వారి కోసం వీరు.. వీరి కోసం జగన్..విచిత్రంగా లేదూ?

గ‌డిచిన వారం రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న ముఖ్యంగా చెప్పాలంటే.. టీడీపీలో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే. చాలా చిత్రంగా అనిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీ [more]

Update: 2020-03-20 02:00 GMT

గ‌డిచిన వారం రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న ముఖ్యంగా చెప్పాలంటే.. టీడీపీలో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే. చాలా చిత్రంగా అనిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీ నుంచి ఇద్దరు కీల‌క నాయ‌కులు ఈ వారంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా ఎలాంటి సంకోచం లేకుండానే వారిని పార్టీలోకి చేర్చుకున్నారు. ఇత‌ర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తే త‌ప్పా ఎవ్వరిని పార్టీలో చేర్చుకోన‌న్న జ‌గ‌న్ అందుకు విరుద్ధంగా వ్యవ‌హ‌రించి అంద‌రికి షాక్ ఇచ్చారు. అయితే, ఇక్కడ ప‌ర‌స్పర ప్రయోజ‌నం చిత్రంగా ఉండ‌డం గ‌మ‌నార్హం అంటున్నారు విశ్లేష‌కులు. అదేంటంటే.. టీడీపీ త‌ర‌ఫున చీరాల నుంచి గెలిచిన క‌ర‌ణం బ‌ల‌రామకృష్ణమూర్తి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

కరణం ఫాలోయింగ్ ను….

ఆయ‌న వెంట ఆయ‌న కుమారుడు, 2014లో అద్దంకి నుంచి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి గొట్టిపాటి ర‌విపై ప‌రాజయం పాలైన యువ నేత వెంక‌టేష్ ఉన్నారు. ఆయ‌న కూడా పార్టీలోకి చేరిపోయారు. అయితే, ఇక్కడ బ‌ల‌రాం వ్యూహం మొత్తంగా త‌న కుమారుడికి రాజ‌కీయంగా ఓ వేదిక ఏర్పాటు చేయ‌డం. దీంతో ఆయ‌న సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన‌ప్పటికీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక‌, క‌ర‌ణం చేరిక వెనుక జ‌గ‌న్ చూసింది వెంక‌టేష్‌ను కాదు.. క‌ర‌ణంకు బ‌ల‌మైన ఫాలోయింగ్‌ను. అంటే.. క‌ర‌ణం.. త‌న కుమారుడి కోసం వైసీపీ తీర్థం పుచ్చుకుంటే.. జ‌గ‌న్ బ‌ల‌రాం ను చూసి పార్టీలోకి చేర్చుకున్నారు. క‌ర‌ణం బ‌ల‌రాంకు తూర్పు ప్రకాశంలోని ప‌ర్చూరు, అద్దంకి, చీరాల‌, సంత‌నూత‌ల‌పాడు, ఒంగోలు సిటీలో బ‌ల‌మైన అనుచ‌ర‌గ‌ణం ఉంది. భ‌విష్యత్తులో బ‌ల‌మైన ఈ వ‌ర్గం అంతా వైసీపీకి స‌పోర్ట్‌గా ఉంటుంద‌ని జ‌గ‌న్ ప్లాన్‌.

గాదె కూడా అదే బాట…

ఇక తూర్పు ప్రకాశంలోనే ఏకంగా మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ క్రమంలోనే వీళ్లకు చెక్ పెట్టడానికి కూడా బ‌ల‌రాంను పార్టీలో చేర్చుకున్నారు. ఇదే స‌మీక‌ర‌ణ‌లు తాజాగా వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి గాదె వెంక‌ట‌రెడ్డి కూడా ఫాలో అయ్యారు. ఆయ‌న త‌న కుమారుడు మ‌ధుసూద‌న రెడ్డి రాజ‌కీయ భ‌విష్యత్తు కోసం బెంగ పెట్టుకున్నారు. టీడీపీలో అయితే, చంద్రబాబు వంటి ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ త‌న కుమారుడికి మంచి భ‌విష్యత్తు చూపిస్తుంద‌ని ఆశించారు. అయితే, అనూహ్యంగా బాబు కాడి నెత్తుకోక‌పోవ‌డంతో వైసీపీ బాట‌ప‌ట్టారు.

అందుకే పార్టీ మారింది…..

2014 ఎన్నిక‌ల్లో చంద్రబాబు బాప‌ట్ల సీటు గాదె ఫ్యామిలీకి ఇవ్వకుండా అన్నం స‌తీష్‌కు ఇచ్చారు. ఇక స‌తీష్ బీజేపీలోకి వెళ్లాక కూడా చంద్రబాబు ఈ సీటును వేగేశ‌న న‌రేంద్రవ‌ర్మకు ఇచ్చారు. ఇలా మొత్తానికి చూస్తే రాజ‌కీయాల్లో పార్టీలు మారేవారికి ఉండే వ్యూహాలు, పార్టీలో చేర్చుకునే వారికి ఉండే వ్యూహాలు చాలా భిన్నంగా ఉంటాయ‌నేది స్పష్టంగా తెలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి తండ్రుల కోసం జ‌గ‌న్‌.. త‌న‌యుల కోసం తండ్రులు ఎవ‌రి ఎత్తుగ‌డ‌లు వారివ‌న్న మాట‌.

Tags:    

Similar News