జగన్ సక్సెస్ రేటు ఇలా ఉండబోతుందా?

అధికారంలోకి వచ్చి 9 నెలల కాలంలో వైసిపి సర్కార్ కి అనేక ఒడిదుడుకులు ఎదురయ్యాయి. నిధులు లేని రాష్ట్రం. సమస్యలు బారెడు వచ్చే నిధులు మాత్రం అరకొర [more]

Update: 2020-03-09 09:30 GMT

అధికారంలోకి వచ్చి 9 నెలల కాలంలో వైసిపి సర్కార్ కి అనేక ఒడిదుడుకులు ఎదురయ్యాయి. నిధులు లేని రాష్ట్రం. సమస్యలు బారెడు వచ్చే నిధులు మాత్రం అరకొర కావడంతో వైసిపి తన ఎన్నికల మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీల అమలు పెద్ద సవాల్ గా మారింది. దీనికి తోడు అభివృద్ధి పనులకు నిధుల కొరత కొరడాలా తగులుతుంది. గత సర్కార్ హయాంలో బకాయిపడ్డ కాంట్రాక్టర్ల బిల్లులకు నేటికి కూడా పూర్తి స్థాయిలో చెల్లింపులను సర్కార్ ఇవ్వలేక పోతుంది. దీనికి తోడు పాత ప్రభుత్వ విద్యుత్ బకాయిలు నుంచి మద్యం బకాయిల వరకు అన్ని జగన్ నెత్తిన పిడుగులు పడేలా చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అనేక సాహసోపేత నిర్ణయాలను అమలు చేస్తూ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కి ముందే తెరతీసేశారు జగన్. ఇలాంటి తరుణంలో కేంద్రం నుంచి 14వ ఆర్థికసంఘం నిధులు రప్పించుకోవాలంటే స్థానిక ఎన్నికలు నిర్వహించకతప్పని పరిస్థితి ఏర్పడటంతో వాటికి గంట కొట్టించేశారు ముఖ్యమంత్రి.

ఆ ప్రచారం ఎంత పని చేస్తుంది …?

మద్యం పాలసీ ఫెయిల్, ఇసుక విధానం ఫెయిల్, విద్యుత్ ధరలు పెంచమని చెప్పి మాట తప్పారు. రాజధాని తరలించమని చెప్పి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు ఫార్ములా ఇలాంటి వ్యతిరేక ప్రచారాల నడుమ స్థానిక ఎన్నికలు అధికారాపార్టీకి పెద్ద సవాల్ విసురుతున్నాయి. దశలవారీగా మద్యపాన నిషేధం విధిస్తానన్న జగన్ ధరలు పెంచడం కొన్ని మద్యం బ్రాండ్ లనే ప్రభుత్వ దుకాణాల్లో పెట్టడం విమర్శలకు దారి తీసింది. మద్యం కంపెనీల నుంచి జె ట్యాక్స్ కోసమే ఇదంతా అని విపక్షాలు పెద్ద ఎత్తునే తమ అనుకూల మీడియా ద్వారా ప్రజల్లోకి విజయవంతంగా తీసుకువెళ్లగలిగింది. అలాగే ఇసుక విధానం అయితే మరింత దారుణంగా ఫెయిల్ అయిందన్నది అధికారపార్టీకి తెలియంది కాదు. జగన్ ఒకటి తలిస్తే ఆయన నేతలు మరొకటి తలచి లారీ ఇసుక ను 18 వేలరూపాయలు బ్లాక్ మార్కెట్ లో విక్రయించుకుంటున్నారనే ఆరోపణలను ఎదుర్కొవాలిసి వచ్చింది. ఇప్పటికి ఇసుక విధానంపై విమర్శలు ఆరోపణలు ఎపి అంతా ప్రాంతాలను బట్టి వినిపిస్తున్నాయి. వీటన్నింటికన్నా అమరావతిలోనే రాజధాని ఉండాలన్న విపక్షాల ఉద్యమం సత్తా కూడా స్థానిక ఎన్నికల్లో తేలిపోనుంది. వైసిపి సర్కార్ నిర్ణయాలను ప్రజలు ఆమోదిస్తారా? తిరస్కరిస్తారా? అన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తునే నడుస్తుంది. అయితే ఈ ఎన్నికలు రిఫరెండం గా భావించేందుకు మాత్రం టిడిపి కానీ ఇతర పక్షాలు ముందుకు రావడం లేదు.

అమ్మఒడి గెలిపిస్తుందా …?

గత సార్వత్రిక ఎన్నికల్లో పసుపు కుంకుమ పేరిట చంద్రబాబు మహిళల అకౌంట్ లో నేరుగా డబ్బులు వేసి గంపగుత్తగా వారి ఓట్లు పడతాయని లెక్కేసింది. అయితే సీన్ రివర్స్ అయ్యింది. సర్కార్ పై వ్యతిరేకత నివురుగప్పిన నిప్పులా ఉన్న అంశం గుర్తించని చంద్రబాబు మాత్రం గెలుపు తమదే అని ప్రకటించడమే కాదు అత్యధిక సీట్లు మావే అని చెప్పుకొచ్చారు. అయితే అనూహ్యంగా బాబు చెప్పిన ఫిగర్ జగన్ పార్టీకి దక్కింది. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసిపి సైతం ఇదే ఆశల్లో విహరిస్తోంది. అమ్మఒడి పథకం ద్వారా మహిళలకు నేరుగా వారి అకౌంట్ లకు 15 వేల రూపాయలు బదిలీ చేసింది. మొన్న జనవరిలో పండగ ముందు వేసిన సొమ్ము తమ పార్టీకి శ్రీరామరక్ష గా లేక్కేస్తుంది. అలాగే ఆటోవాలాలకు, రైతులకు, ఇలా అనేక వర్గాలకు సర్కార్ డబ్బుల వర్షం ఇప్పటికే కురిపించేసింది. మరికొన్ని వర్గాలకు రాబోయే రోజుల్లో వరాలు ఇచ్చేసింది. ఇక ఉగాదికి 25 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చేసేందుకు ఏర్పాట్లు కూడా చేపట్టింది వైసిపి. ఈ చర్యలన్నీ ఓట్ల వర్షం కురిపించడం ఖాయమనే ధీమా ఆ పార్టీ క్యాడర్ లో నెలకొంది. అయితే అటు అసంతృప్తి ఇటు తృప్తి నడుమ స్థానిక ఎన్నికల సమరం సాగనుందని ఇందులో అధికారపార్టీ సక్సెస్ రేటు ఎలా ఉండబోతుందో చూడాలి.

Tags:    

Similar News