వారంతా బాబు భక్తులేనట.. వారిని ఏరిపారేస్తారా?

ఏపీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిసోడ్ వైసీపీకి ముఖ్యంగా జగన్ కు ఒక గుణపాఠం అయింది. తాము అనుకున్నవి అనుకున్నట్లుగా అమలు చేయలేకపోవడానికి, అడ్డంకులు ఎదురుకావడానికి నిమ్మగడ్డ [more]

Update: 2020-03-25 02:00 GMT

ఏపీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిసోడ్ వైసీపీకి ముఖ్యంగా జగన్ కు ఒక గుణపాఠం అయింది. తాము అనుకున్నవి అనుకున్నట్లుగా అమలు చేయలేకపోవడానికి, అడ్డంకులు ఎదురుకావడానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి వారే కారణమని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ముందుగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం కూడా వైసీపీలో బలంగా విన్పిస్తుంది. జగన్ ను ఇంత బద్ నాం చేసిన నిమ్మగడ్డ లాంటి అధికారులపై జగన్ జట్టు ఆరా తీయడం మొదలు పెట్టింది.

బాబు అనుకూల అధికారుల….

జగన్ ను ముఖ్యమంత్రిగా కొందరు అధికారులు సయితం చూడలేకపోతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబుకు సీఎం పదవి దక్కకపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్న కొందరు అధికారులు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా, చంద్రాబాబుకు సహకరించేలా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారన్న అనుమానం జగన్ కు బయలుదేరింది. అందుకే చంద్రబాబు భక్తుల జాబితాను సిద్ధం చేసే పనిలో కొందరు వైసీపీ నేతలు ఉన్నారని తెలుస్తోంది.

సమాచారం వెను వెంటనే….

ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో కీలకంగా వ్యవహరించే ఒక అధికారి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా జగన్ గుర్తించినట్లు చెబుతున్నారు. ఆయన పైకి అంతా ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవరిస్తున్నట్లు కన్పిస్తున్నా, ఎప్పటికప్పుడు సమాచారాన్ని చంద్రబాబుకు కాని, ఆయన తనయుడు లోకేష్ కు కాని చేరవేస్తున్నారని గుర్తించారు. ఈ అధికారిపై వేటు వేయాలని ఇప్పటికే జగన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.

వీరాభిమానులపై వేటు?

అలాగే మరికొన్ని కీలక శాఖల్లోనూ కేవలం చంద్రబాబు సామాజికవర్గమే కాకుండా టీడీపీ వీరాభిమానులు కొందరు అధికారుల రూపంలో ఉన్నట్లు గుర్తించారని తెలుస్తోంది. వీరి జాబితాను రూపొందించమని ఇప్పటికే జగన్ ఒక సలహాదారుకు బాధ్యతను అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఏడాదిలోనే ఇబ్బందులు ఎదుర్కొన్నామని, భవిష్యత్తులో ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా వారందరినీ ఆ పోస్టులనుంచి తప్పించేయడమే బెటరని జగన్ నిర్ణయించారని చెబుతున్నారు. బయటకు రాని జీవోలు సయతం క్షణాల్లో టీడీపీ నేతలకు అందుతుండటంతో అధికారుల ప్రమేయం జగన్ ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారని అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు భక్తులను ఏరివేయాలని జగన్ తీసుకున్న నిర్ణయంతో ఎంతమందిపై చర్యలుంటాయన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News