జగన్ కి ఏడాది గండం తప్పేట్లు లేదే?

జగన్ కి తొలి ఏడాది ముఖ్యమంత్రిగా పూర్తి స్వేచ్చగా సాగిందని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే కేవలం 23 సీట్లతో దారుణ పరాజయం పాలై పరిమిత ప్రతిపక్షంగా [more]

Update: 2020-03-22 13:30 GMT

జగన్ కి తొలి ఏడాది ముఖ్యమంత్రిగా పూర్తి స్వేచ్చగా సాగిందని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే కేవలం 23 సీట్లతో దారుణ పరాజయం పాలై పరిమిత ప్రతిపక్షంగా ఉంటూనే చంద్రబాబు తన అపర చాణక్యాన్ని ప్రదర్శించారు. బాబు రాజకీయం ముందు జగన్ ఎప్పటికపుడు చిత్తు అవుతూండడమే తొలి ఏడాదిలో అంతా చూస్తున్నారు. జగన్ ఓ వైపు పాలనాపరంగా మంచి మార్కులే వేయించుకుంటున్నారు. దిశ లాంటి కొత్త చట్టాలను తేవడం. బీసీలకు, మహిళలకు యాభై శాతం నామినేటెడ్ పోస్టులు ఇలా తనదైన పాలనకు తెర తీస్తున్నారు. అదే సమయంలో రాజకీయ ఎత్తులలో మాత్రం బాబుతో ఢీ కొట్టి జగన్ రాణించలేకపోతున్నారు.

రెండు దెబ్బలు….

జగన్ ఈ మధ్య ఎస్ఈసీ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలు వాయిదా వేయడంతో మీడియా సమావేశం పెట్టి మరీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విచక్షణాధికారం ఏంటో, ఈ మధ్య అందరికీ ఫ్యాషన్ గా మారింది అని జగన్ మదనపడిపోయారు. అవును జగన్ కి ఇప్పటికే శాసనమండలి చైర్మన్ షరీఫ్ విచక్షణాధికారంతో తొలిసారి తల బొప్పి కట్టింది. ఇపుడు రమేష్ మరో దెబ్బ వేశారు. దాంతోనే ఆయన ఈ విచక్షణ ఏంటో అని మండిపోతున్నారు. ఈ విచక్షణల వెనక ఉన్న రాజకీయపు ఎత్తులను జగన్ ముందుగా గమనించుకోకపోవడమే గొడవ అంతటికీ అసలు కారణం.

మండలి తేలదు….

ఇక శాసన మండలిని అయిదు నిముషాల్లో రద్దు చేసి బిల్లుని కేంద్రానికి పంపిన జగన్ కి అక్కడ ఇప్పట్లో స్వాంతన వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. కేంద్రమే పీకల్లోతు బాధలో ఉంది. సీఏఏ వివాదంతో రోజూ పార్లమెంట్ వాయిదాలతో గడుపుతోంది. వారికి అవసరమైన బిల్లుల మోక్షానికే దిక్కు లేదు. ఇపుడు మండలి రద్దు పెట్టే తీరిక ఆసక్తి కూడా ఎవరికీ లేవు. దాంతో అది ఆలస్యమే అవుతోంది. ముందే టీడీపీ వారు చెప్పినట్లుగా కనీసం ఏడాది కాలం పట్టేలా ఉంది.

ఎస్ఈసీ అంతే….

ఇక రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఐఏఎస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను 2016 ఏప్రిల్ 1న చంద్రబాబు సర్కార్ నియమించింది. ఆయన పదవీ కాలం అక్షరాల మరో ఏడాది అంటే 2021 మార్చి 31 వరకూ ఉంది. ఆయన్ని పదవి నుంచి దించే అధికారం ఒక్క రాష్ట్రపతికి ఉంది. అది జరగాలంటే ఏపీలోని ఉభయ సభలూ అబిశంసన తీర్మానం చేయాలి. అది అసలు జరిగే పని కాదు. దాంతో మరో ఏడాది రమేష్ కుమార్ తో రాష్ట్ర ప్రభుత్రానికి పేచీ ఉన్నట్లే. మొత్తం మీద జగన్ కి 2021 మార్చి నాటికి కానీ పూర్తి రాజకీయ స్వేచ్చ. ఉపశమనం కలిగేలా సీన్ కనిపించడంలేదని అంటున్నారు. చూడాలి ఈ మధ్యలో ఏమైనా అద్భుతాలు జరుగుతాయో.

Tags:    

Similar News