ఇకనైనా చర్చలకు దిగితే బెటరేమో కదా?

కరోనా వైరస్ కారణంగా అమరావతి రైతుల సామూహిక దీక్షలకు బ్రేక్ పడింది. అయినా సరే ఇంట్లో ఉంటూ వంద రోజులు చేశామనిపించారు. ఈ శతదినోత్సవాన్ని మెచ్చుకుంటూ విపక్ష [more]

Update: 2020-04-01 15:30 GMT

కరోనా వైరస్ కారణంగా అమరావతి రైతుల సామూహిక దీక్షలకు బ్రేక్ పడింది. అయినా సరే ఇంట్లో ఉంటూ వంద రోజులు చేశామనిపించారు. ఈ శతదినోత్సవాన్ని మెచ్చుకుంటూ విపక్ష నేత చంద్రబాబు గ్రీట్ చేశారు. ఇంత కరోనా కల్లోలంలోనూ చంద్రబాబు ఇలా మరచిపోకుండా అమరావతి రాజకీయాన్ని తట్టిలేపడంలోనే ఆయన చాణక్యం అర్ధమవుతోంది. అంటే ఇంకా చేయండంటూ చంద్రబాబు లాంటి వారు అలా రెచ్చగొడుతూనే ఉంటారు. అయితే ఈ వంద రోజుల అనుభవాన్ని రైతులు ఒక్కసారిగా నెమరువేసుకోవాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మనోభావాలు, కోర్టు తీర్పులు ఇవన్నీ గమనంలోకి తీసుకోవాలి.

ఆరు నూరైనా..?

ఇక ఏపీలో జగన్ సర్కార్ తీరు చూసుకుంటే ఆరు నూరైనా కూడా అమరావతి రాజధాని మూడుగా చేయాలనుకుంటోంది. ఈ నిర్ణయంలో ఏమీ మార్పు లేదు. కాస్త ఆలస్యం అవుతుంది అంతే. ఎందుకంటే జగన్ కి విశాఖ మీద మోజు పెరిగింది. అలాగే రాయలసీమకు న్యాయం చేయాలన్న ఉద్దేశ్యం ఉంది. ప్రస్తుతానికి సాంకేతిక కారణాలతో ఇవన్నీ ఆగవచ్చు కాక. అంత మాత్రం చేత అమరావతి ఎక్కడికీ కదలదని రైతులు అనుకుంటే అంతకంటే పొరపాటు ఉండదు. పైగా తమ ఉద్యమం వల్ల ఏదైనా జరిగిందనుకున్నా అది టెంపరరీగా అడ్డంకులు సృష్టించడం వరకే పరిమితమని కూడా భావించాలి.

ఏం కావాలో..?

ఇక అమరావతి రైతులకు భూముల ధరలు పడిపోతాయన్న బాధ ఒక్కటే ఉన్నట్లుగా మొత్తం ఎపిసోడ్ చూసిన వారికి అర్ధమవుతున్న సంగతి . అయితే అభివృధ్ధిని ఒక్కచోటే గుమ్మరించేందుకు జగన్ ప్రభుతం సిధ్ధంగాలేదు. అందువల్ల అమరావతి రైతులు ఇప్పటికైనా బెట్టు విడాలి. తమకు నిజంగా కావాల్సినదేంటో ముఖాముఖీ ప్రభుత్వంలో చర్చించాలి. తాము నష్టపోకుండా ఉండేలా ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెట్టాలి. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం మూడు రాజధానులను ప్రశ్నించకుండా తమకు చేయాల్సిన మేలు గురించి మాత్రమే మాట్లాడుకుంటే ఈ వివాదానికి ఇంతటితో తెర పడడం ఖాయం.

జరిగేనా…?

అయితే అమరావతి రైతుల వెనకాల ఉన్నది టీడీపీ అని వైసీపీ సర్కార్ అనుమానిస్తోంది. ఇప్పటికే చర్చలకు రావాలంటూ అక్కడ బలమైన సామాజికవర్గానికి చెందిన వారికి అనుకూలంగా అదే వర్గానికి చెందిన మంత్రిని ముందు పెట్టింది. అయినా అక్కడి రైతులు స్పందించలేదు. దానికి కారణం వారిని వెనక నుండి నడిపిసున్న వారు బ్రేకులు వేస్తున్నారు. అయితే అమరావతి విషయంలో వారు పెద్దగా సాధించింది లేదు. కేవలం ఆపగలిగారు. దాన్ని చూపించి రైతులను ఇంకా మభ్యపెడితే మొత్తానికి మొత్తం నష్టపోవాల్సివుంటుంది. ఆ సంగతి అందరి కంటే రైతులకే ఎక్కువగా తెలుసు. అందువల్ల రైతులు ఇకనైనా మనసు మార్చుకోవాలి. చర్చలే పరిష్కారంగా ఒక అడుగు ముందుకు వేయాలి. అపుడు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుంది. ఇది జరిగేనా అనుకోవడం కంటే జరగాలి అని రైతులు పట్టుదల పడితే సాధ్యమవుతుంది.

Tags:    

Similar News