అది ఆయనిష్టమే…నష్టం లేదన్న గ్యారంటీ అయితే లేదు

ముఖ్యమంత్రి అయిన వెంటనే మారిపోతారు. కుర్చీ ఎక్కగానే తమను మించిన వారు ఎవరూ లేరనుకుంటారు. ఏ రాష్ట్రంలోనై ముఖ్యమంత్రుల తీరు ఇలాగే ఉంటుంది. అందులో కొందరు మాత్రం [more]

Update: 2020-03-12 12:30 GMT

ముఖ్యమంత్రి అయిన వెంటనే మారిపోతారు. కుర్చీ ఎక్కగానే తమను మించిన వారు ఎవరూ లేరనుకుంటారు. ఏ రాష్ట్రంలోనై ముఖ్యమంత్రుల తీరు ఇలాగే ఉంటుంది. అందులో కొందరు మాత్రం సంయమనం పాటిస్తూ ఉంటారు. నవీన్ పట్నాయక్ లాంటి వాళ్లు ఈ కోవకు చెందరు. ఆయన అరుదైన వారిగా ఉంటారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఇందుకు మినహాయింపు కారు. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే పూర్తిగా మారిపోయారంటున్నారు.

వైఎస్ సయితం…..

అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన జగన్ రికార్డు సృష్టించారు. కష్టపడి తెచ్చుకున్న పదవి అది. ఆయనకు ఊరికే రాలేదు. తొమ్మిదేళ్లు రోడ్డుపైనే ఉండటం వల్లనే జనం నమ్మి ఆయనను ముఖ్యమంత్రిగా చేశారు. ఇది ఎవరూ కాదనలేరు. కానీ తన తండ్రి పాలనను మించి తన పాలన చూస్తారని చెప్పిన జగన్ మాత్రం కొన్ని విషయాల్లో విమర్శలను ఎదుర్కొంటున్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఐదేళ్లు ఉన్నప్పటికీ ఆయన ఎలాంటి ప్రచార యావకు పోలేదు. తన పేరు మీద ఎలాంటి పథకాలను ఆయన ప్రవేశపెట్టలేదు. జాతీయ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కావడంతో అది వైఎస్ కుదరలేదని అనే వారూ ఉండవచ్చు.

చిన్న వయసులోనే…

ఇప్పుడు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన జగన్ తన తండ్రి వైఎస్ పేరిట కొన్ని పథకాలను ప్రవేశ పెట్టారు. అందులో ఎవరికీ అభ్యంతరం ఉండదు. తండ్రి పేరు వచ్చేలా పార్టీ పెట్టడం, ఆయనకున్న అభిమాన బలంతోనే గెలవడం వల్ల విమర్శలకు కూడా తావు ఉండదు. కానీ గత కొంతకాలంగా జగన్ తన పేరు మీదే పథకాలను తీసుకువస్తున్నారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న చేదోడు, జగనన్న విద్యాకానుక, జగనన్న కాలనీలు ఇలా వరసగా ప్రవేశపెట్టబోయే పథకాలకు ఆయన పేరే పెట్టుకోవడం ఖచ్చితంగా విమర్శలకు తావిస్తుంది.

ప్రతి పథకానికి ఆయన పేరే….

బహుశ జగన్ ను చూసే జనం ఓట్లేసి ఉండవచ్చు. జగన్ ఇమేజ్ తోనే 151 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఉండవచ్చు. తన సుదీర్ఘ పాదయాత్ర వల్లనే ఇంతటి భారీ మెజారిటీ లభించి ఉండవచ్చు. కానీ జగన్ పేరిట వస్తున్న పథకాలు ప్రజలకు మంచి చేస్తే చేసి ఉండవచ్చు కాని, చూసే వారికి మాత్రం కొంత ఏవగింపుగానే కన్పిస్తుంది. ప్రచారానికి దూరంగా జగన్ ఉంటారన్న భావన క్రమంగా కనుమరుగవుతోంది. జగన్ మెప్పు పొందడానికి పథకాల పేర్లు ఆయన పేరే పెట్టాలని సీనియర్ నేతలు సూచించి ఉండవచ్చు కాని, భవిష్యత్తులో చంద్రబాబుకు జరిగిన నష్టమే జగన్ కు జరగదన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు. మరీ అన్నింటికీ సిద్ధపడితే పథకాలకు జగన్ పేరును నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. అది ఆయన ఇష్టమే.

Tags:    

Similar News