ఇంప్రెషన్ గట్టిగా పడుతోంది జగన్

జగన్ మీద అసలే ఫ్రాక్షనిస్ట్ అని చంద్రబాబు బలమైన ముద్రవేశారు. గత పదేళ్ళుగా ఊరూ వాడా ఆ విషయమే చెప్పుకుని తిరిగారు. దీన్ని మెజారిటీ ప్రజలు నమ్మకపోవడం [more]

Update: 2020-03-15 06:30 GMT

జగన్ మీద అసలే ఫ్రాక్షనిస్ట్ అని చంద్రబాబు బలమైన ముద్రవేశారు. గత పదేళ్ళుగా ఊరూ వాడా ఆ విషయమే చెప్పుకుని తిరిగారు. దీన్ని మెజారిటీ ప్రజలు నమ్మకపోవడం వల్లనే జగన్ బంపర్ మెజారిటీతో గత ఏడాది సీఎం అయ్యారు. ఆ సంగతి అలా ఉంచితే జగన్ ముఖ్యమంత్రిగా పది నెలల కాలంలో ఏపీలో రాజకీయ వివాదాలూ, గొడవలు, కొట్లాటలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయని సామాన్యుడికి కూడా ఇంప్రెషన్ కలిగేలా వైసీపీ నేతల పోకడలు ఉంటున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే వైసీపీ నేతలు ఎక్కువగా రెచ్చిపోతున్నారు. దాన్ని పదింతలు చేస్తూ పసుపు పార్టీ జగన్ మీద తీవ్రమైన వ్యతిరేకతను తెస్తోంది.

దారుణమే…..

మాచర్ల ఘటన చూస్తే అంతకంటే దారుణం ఉండదని చెప్పాలి. టీడీపీ నేతల కారు మీద దాడులు చేస్తూ వైసీపీ కార్యకర్తలు చేసిన బీభత్సం వీడియోలు చూసిన ఏపీ జనాలు ప్రభుత్వం మీద వ్యతిరేకత పంచుకుంటారన్న దాంట్లో సందేహం లేదు. అంతే కాదు ఎక్కడికక్కడ విపక్షాలను కట్టడి చేస్తూ నామినేషన్ పర్వం నుంచే వైసీపీ నేతలు సాగిస్తున్న అరాచకం కూడా పక్కాగా జనం మెదళ్ళల్లో రికార్డు అవుతోంది. ఇది ఓ విధంగా టీడీపీకి సానుభూతి తెచ్చేదే.

బాబుకు హెల్ప్ ….

నిజానికి టీడీపీకి లోకల్ బాడీ ఎన్నికల వల్ల కాళ్ళూ చేతులూ ఆడడంలేదు. ఎక్కడ చూసినా కూడా నేతలు పోటీకి తయారుగా లేరు. ఎందుకొచ్చిన తంటా అన్నట్లుగా సీన్ ఉంది. ఈ నేపధ్యంలో టీడీపీకి ఊపిరి పోసేలా వైసీపీ నాయకుల చర్యలు ఉన్నాయని అంటున్నారు. వైసీపీ మంత్రుల నుంచి కార్యకర్తల వరకూ వాడే భాష ఒక్కటేగా ఉంటోంది. అందులో అధికారం తెచ్చిన అహంకారం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిపుడు బాబుకు వేయి ఏనుగుల బలం తెస్తోంది. బాబు తరచుగా రోడ్డెక్కుతూ టన్నుల కొద్దీ సానుభూతిని సంపాదించుకుంటున్నాడు. ఏపీవ్యాప్తంగా అది వైసీపీకి నెగిటివ్ వేవ్ ని తెచ్చే ప్రమాదమూ ఉంది.

మౌన మునిలా …..

జగన్ పూర్తిగా మౌన మౌనిగా మారిపోయారు. కాగల కార్యాన్ని పార్టీ కార్యకర్తలు చక్కబెడతారని ధీమాగా ఉన్నారు. జనాలకు అన్నీ చేశాము, వారు టీడీపీని అసలు నమ్మరు, అవన్నీ డ్రామాలు అని జగన్ భావిస్తున్నట్లుగా ఉన్నారు. అయితే ఒకటికి పదిసార్లు ఇలాగే వైసీపీ నేతలు దౌర్జన్యాలు చేయడం, వాటిని టీడీపీ తన అనుకూల మీడియా ద్వారా ఎప్పటికపుడు హైలెట్ చేయడం వల్ల జనం నమ్మే పరిస్థితి ఉంది. జగన్ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొవాలి. తన పార్టీ నేతలను కంట్రోల్ లో పెట్టుకోవాలి. లేకపోతే జగన్ పార్టీ అంటేనే జనం భయపడే పరిస్థితి వస్తుంది. అది పార్టీ పుట్టెను ముంచే ప్రమాదం కూడా ఉంది. ఒక ఎన్నికతోనే టీడీపీ పని అయిపోయిందనుకుంటే సరిపోదు. టీడీపీకి వేయి చేతులూ, వేయి కాళ్ళూ ఉన్నాయి. అది జగన్ ఎంత త్వరగా గుర్తిస్తే వైసీపీకి అంత మేలు అంటున్నారు ఆ పార్టీ హితైషులు.

Tags:    

Similar News