ముక్కు సూటిగా వెళితే మైలేజీ రాదు జగనూ…?

అనుభవం అంటే అదే మరి. కాలు కదపకుండా ముల్లోకాలు చుట్టేసొచ్చిన నాటి వినాయకుడి తెలివి నేటి రాజకీయ నాయకులకు కూడా ఉండాలి. ముక్కుసూటిగా వెళ్తాను, హడావుడి చేయను [more]

Update: 2020-03-22 05:00 GMT

అనుభవం అంటే అదే మరి. కాలు కదపకుండా ముల్లోకాలు చుట్టేసొచ్చిన నాటి వినాయకుడి తెలివి నేటి రాజకీయ నాయకులకు కూడా ఉండాలి. ముక్కుసూటిగా వెళ్తాను, హడావుడి చేయను అంటూ కూర్చుంటే మైలేజ్ మాట దేముడెరుగు విమర్శల వర్షం వెల్లువలా కురుస్తుంది. జగన్ విషయంలో ఇదే ఇపుడు జరుగుతోంది. జగన్ సీఎం కాక ముందు చంద్రబాబు ని మూడు చెరువుల నీళ్ళు తాగించిన పొరుగు తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని నెలలుగా జగన్ ని కూడా వెనక్కి నెట్టేస్తున్నారు. ఇపుడు సౌత్ లో ఆయన పేరు మారుమోగుతోంది.

అన్నింటా ముందే…

కేసీఆర్ ఆరేళ్ళ సీఎం. అంతే కాదు. చాన్నాళ్ళు రాష్ట్ర మంత్రిగా, కొన్నాళ్ళు కేంద్ర మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నారు. ఇక క్షేత్ర స్థాయి నుంచి పైకి వచ్చిన నాయకుడు, మహా ఉద్యమ నేత. జనం నాడి బాగా తెలిసిన వారు. పైగా అపర చాణక్యుడు. అందుకే ఏ రకమైన స్టెప్ వేస్తే ఏ సౌండ్ వస్తుందో బాగా తెలిసిన వాడు. ఇపుడు ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ దూకుడుగా ముందుకుపోతున్నారు. దాదాపు డెబ్బయ్యేళ్ళ వయసులో యువ ముఖ్యమంత్రి జగన్ ని వెనక్కి నెట్టి రేసులో దూసుకుపోతున్నారు.

అప్పట్లో అలా…..

జగన్ సీఎం అయిన కొత్తల్లో కేసీఆర్ చాలా ఇబ్బందులు పడ్డారు. అపుడు జగన్ దూకుడుగా నిర్ణయాలు తీసుకునేవారు. అందులో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కేసీఆర్ని బాగా ఇరుకున పెట్టింది. అలాగే జగన్ నాలుగు లక్షల ఉద్యోగాలు ఒకేసారి నిరుద్యోగ యువతకు ఇవ్వడంతో కేసీఆర్ బాగా విమర్శలు అక్కడ ఎదుర్కొన్నారు. ఇవిలా ఉంటే పాలనాపరమైన అంశాల్లో మాత్రం కేసీఆర్ అనుభవం ముందు జగన్ ఎక్కడా చాలడంలేదు. అలాగే రాజకీయ వ్యూహాల ముందు వెలవెలపోతున్నారు. కేసీఆర్ నిదానంగా తానేంటో చూపించేసరికి ఆంధ్రా సీఎం తన రాష్ట్రంలో విపక్షాల చేత నిష్టూరాలు పడుతున్నారు.

కరోనా పై పోరు …

కేసీఆర్ కరోనా పైన పోరులో చాలా ముందున్నారు. నిజానికి ఆయన కరోనా పైన యుధ్ధం ప్రకటించే సమయాన జగన్ ఇంకా ఆ వైపే చూడలేదు. స్థానిక ఎన్నికల హడావుడిలో ఉన్నారు. అవి వాయిదా వేయడంతో అదో రాజకీయ యుధ్ధంగా జగన్ మార్చుకుని అక్కడ లేట్ చేశారు. ఇక నిన్నా మొన్నటి నుంచి జగన్ కరోనా సమీక్షలు అంటున్నారు. అయితే వారం ముందు నుంచే కేసీఆర్ లాక్ డౌన్ స్టెప్స్ తీసుకుంటూ వచ్చారు. అలాగే ఆయన క్వారంటైన్స్ వార్డులు ఏర్పాటు చేయడం, ఎప్పటికపుడు రివ్యూస్ చేయడం, మీడియాతో వాటిని పంచుకోవడం ద్వారా ప్రజలకు తాను చాలానే చేస్తున్నారనిపించుకుటున్నారు. ఇక ప్రధాని మోడీ 14 గంటల జనతా కర్ఫ్యూ అంటే కేసీఆర్ 24 గంటల కర్ఫ్యూ అంటున్నారు. ఎక్కడిక్కడ యుధ్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం, వైద్య బృందాలను, అధికారులను అలెర్ట్ చేయడం ద్వారా కేసీఆర్ సర్కార్ నిరంతరం మీడియాలో జనంలో ఉంటోంది.

జగన్ దిగాలి….

అదే సమయంలో జగన్ తెలిసో తెలియకో కరోనా వైరస్ ని తేలిగ్గా చేస్తూ మాట్లాడిన మాటలతో మొదట్లోనే సీరియస్ లేదనిపించుకున్నారు. అప్పట్లో కరోనా కారణంగా లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా వేశారన్న బాధ జగన్ ది . అయితే ఇపుడు కరోనా తీవ్రత గుర్తించి రివ్యూస్ చేస్తున్నా కూడా ఎక్కడా మీడియాతో పంచుకోకపోవడంతో జగన్ ఏమీ చేయడంలేదన్న విమర్శలు జనంలోకి వెళ్ళిపోయాయి. అదే విధంగా ఆయన ప్రజల ప్రాణాలను తేలిగ్గా చూస్తున్నారన్న ఆరోపణలు టీడీపీ చేస్తూ ఇరకాటంలో పెడుతోంది. ఇప్పటికి కూడా జగన్ మరింత చురుకుదనం ప్రదర్శించకుండా అధికారులకు సూచనల వరకే పరిమితం అవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రాణాంతక మహమ్మారి కరోనా. దాన్ని నియంత్రించేందుకు నేరుగా జగన్ రంగంలోకి దిగితే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రులు ప్రత్యక్ష జోక్యం, ప్రతీ దానిలో వారి భాగస్వామ్యం కనించేలా ఉంటేనే అధికారులు, యంత్రాంగం అప్రమత్తం అవుతారు. జనం కూడా ధైర్యంగా ఉంటారు. కరోనాపైన ఏపీ సర్కార్ గట్టి యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది, దాన్ని ఫోకస్ గా జనంలోకి తీసుకువెళ్ళాలంటే జగనే ముందుండి నాయకత్వం వహించాలి.

Tags:    

Similar News