కెలుకుతావా? అయితే ఇక చూస్కో?

జగన్ ఇపుడు కసి మీద ఉన్నారు. తాను సీఎంగా ఉండగానే చంద్రబాబు అన్ని విధాలుగా ఆధిపత్యం చేయడాన్ని ఆయన అసలు తట్టుకోలేకపోతున్నారు. తాను ముఖ్యమంత్రినా లేక ఈసీ [more]

Update: 2020-03-17 05:00 GMT

జగన్ ఇపుడు కసి మీద ఉన్నారు. తాను సీఎంగా ఉండగానే చంద్రబాబు అన్ని విధాలుగా ఆధిపత్యం చేయడాన్ని ఆయన అసలు తట్టుకోలేకపోతున్నారు. తాను ముఖ్యమంత్రినా లేక ఈసీ రమేష్ కుమారా? అని జగన్ అడిగిన ప్రశ్న వెనక ఆయన ఆక్రోశం దాగుందని అంటున్నారు. తాను నీతి నిజాయతీగా రాజకీయాలు చేద్దామనుకుంటే చంద్రబాబు అడ్డదారుల్లో వచ్చి తననే కట్టడి చేస్తున్నారని జగన్ మధన పడుతున్నారుట. తాను ఏ ఒక్క టీడీపీ ఎమ్మెల్యేని ఇంతవరకూ టార్గెట్ చేయలేదని, తాను కనుక తలచుకుంటే చంద్రబాబు ఇపుడున్న స్థితిలో ఉండేవారా అని జగన్ సన్నిహితులతో ప్రస్తావిస్తున్నారుట.

ఇక దూకుడేనా…..

జగన్ కి వరసగా దెబ్బలు తగులుతున్నాయి. విచక్షణాధికారం పేరిట జగన్ తో బాగానే ఆడుకుంటున్నారు. నాడు శాసనమండలి చైర్మన్ షరీఫ్, ఇపుడు ఈసీ రమేష్ కుమార్ ఇదే చేశారు. ఇలాగే ఉంటే మరెంతమంది వ్యవస్థలతో ఆడుకుంటారోనన్న భయం జగన్ లో కనిపిస్తోందని అంటున్నారు. రాజకీయాల్లో నీతికి అవకాశం లేదని పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఇంతకాలం చెబుతున్నా జగన్ తాను రోల్ మోడల్ కావాలనుకున్నారు. అయితే అది ఇపుడు బెడిసికొడుతోంది. జగన్ ఇచ్చిన అవకాశాలు వాడుకుంటూ బాబు ఏకంగా జగన్ మీదనే తన అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఎన్నికలు అయిపోయాక పెద్ద ఎత్తున టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వస్తానంటే జగన్ వద్దు అనడంతోనే ఇపుడు రాజ్యసభ ఎన్నికల్లో చంద్రబాబు తన మనిషిని పోటీకి పెట్టగలిగాడని అంటున్నారు. ఏకగ్రీవం కావాల్సిన చోట కోరి మరీ కెలికారని కూడా వైసీపీ నేతలు కూడా వాపోతున్నారు. దాంతో జగన్ ఇక దూకుడుగా ఉండాల్సిందేనని అంటున్నారు.

అదే టార్గెట్…..

జగన్ ఇపుడు నీతి నియమాలు కాసేపు పక్కనపెట్టి బాబును టార్గెట్ చేస్తారని అంటున్నారు. దాని ఫలితంగా వైసీపీ తలుపులు బార్లా తెరుస్తారని అంటున్నారు. అంటే కేసీయార్ తెలంగాణాలో చేసిన తరహాలోనే వచ్చిన ఎమ్మెల్యేలను వచ్చినట్లే కండువా కప్పేస్తారన్న మాట. దాని వల్ల బాబు ఒక్కరే టీడీపీలో మిగిలే పరిస్థితి ఉంటుందని, బాబుని అలా చేస్తే తప్ప తన రాజకీయం ముందుకు సాగదని జగన్ అనుభవపూర్వకంగా తెలుసుకున్నారని అంటున్నారు. అంటే స్థానిక పోరు తరువాత పెద్ద ఎత్తున పసుపు పార్టీ ఎమ్మెల్యేలను వైసీపీలోకి లాగే కార్యక్రమం సాగుతుందని గట్టిగానే సంకేతాలు వస్తున్నాయి.

ఒక్క దెబ్బతో…..

ఓ వైపు శాసనమండలి రద్దుతో కుమారుడు లోకేష్ ఉద్యోగం ఊడగొట్టడం అన్న లక్ష్యాన్ని సాధించబోతున్న జగన్ అదే టైంలో తండ్రి చంద్రబాబుకు కూడా ప్రతిపక్ష హోదా లేకుండా చేసి ఉత్త ఎమ్మెల్యేగా నిలబెడతారని అంటున్నారు. అంతే కాకుండా తనకు ఉన్న అపరిమితమైన అధికారాన్ని, కేంద్రం వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని బాబు మీద పాత కేసులను తిరగతోడతారని, 2020 ఏడాది పూర్తి అయ్యేలోగా అటు బాబును, మరో వైపు ఆయన పార్టీని పూర్తిగా ఇబ్బందుల పాలు చేయాలన్నది వైసీపీ అజెండాగా కనిపిస్తోంది. మొత్తానికి చూసుకుంటే జగన్ ని ఎప్పటికపుడు కెలుకుతూ తాత్కాలిక విజయాలను ఆస్వాదిస్తున్న చంద్రబాబుకు ముందున్నది ముసళ్ళ పండుగ అని వైసీపీ శిబిరం గట్టిగానే చెబుతోంది.

Tags:    

Similar News