నిరంతరం పోరాటం… మొండితనం.. వెరసి అధికారం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటికి పదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీని విభేదించి వైఎస్ జగన్ తన తండ్రి ఆశయ సాధన [more]

Update: 2020-03-12 09:30 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటికి పదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీని విభేదించి వైఎస్ జగన్ తన తండ్రి ఆశయ సాధన కోసమంటూ కొత్త పార్టీని ప్రకటించారు. 2011 మార్చి 12వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన జరిగింది. అయితే ఈ పదేళ్లలో ఎన్నో ఒడిదుడుకులు. ఎన్నో ఆటుపోట్లు. ఎందరో నేతల వెన్నుపోట్లు. అయినా పార్టీని అధికారంలోకి తెచ్చేంత వరకూ వైఎస్ జగన్ నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు.

ఓదార్పు యాత్రకు…..

తన తండ్రి మరణంతో గుండెపోటుతో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్రను చేపట్టాలని జగన్ భావించారు. అయితే అందుకు అప్పటి కాంగ్రెస్ అధినాయకత్వం కొర్రీలు వేసింది. ఓదార్పు యాత్రలను పరిమితం చేయాలని చూసింది. దీంతో విసుగు చెందిన జగన్ సొంత పార్టీ వైపు మొగ్గు చూపారు. పార్టీ పెట్టిన తొలినాళ్లలో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరే జగన్ కు అండగా నిలిచారు. వారందరి చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లి పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి విజయాలను జగన్ నమోదు చేసుకున్నారు.

నేతలు వెళ్లిపోతున్నా……

అయితే రోజులు గడిచే కొద్దీ అప్పటి వరకూ వెంట ఉన్న నేతలు ఒక్కొక్కరూ వెళ్లిపోవడం ప్రారంభించారు. సీబీఐ కేసులు వెంటాడటంతో 16 నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చారు. మైసూరా రెడ్డి, సబ్బం హరి లాంటి నేతలు జగన్ ను వదిలేసి వెళ్లిపోయారు. అయినా జగన్ వెరవకుండా పార్టీని ముందుండి నడిపించారు. 2014 ఎన్నికల్లో జగన్ ఒంటరిగానే పోటీ చేశారు. ఏ పార్టీతో పొత్తుకు సిద్ధపడలేదు. రాష్ట్ర విభజనతో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి జరిగిన తొలి ఎన్నికల్లో అధికారం అందలేదు. ప్రధాన ప్రతిపక్షంగానే ఉండిపోయారు.

రోడ్డు మీదే..జనం మధ్యనే…..

మరో ఐదేళ్ల పాటు పార్టీని బతికించుకోవడానికి ధర్నాలు, దీక్షలంటూ రోడ్డుపైనే జగన్ ఉన్నారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టీడీపీ ఆకర్షించి వారిలో కొందరికి మంత్రిపదవి ఇవ్వడంతో అసెంబ్లీ సమావేశాలను సయితం బహిష్కరించారు. ఇక ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి 2019 ఎన్నికల్లో జగన్ ఒంటిచేత్తో అధికారాన్ని వైసీపీకిి తేగలిగారు. 151 ఎమ్మెల్యే సీట్లను, 22 ఎంపీ సీట్లను సాధించి పదేళ్లలోపే పార్టీని పవర్ లోకి తెచ్చారు. ఇలా పదో ఏడాదిలోకి అడుగుపెట్టిన వైసీపీ నేడు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది.

Tags:    

Similar News