉద్యోగ సంఘాలకు కూడా మౌఖికంగా చెప్పారు. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం మే చివరి లోపు పరిపాలన రాజధానిని తరలిస్తే తాము వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించాయి. స్కూళ్లు తిరిగి జూన్ లో ప్రారంభం కానుండటంతో తాము మే నెలలో అయితేనే షిఫ్టింగ్ సిద్ధమని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పాయి.

అన్ని కసరత్తులు పూర్తి చేసినా…

ఈ మేరకే పది రోజుల క్రితం వరకూ కసరత్తు జరిగింది. విశాఖలోని అనేక కార్యాలయాలను అధికారులు పరిశీలించారు. ఏ ఏ శాఖను ఎక్కడ ఉంచాలన్న దానిపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. కొత్త సచివాలయాన్ని నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కూడా పరిశీలించారు. ఇక్కడ భూసమీకరణ కూడా చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థలు ఎన్నికల రావడంతో కొంత వాయిదా పడింది.

కరోనా ఎఫెక్ట్ తో…..

ఇక కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో సచివాలయాన్ని ఇప్పట్లో తరలించడం సాధ్యం కాదన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఏప్రిల్ 14 వతేదీన లాక్ డౌన్ పాక్షికంగా తొలగిస్తారంటున్నారు. జిల్లాల మధ్య రాకపోకల నిషేధం మరికొంత కాలం కొనసాగించాల్సిన అవసరం ఉంది. మే నెలలోపు రాజధాని తరలింపు ప్రక్రియ సాధ్యం కాకుంటే మరో ఏడాది పట్టే అవకాశముంది. మే నెల వరకూ అయితే తరలింపు సాధ్యం కాదని ఉన్నతాధికారులు సయితం స్పష్టం చేస్తున్నారు. దీంతో జగన్ రాజధాని తరలించడానికి మరో ఏడాది పాటు వెయిట్ చేయాల్సిందేనంటున్నారు.

Tags:    

Similar News