ఒక్క ఛాన్స్ వారికి ఇవ్వకూడదనేగా వరస చేరికలు? ఆయన కూడానా?

గత ఎన్నికల్లో అక్కడక్కడ మిగిలిన లోట్లు పాట్లు లోకల్ బాడీ ఎన్నికల్లో సరిదిద్దుకోవాలని వైసీపీ హైకమాండ్ వ్యూహరచన చేస్తోంది. టీడీపీకే కాదు, విపక్షాలకు ఏ ఒక్క ఛాన్స్ [more]

Update: 2020-03-10 14:30 GMT

గత ఎన్నికల్లో అక్కడక్కడ మిగిలిన లోట్లు పాట్లు లోకల్ బాడీ ఎన్నికల్లో సరిదిద్దుకోవాలని వైసీపీ హైకమాండ్ వ్యూహరచన చేస్తోంది. టీడీపీకే కాదు, విపక్షాలకు ఏ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకూడద‌ని భావిస్తోంది. అందుకోసం బలమైన పార్టీల నేతలను వైసీపీ గూటికి వరసగా చేర్చుకుంటోంది. ఇప్పటికే విశాఖ నుంచి ఎస్ ఎ రహమాన్, గుంటూరు నుంచి డొక్కా మాణిక్యవరప్రసాద్, ప్రకాశం జిల్లా నుంచి కదిరి బాబూరావు వంటి వారికి కండువా కప్పిన జగన్ కడప జిల్లాలో టీడీపీ బిగ్ షాట్స్ కి గాలం వేశారు. అదే వరసలో అనంతపురం జిల్లాకు చెందిన పెద్ద నాయకుడు, మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డిని పార్టీలోకి లాగాలని చూస్తున్నారు.

వైఎస్సార్ సన్నిహితుడు….

వైఎస్సార్ కి సన్నిహితుడిగా పేరు పొందిన రఘువీరారెడ్డిని వైసీపీలోకి తీసుకురావాలని జగన్ పార్టీ నేతలకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. బలమైన నేతగా, కాంగ్రెస్ పీసీసీ పీఠాన్ని అయిదేళ్ళు నిభాయించిన నాయకుడిగా రఘువీరాకు పేరుంది. ఆయన వైఎస్సార్ కి ఆప్తమిత్రుడు. తన జిల్లాలో పట్టున్న నేత. అందువల్ల ఆయన రాకతో పార్టీకి మరింత బలం వస్తుందని జగన్ భావిస్తున్నారుట. పైగా తన తండ్రికి సన్నిహితుడు, తాను సీఎం కావాలని అప్పట్లో సంతకాల సేకరణలో ముందున్న రఘువీరాను పార్టీలోకి తెచ్చి సముచిత స్థానం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారుట. దీంతో వైసీపీ మరింతగా బలోపేతం కావడంతో పాటు, జేసీ, పరిటాల ఫ్యామిలీలకు పూర్తిగా చెక్ పెట్టాలనుకుంటున్నారుట.

పెద్దల సభకు….

లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందే రఘువీరా చేరితే గరిష్టంగా పార్టీకి లాభం చేకూరుతుందని జగన్ భావిస్తున్నారుట. మొత్తానికి మొత్తం జిల్లాను స్వీప్ చేయాలన్నది వ్యూహంగా ఉంది. రఘువీరా కనుక పార్టీలోకి వస్తే 2022 నాటికి ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వాలన్నది జగన్ ఆలోచనగా ఉందిట. ఇప్పటికే మంతనాలు పై స్థాయిలో పూర్తి అయ్యాయని కూడా ప్రచారం సాగుతోంది. అందువల్ల రేపో మాపో రఘువీరా వైసీపీ కండువా కప్పుకుంటారని అంటున్నారు. నిజానికి రఘువీరా ఎపుడో వైసీపీలో చేరాల్సివుందిట. అయితే ఇన్నాళ్ళు ఆలస్యం అయింది. తన సొంత పనులు అన్నీ పూర్తి చేసుకుని ఆయన మళ్ళీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేందుకు వస్తున్నారని అంటున్నారు.

పార్టీ పటిష్టంగా…?

ఏపీలో మరింత పటిష్టంగా వైసీపీని తీర్చిదిద్దడానికి జగన్ చూస్తున్నారుట. రానున్న రోజుల్లో కాంగ్రెస్, టీడీపీ, జనసేనల నుంచి కూడా పెద్ద నాయకులు వైసీపీలో చేరుతారని అంటున్నారు. ఎవరూ ఊహించని వారు కూడా ఫ్యాన్ నీడకు చేరుతారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఎక్కడా చంద్రబాబుకు, ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వరాదని, పార్టీని బలమైన శక్తిగా మార్చడానికి లోకల్ బాడీ ఎన్నికలను మెట్టుగా మార్చుకోవాలని జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నాట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News