ఆ విషయంలో జగన్ సక్సెస్ అయినట్లే?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ప్రత్యర్థి పార్టీని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తూనే [more]

Update: 2020-03-28 02:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ప్రత్యర్థి పార్టీని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీని జగన్ టార్గెట్ చేశారు. ఆ పార్టీ నుంచి నేతలను ఇబ్బడి ముబ్బడిగా తీసుకుంటున్నారు. అయితే జగన్ సంక్షేమ పథకాలను అమలు చేయడం వల్లనే టీడీపీ నేతలు పార్టీలోకి రావడం లేదట. అందుకు బలమైన కారణం ఉందంటున్నారు.

బాబు చేసిన తప్పిదమే…..

చంద్రబాబు చేసిన ఒక చిన్న తప్పిదం పార్టీలో పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ దానిని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. 2014 నుంచి టీడీపీ అధికారంలో ఉంది. ప్రతి కాంట్రాక్టు పనులను టీడీపీ నేతలకే ఇచ్చారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ద్వితీయ శ్రేణి నేతలకు పనులను అప్పగించారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి వంటి శాఖల్లో చిన్నా చితకా పనులతో పాటుగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద కోట్ల రూపాయల పనులను టీడీపీ కార్యకర్తలకు అప్పగించారు.

ఎన్నికల కోడ్ రావడంతో….

అయితే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు మరికొన్ని కాంట్రాక్టులను కూడా నేతలకు ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఆర్థికంగా తమకు ఉపయోగపడతారన్న లక్ష్యంతో చంద్రబాబు కాంట్రాక్టు పనులను ఇబ్బడి ముబ్బడిగా కట్టబెట్టారు. అయితే బిల్లులు చెల్లించే సమయానికి ఎన్నికలకోడ్ అడ్డువచ్చింది. కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. అధికారంలోకి తిరిగి వచ్చేది తామే నని భావించిన చంద్రబాబు బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం చేశారు.

అడ్వాంటేజీగా మార్చుకుని…..

దీనిని జగన్ తనకు అడ్వాంటేజీగా మలచుకున్నారు. ఆ బిల్లుల చెల్లింపును పూర్తిగా నిలిపివేశారు. దీంతో క్యాడర్ నుంచి పార్టీ ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిన వారిపై తీవ్రమైన వత్తిడి పెరిగింది. తాము లక్షలు ఖర్చు చేశామని, అవి తమకు దక్కక పోతే ఎలా అని ముఖ్యనేతలపై ప్రెజర్ తేవడంతో వారు వైసీపీ వైపు చూస్తున్నారు. జగన్ పార్టీలో చేరే ముందు నేతలు పెట్టే ప్రధానమైన షరతు ఇదేనంటున్నారు. తమకు ఎలాంటి పదవి ఇవ్వకపోయినా పరవాలేదని, పెండింగ్ బిల్లులు మాత్రం తమ అనుచరులకు చెల్లించాలన్న షరతుతోనే వారు పార్టీలో చేరుతున్నారట. దీంతో జగన్ కు కూడా ఎలాంటి పదవి ఇవ్వనవసరం లేకుండానే చేరికలు సులువగా అయిపోతున్నాయి. మొత్తం మీద చంద్రబాబు చేసిన తప్పిదాన్ని జగన్ తనకు అనుకూలంగా వినియోగించుకున్నారు.

Tags:    

Similar News