జగన్ ఒక్క పిలుపు ఇచ్చి చూడరాదూ?

జగన్ అంటే పడి చచ్చే వైసీపీ ఈ కీలక సమయంలో ఏం చేస్తోంది. పదేళ్ళ కోసం జగన్ కోసం అష్టకష్టాలు పడ్డ వైసీపీ నేతలు, పెద్దలు ఇంతటి [more]

Update: 2020-03-30 14:30 GMT

జగన్ అంటే పడి చచ్చే వైసీపీ ఈ కీలక సమయంలో ఏం చేస్తోంది. పదేళ్ళ కోసం జగన్ కోసం అష్టకష్టాలు పడ్డ వైసీపీ నేతలు, పెద్దలు ఇంతటి కల్లోల సమయంలో ఎక్కడున్నారు. వారందరినీ ఒక చోట చేర్చే స్పూర్తిదాయకమైన పిలుపుని జగన్ ఇవ్వాల్సిన సమయం ఇపుడు వచ్చింది. కరోనా వైరస్ దేశాన్ని వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాలో కూడా తన ఉనికిని బలంగా చాటుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో క‌రోనా కట్టడికి వ్యూహాలతో పాటు, భారీ ఎత్తున నిధులు కూడా అవసరం. దురదృష్టమేంటంటే ఏపీ ఇపుడు విసిరేసినట్లుగా విభజనతో మూలన‌ పడి ఉన్న రాష్ట్రం. ఆరేళ్ళు ఆయినా అన్యాయం కత్తుల గాయాల నుంచి కారుతున్న రక్తంతో అలాగే ఉంది.

తెలంగాణాలో ఉంటూ….

ఇక సినీ పరిశ్రమ తీసుకుంటే హైదరాబాద్ లో సెటిల్ అయింది. అక్కడ ఉంటున్న వారు స్థానిక ప్రభుత్వానికి తమ వంతు సాయం చేస్తున్నారు. పనిలో పనిగా ఏపీకి కూడా కొంత విరాళం ఇస్తున్నారు. తెలంగాణాతో పోలిస్తే ఏపీ అన్ని విధాలుగా నష్టాల్లో ఉంది. ఆర్ధికంగా కునారిల్లిఉంది. అందువల్ల ఏపీని ఆదుకునేందుకు ఇది ఏ మాత్రం చాలదు. దాని కోసం స్వయంగా ముఖ్యమంత్రి జగన్ పిలుపు ఇవ్వాలి. ఏపీలోనే ఆస్తులు, ఆనవాళ్ళు అన్నీ ఉన్న టాలీవుడ్ హీరోలు, పెద్దలకు సీఎం హోదాలో జగన్ గట్టి వినతి చేయాలి. అలా చేస్తేనే తప్ప ఏపీ సీఎం సహాయ నిధి కుండ కొంతైనా నిండే అవకాశం లేదు.

ప్రముఖులతోనూ…

ఏపీకి ఆర్ధిక వెసులుబాటు ఉంటేనే తప్ప కరోనా సమయంలో జగన్ పకడ్బందీగా సాయం చేయలేరు. అందువల్ల వివిధ రంగాల్లో సెటిల్ అయిన ప్రముఖులకు కూడా పెద్ద ఎత్తున వినతి చేయలి. వారి సహాయాన్ని బహుముఖీయంగా కోరాలి. అదే విధంగా సాయం చేసిన వారికి కనీసం ట్వీట్ ద్వారానైనా ధన్యవాదాలు తెలియచెప్పాలి. వీలు అయితే ఏపీకి చెందిన పారిశ్రామికవేత్తలతో, సంపన్నులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి నిధుల కోసం ఏపీ సర్కార్ గట్టి చర్యలు చేపట్టాలి.

వైసీపీతోనే …?

ఇక రాజకీయ పార్టీలేవీ పేదగా ఏమీ లేవు, వామ‌పక్షాలు వంటివి తప్ప. అందువల్ల అన్ని రాజకీయ పక్షాలకు కూడా ముఖ్యమంత్రి హోదాలో జగన్ అప్పీల్ చేయాలి. దాని కంటే ముందు తన పార్టీలోని పెద్దలను సమీకరించి నిధులను పోగు చేసుకోవాలి. కరోనా సహాయ నిధికి దండీగా విరాళాలు అందించే బాధ్యత అధికార పార్టీగా వైసీపీ నుంచే మొదలు కావాలి. టీఆర్ఎస్ తెలంగాణాలో కేవలం తమ ఒక్క పార్టీ ద్వారా అయిదు వందల కోట్ల నిధులను సేకరించి ప్రభుత్వానికి అందిస్తోంది. అదే స్పూర్తి వైసీపీలో కూడా రావాలి. ఆ పార్టీ కూడా బడా వాటా ఇస్తే తెలుగుదేశం సహా అంతా ముందుకు వస్తారు. ఈ విరాళాల సేకరణ కోసం ముఖ్యమంత్రి జగన్ నాయకత్వం వహించి అందరినీ కలుపుకుని పోవాలి. ఇపుడు ఏపీకి ఇది చాలా అవసరం. జగన్ ఆ పని చేసినట్లైతే కరోన వైరస్ పై పోరాటంలో ఆయన మేలయిన అడుగు వేసినట్లు అవుతారు. ముఖ్యమంత్రి అడిగితే ఇచ్చేందుకు కూడా ఎంతో మంది సిధ్ధంగా ఉంటారు.

Tags:    

Similar News