అయిననూ పోవలె విశాఖకు ?

విశాఖపట్నం. మహా నగరం. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కోరుకున్న కలల రాజధాని. చంద్రబాబుకు అమరావతి ఎలాగో జగన్ కి వైజాగ్ అలా మోజు పెంచుతోంది. విశాఖను [more]

Update: 2020-03-21 12:30 GMT

విశాఖపట్నం. మహా నగరం. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కోరుకున్న కలల రాజధాని. చంద్రబాబుకు అమరావతి ఎలాగో జగన్ కి వైజాగ్ అలా మోజు పెంచుతోంది. విశాఖను పదేళ్ళలో హైదరాబాద్, బెంగుళూర్, చెన్నైలకు ధీటుగా చేస్తానని జగన్ అంటున్నారు. మొత్తం ఏపీకి గ్రోత్ ఇంజన్ సిటీగా మారుస్తానని చెబుతున్నారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రస్తావనకు వచ్చినపుడల్లా పెట్టుబడిదారులకు విశాఖ ఠక్కున గుర్తుకురావాలన్నది జగన్ ఆలోచన‌గా ఉంది. సరే ఇవన్నీ మంచివే. ఏపీలో ఉన్న దాంట్లో పెద్ద నగరాన్ని ఎంచుకుని వైసీపీ సర్కార్ అభివృధ్ధి చేసుకుంటే అందరికీ మేలు జరిగేదే. కానీ అది జరిగే మార్గం ఇపుడు ఉందా?

చిక్కుల్లో విభజన బిల్లు…..

వికేంద్రీకరణ బిల్లు ఆమోదం కోసం డిసెంబర్ లో జగన్ ప్రత్యేక అసెంబ్లీ పెట్టించారు. అక్కడ బాజా భజంత్రీలతో ఆమోదం పొందిన బిల్లు శాసనమండలి వద్దకు వచ్చేసరికి టీడీపీ అడ్డం కొట్టింది. ఆ తరువాత దానికి అతీ గతీ లేదు. మండలి బతికి ఉంటే ఈ బిల్లు కధ కూడా అలాగే త్రిశంకు స్వర్గంలో ఉంటుంది. దాంతో వికేంద్రీకరణ అన్నది ఆగిపోయింది. ఇక లోకల్ బాడీ ఎన్నికలు జరిపించి అయినా తనకు మూడు ప్రాంతాల్లో ప్రజా మద్దతు ఉందని చెప్పుకుని విశాఖ రాజధాని విషయంలో దూకుడుగా సాగాలని జగన్ తలచారు. ఇపుడు లోకల్ బాడీ ఎన్నికలూ నిలిచిపోయాయి.

అయినా సరే…?

ఇవన్నీ ఇలా ఉన్నా సరే అనుకున్నట్లుగానే విశాఖకు రాజధాని తరలిపోవాలని జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారుట. అందువల్ల సచివాలయ ఉద్యోగులను ఆన్ డ్యూటీ మీద ఇప్పటినుంచే విశాఖ పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారని అంటున్నారు. ఏప్రిల్లో ఆన్ డ్యూటీ గా ఉద్యోగులను పంపించి రాజధాని కధ కొంత మొదలుపెడితే తరువాత రెండు నెలల్లో జరిగే పరిణామాలను బట్టి మొత్తం షిఫ్టింగ్ ఉంటుందా. దశల వారీగా ఉంటుందా అన్నది చూసుకోవచ్చునని జగన్ భావిస్తున్నారుట. ఇపుడు ఉద్యోగుల నెత్తిన ఆన్ డ్యూటీ పెట్టడంతో వారు కలవరపడుతున్నారుట. ప్రస్తుతానికి తరలింపు ఆగిందని వారు అనుకుంటున్న వేళ మళ్ళీ వైసీపీ సర్కార్ ఆన్ డ్యూటీ అనడంతో వ్యతిరేకత వస్తోందని చెబుతున్నారు.

అసలు జరిగేనా …?

చూస్తూండగానే ఏప్రిల్ నెల వచ్చేసింది. లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా అంటున్నారు కానీ ఎపుడు మళ్ళీ జరుగుతాయో తెలియదు. మరో వైపు శాసనమండలి రద్దు కాలేదు. దాంతో సెలెక్ట్ కమిటీ కత్తి వికేంద్రీకరణ బిల్లు మీద ఉంది. ఇపుడు కరోనా వైరస్ హైరానాతో ప్రపంచం అంతా ఉంది. ఈ సమ్మర్ సెలవుల్లో రాజధాని షిఫ్టింగ్ జరగకపోతే విద్యాసంవత్సరం మధ్యలో ఉద్యోగులను కదపడం సాధ్యం కాదు. అలా మళ్ళీ వచ్చే ఏడాది వరకూ విశాఖ రాజధాని వూసు ఎత్తే వీలు లేదు. అప్పటికి మరెన్ని రాజకీయ పరిణామాలు జరిగిపోతాయో ఎవరికీ తెలియదు. వైసీపీ సర్కార్ మాత్రం ఇపుడే వెళ్ళాలని పట్టుదలతో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇపుడున్న వేడిలో తాజా రాజకీయ పరిణామాల్లో ఇది జరిగే పనేనా అని అంతా అంటున్నారు. మరి వైసీపీ సర్కార్ ఈ దూకుడుతో కొత్త కష్టాలు ఇబ్బందులు మరెన్ని తెచ్చుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News