ఆరునెలలు గండం నుంచి గట్టెక్కేదెలా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కష్టకాలమనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకూ తాను ఏం నిర్ణయం తీసుకున్నా చెల్లుబాటు అయింది. 151 మంది శాసనసభ్యుల బలం ఉన్న [more]

Update: 2020-04-05 15:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కష్టకాలమనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకూ తాను ఏం నిర్ణయం తీసుకున్నా చెల్లుబాటు అయింది. 151 మంది శాసనసభ్యుల బలం ఉన్న జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. తొలి ఏడాది సంక్షేమ కార్యక్రమాలను పెద్దయెత్తున అమలు పర్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తాను ఎన్నికల మ్యానిఫేస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ గ్రౌండ్ చేసే పనిలోనే గత పదినెలలుగా జగన్ ఉన్నారు. భవిష్యత్తులో పార్టీకి మేలు చేకూరుతుందన్న భావనతోనే తొలి ఏడాది జగన్ దృష్టంతా సంక్షేమ పథకాలపైనే ఉంది.

పెట్టుబడులు లేక…..

ఇక జగన్ తీసుకున్న నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు ఈ ఏడాది కాలంలో పెద్దగా రాలేదు. ప్రధానంగా మూడు రాజధానుల అంశం దాదాపు నాలుగు నెలల నుంచి నలుగుతూనే ఉంది. శాసనమండలి రద్దు రాజకీయ నిర్ణయమైనా దాని ప్రభావం కూడా వ్యక్తిగతంగా జగన్ పై పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పదవులు రాక వైసీపీ నేతలు నైరాశ్యంలోకి వెళితే దాని ప్రభావం భవిష్యత్తులో కన్పిస్తుంది. అయినా అన్నింటినీ దాటుకుని రెండో సంవత్సరం అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని జగన్ భావించారు.

సంక్షేమ పథకాలు…

అయితే ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ జగన్ ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పొరుగునే ఉన్న అత్యధిక ఆదాయం కలిగిన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించింది. జీతాలు చెల్లించలేని పరిస్థితి పదిరోజుల్లోనే అక్కడ కన్పించింది. ఇక కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఇంకా ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల వేతనాలను వాయిదా వేసినా భవిష్యత్తులో చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు తాను పది నెలల్లో గ్రౌండ్ చేసిన సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి ఉంటుంది. వీటికి వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉంది.

రానున్న కాలంలో కష్టాలేనా?

కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి చేయూతనందిస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది. కానీ కరోనా ఎఫెక్ట్ దాదాపు ఆరు నెలలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపే అవకాశముందంటున్నారు. అంటే మరో ఆరు నెలల పాటు రాష్ట్రానికి ఆదాయం ప్రభుత్వం ఊహించిన రీతిలో రాకపోవచ్చు. దీంతో సంక్షేమ పథకాల అమలు కష్టమేనన్న అభిప్రాయం వైసీపీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. ఒక్కసారిగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతోనే ఈ సమస్య తలెత్తిందనే వారూ లేకపోలేదు. మొత్తం మీద జగన్ కు వచ్చే ఆరు నెలలు కష్టమేనంటున్నారు ఆర్థిక నిపుణులు. మరి జగన్ ప్రభుత్వం ఏ మేరకు ఈ గండం నుంచి బయటపడుతుందో చూడాల్సి ఉంది

Tags:    

Similar News