కోటను బద్దలు కొట్టడం గ్యారంటీ అట

కోటలో పాగా వేయడమే రాజనీతి. దాన్ని బద్దలుకొట్టి ఆక్రమించడమే అసలైన చాణక్యం. ఉత్తరాంధ్ర మొత్తం ఊడ్చేసినా కూడా వైసీపీకి విశాఖ సిటీ మాత్రం దక్కలేదు, చిక్కలేదు, దాంతో [more]

Update: 2020-03-14 00:30 GMT

కోటలో పాగా వేయడమే రాజనీతి. దాన్ని బద్దలుకొట్టి ఆక్రమించడమే అసలైన చాణక్యం. ఉత్తరాంధ్ర మొత్తం ఊడ్చేసినా కూడా వైసీపీకి విశాఖ సిటీ మాత్రం దక్కలేదు, చిక్కలేదు, దాంతో మోజుపడ్డ జగన్ ఏకంగా విశాఖను రాజధానిగా ప్రకటించేశారు. ఇపుడు రాచఠీవి సంతరించుకున్న ఈ నగరం తమ పరం అవుతుందని ఆయన గట్టిగా భావిస్తున్నారు. ఏపీలోనే అతి పెద్ద నగరమైన విశాఖ మేయర్ సీటుని గెలుచుకోవడం ద్వారా టీడీపీకి గట్టి షాక్ ఇవ్వాలని చూస్తున్నారు. దాని కోసం దూకుడుగానే ముందుకు సాగుతున్నారు.

ఎమ్మెల్యేలు లేని చోట….

నిజానికి విశాఖ సిటీలో అధికార పార్టీకి ఎమ్మెల్యేలు లేరు. ఇది చాలా చిత్రమైన రాజకీయం. సిటీ బయటా, చుట్టుపక్కల ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో కూడా వైసీపీ ఉంది. కానీ జీవీఎంసీ పరిధిలోకి వచ్చే సిటీలో నలుగురు ఎమ్మెల్యేలు కూడా పసుపు పార్టీకి చెందినవారే. దాంతో వైసీపీ ఆ లోటుని భర్తీ చేసుకునేందుకు వేరే మార్గాలను ఎంచుకుంటోంది. మాజీ ఎమ్మెల్యేలను, బలమైన సామాజికవర్గాలకు చెందిన వారిని అక్కున చేర్చుకోవడం ద్వారా విశాఖలో పాగా వేయాలని చూస్తోంది.

వరస చేరికలే…

దీంతో వరసగా గట్టి నేతలను చేర్చుకుంటోంది. మాజీ మంత్రి, సీనియర్ నేతగా ఉన్న పసుపులేటి బాలరాజుని, ఆయన కుమార్తె డాక్టర్ దర్శినిని కూడా వైసీపీ గూటికి చేర్చుకుంది. దాంతో అటు సిటీలో ఇటు ఏజెన్సీలో కూడా ఒక్కసారిగా బలం పెరిగింది. బాలరాజు కాంగ్రెస్ లో అయిదేళ్ళ పాటు పనిచేశారు. మంచి నేతగా పేరు సంపాదించుకున్నారు. ఆయన గత ఎన్నికల్లో జనసేన నుంచి పాడేరులో పోటీ చేసి ఓటమిపాలు అయ్యారు. ఇపుడు జగన్ నీడకు చేరారు.

జనసేనకు ఝలక్……

మరో వైపు జనసేనకు కాస్తో కూస్తో బలం ఉందనుకుంటున్న గాజువాకలో కూడా వైసీపీ తన తడాఖా చూపిస్తోంది. జనసేనలో ఉన్న గాజువాక మాజీ ఎమ్మెల్యే, పట్టున్న నేత, బలమైన సామాజికవర్గానికి చెందిన చింతలపూడి వెంకటరామయ్యను కూడా వైసీపీ నీడకు తెచ్చేశారు. దాంతో జనసేనకు చివరి ఆశలు కూడా లేకుండా పోయాయి. మరో వైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు విశాఖ ఉత్తరంలో అండంగా ఉంటూ ఆయన గెలుపునకు సహకరించిన మాజీ తైనాల విజయకుమార్ కి కూడా వైసీపీ కండువా కప్పేసింది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే, మైనారిటీ నాయకుడు ఎస్ ఎ రహమాన్ వైసీపీలో చేరిపోయారు.

గెలవాల్సిందేనా…?

విశాఖ మేయర్ సీటు వైసీపీకి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే విశాఖ ప్రజలు ఎవరూ రాజధానిని కోరుకోవడం లేదని ఓ వైపు టీడీపీ, ఇతర పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. దాంతో బంపర్ మెజారిటీలతో వార్డులు మొత్తం గెలుచుకుని మేయర్ పీఠాన్ని అధిష్టించడం ద్వారా అన్ని పార్టీలకు గట్టి జవాబు ఇవ్వాలన్నది వైసీపీ ఆలోచంగా ఉంది. జీవీఎంసీ పరిధిలో మొత్తం 98 వార్డులు ఉన్నాయి. ఇందులో గాజువాక, భీమిలీ, అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాలు వైసీపీ చేతుల్లో ఉన్నాయి. అక్కడ బలం ఉంచుకుంటూనే సిటీలో ఉన్న నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలకు దెబ్బ తీయడం ద్వారా మూడొంతులు పైగా వార్డులను గెలుచుకోవాలని వైసీపీ పక్కా ప్లాన్ తో ముందుకు కదులుతోంది. చూడాలి మరి వైసీపీ చాణక్యం ఎంతవరకూ పనిచేస్తుందో.

Tags:    

Similar News