జగన్ కి ఆ మోజు ఎందుకు?

జగన్ అంటేనే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారని పేరు ఉంది. ఇప్పటికి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడచినా జగన్ తన ప్రభుత్వం గురించి ఎక్కడా ఒక్క [more]

Update: 2019-10-09 08:00 GMT

జగన్ అంటేనే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారని పేరు ఉంది. ఇప్పటికి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడచినా జగన్ తన ప్రభుత్వం గురించి ఎక్కడా ఒక్క ముక్క చెప్పుకున్న దాఖలాలు లేవు. అంతెందుకు జగన్ ఇప్పటికీ ముఖ్యమంత్రి హోదాలో ఒక్క మీడియా మీటింగ్ కూడా నిర్వహించలేదు. తాను ఎన్నికల హామీలను చకచకా నెరవేరుస్తున్నారు. అయినా వాటి గురించి సొంత మీడియాలో కూడా పెద్దగా రాయించుకోవడంలేదు. వంద రోజుల పాలనపై మీడియా ఇంటర్వ్యూలకు దూరంగా ఉన్న జగన్ తాను చేసిన పనులే మాట్లాడాలనుకునే వ్యక్తిత్వంతో ఉంటారు. లక్షలమంది హాజరైన బహిరంగ సభ అయినా పార్టీ నాయకుల మీటింగ్ అయినా జగన్ తాను చెప్పాల్సింది క్లుప్తంగా చెప్పి ముగిస్తారు తప్ప ప్రచార యావ కోసం పాకులాడరు. ఇది వైఎస్సార్ నుంచి జగన్ కి వచ్చిన గొప్ప సుగుణంగా పార్టీ వారు ఎపుడూ చెబుతారు.

స్టిక్కర్ల ప్రచారం….

అటువంటి సీఎం జగన్ విషయంలో ఇపుడు భిన్నమైన మాట వినిపిస్తోంది. ఆటో డ్రైవర్లకు ఏటా పది వేల రూపాయలు జగన్ ఆర్ధిక సాయం అందిస్తూ వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో ఏపీలో ఉన్న అన్ని ఆటోల మీద థాంక్యూ సీఎం అంటూ స్టిక్కర్లు అతికిస్తున్నారుట. ఇది పెద్ద ఎత్తున ప్రచారంగా సాగుతోంది. దీంతో సోషల్ మీడియా వేదికగా టీడీపీ విమర్శలు మొదలెట్టేసింది. ప్రభుత్వ సొమ్ముతో పధకాలు అమలు చేసి వ్యక్తిగత ప్రచారం చేసుకోవడం ఏంటి అంటూ జగన్ సర్కార్ మీద యుద్ధమే ప్రకటించింది. ఈ స్టిక్కర్ల మీద వైఎస్సార్ ఫోటో ఉంటోందట. ఆ స్టిక్కర్లను ఏకంగా రవాణా శాఖలో అధికారులే ఆటో డ్రైవర్లకు పంపిణీ చేస్తున్నారుట. దాంతో జగన్ సర్కార్ అతి ప్రచారానికి ఇది నిదర్శంగా టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. అధికారాన్ని, అధికారులను ఇలా వాడేసుకుంటారా అంటూ పసుపు తమ్ముళ్ళు కళ్ళెర్రచేస్తున్నారు.

జగన్ కి తెలుసా…?

నిజానికి ఈ తరహా ప్రచారానికి జగన్ ఎపుడూ వ్యతిరేకమని పార్టీలో అంతా అంటారు. ఉన్నట్లుండి ఆటోలపై స్టిక్కర్ల ప్రచారం ఏంటని వైసీపీ శ్రేణులే విస్తుపోతున్న పరిస్థితి పార్టీలో ఉంది. జగన్ కి తెలిసే ఇది జరుగుతోందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న వారు కూడా ఉన్నారు. జగన్ కి అంత పబ్లిసిటీ పిచ్చి ఉంటే ప్రతీ రోజూ మీడియా మీటింగులు పెట్టి మరీ తాను చేపట్టిన అనేక పధకాల గురించి ప్రచారం చేసుకునేవారని కూడా కొంతమంది నాయకులు అంటున్నారు. మరో వైపు ప్రచారం చేసుకొవాలంటే ఈ ఒక్క పధకమే ఉందా ఇంతకు మించిన పధకాలు చాలా ఉన్నాయని, ఇప్పటికి ఎన్నో స్కీములను అమలు చేసిన జగన్ ఏ ఒక్కటీ గట్టిగా తన నోటితో నేను చేశాను అని చెప్పుకోలేదని, అలాంటిది ఒక్క ఆటో డ్రైవర్ల విషయంలో ఎందుకిలా చేస్తారని వాదించేవారూ ఉన్నారు. అయితే అధికారుల అతి ఉత్సాహమైనా అయి ఉండాలి, లేకపోతే పార్టీలోని కొందరు ముఖ్యులైనా దీనికి తెర తీసి ఉండాలని అంటున్నారు. ఒకనాడు చంద్రబాబు బస్సులు, ఆటోలు తేడా లేకుండా తన గురించి విపరీతమైన ప్రచారం చేసుకునేవారని, నాడు ఆయన్ని విమర్శించి తాము ఈ పని చేస్తే బాగుంటుందా అని వైసీపీలో ఇపుడు చర్చ సాగుతోందంట.

Tags:    

Similar News