జగన్ కి కూడా ఆ సెగ ?

జగనే సర్వాధినాయకుడు. ఆయనే పార్టీకి, ప్రభుత్వానికి కర్త, కర్మ, క్రియ. అటువంటి పార్టీలో జగన్ లేకపోతే ఏమీ జరగదు. జగన్ నిర్ణయమే అక్కడ ఫైనల్. అటువంటి జగన్ [more]

Update: 2020-04-02 02:00 GMT

జగనే సర్వాధినాయకుడు. ఆయనే పార్టీకి, ప్రభుత్వానికి కర్త, కర్మ, క్రియ. అటువంటి పార్టీలో జగన్ లేకపోతే ఏమీ జరగదు. జగన్ నిర్ణయమే అక్కడ ఫైనల్. అటువంటి జగన్ ఇపుడు ఒక్కసారిగా తలుపులు బార్లా తెరిచేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, పెద్ద ఎత్తున టీడీపీ నుంచి నేతలను తీసుకుంటున్నారు. వారు రావడం వల్ల పార్టీలో ఉన్న నేతలు నలిగిపోతున్నారు. తమకు పోటీ గట్టిగా ఎదురవుతోందని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో జగన్ ఎందుకిలా చేస్తున్నారని నేతలు మధనపడుతున్నారు.

సీమ‌లో కత్తులే…

రాయలసీమలో నాయకులకు పార్టీలు కాదు, పరువు ముఖ్యం. అంతకంటే వ్యక్తిగత కక్షలనే పెద్ద పీట వేస్తారు. ఓ నాయకుడు ఒక పార్టీకో ఉంటే ప్రత్యర్ధి వేరే పార్టీలోకి వెంటనే దూకేస్తారు. అదీ సీమ రాజకీయం. దాన్ని సరిచేయాలని నాడు చంద్రబాబు అనుకున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఇద్దరు మాజీ మంత్రులు ఆది నారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్యన రాజీ చేశారు. కానీ చివరికి ఇద్దరూ కలవలేదు, పార్టీ పోయింది. ఇపుడు చూస్తే రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గోల పెడుతున్నారు. ఇదే పరిస్థితి మిగిలిన చోట్లా ఉంది.

హర్ట్ అవుతున్నారా…?

ఇక కర్నూలు జిల్లాలో చూసుకుంటే ప్రత్తికొండను కేఈ కుటుంబం నుంచి గెలుచుకుని చెరుకువాడ నారాయణ రెడ్డి సతీమణి శ్రీదేవి ఎమ్మెలేగా నెగ్గారు. ఇపుడు కేఈ కుటుంబం నుంచి ప్రభాకర్ వైసీపీలోకి రావాలనుకుంటున్నారు. మరి దానికి జగన్ అంగీకరిస్తారని కూడా టాక్ నడుస్తోంది. అదే కనుక జరిగితే తన భర్తను హత్య చేయించింది కేఈ కుటుంబమేనని పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేసి ఎమ్మెల్యే అయ్యారు. న్యాయ పోరాటం చేస్తున్నారు. మరి ఆమె వర్గీయులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం ఖాయం. అలాగే చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కూడా బడా టీడీపీ నేతలు వైసీపీ వైపు చూస్తున్నారు. వారిని కనుక జగన్ ఆదరిస్తే అక్కడ వైసీపీలో సెగలు పొగలు రావడం ఖాయం. ఈ బాధ నగరి ఎమ్మెల్యే రోజాకు ఉన్నట్లుగా చెబుతున్నారు. అక్కడ మాజీ మంత్రి ముద్దు కృష్ణమ నాయుడు కుటుంబం నుంచి భారీ జంపింగు వైసీపీలోకి ఉంటుందని అంటున్నారు.

జగన్ సైతం..?

ఇవన్నీ ఇలా ఉంటే ఏకంగా పార్టీ అధినేత జగన్ సైతం ఈ రకమైన బాధనే అనుభవిస్తున్నారని అంటున్నారు. ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో దశాబ్దాలుగా వైరంతో ఉన్న సతీష్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన నేడో రేపో వైసీపీ గూట్లో చేరడం ఖాయం. అయితే జగనే కాదు, ఆయన తండ్రి, తాతల నుంచి సతీష్ రెడ్డి కుటుంబంతో వ్యక్తిగత వైరం ఉంది. జగన్ తాత రాజారెడ్డి హత్య కేసులో సతీష్ కుటుంబంపైన ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి అలాంటి నేతనే జగన్ చేర్చుకుంటున్నారు. ఇదంతా చంద్రబాబు నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసే వ్యూహంలో భాగంగా జగన్ తాను కూడా గుండె నిండా గరళం నింపుకుని చేరికలు ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. మరి ఇది అంత అవసరమా? నాయకులను లాగేస్తే టీడీపీ బలహీనపడుతుందా, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు చెప్పినట్లుగా ఇది వృధా ప్రయాసే. ఎందుకంటే బాబు ఇమేజ్ పెరిగి జగన్ ఇమేజ్ డౌన్ అయిన వేళ ఈ నేతలంతా మళ్ళీ అక్కడికి పోలోమంటారు. ఇంతకీ జగన్ చేస్తున్నది తెలివైన పనేనా?

Tags:    

Similar News