ఒకసారి దగ్గరగా…మరోసారి దూరంగా..ఎందుకో అలా?

జగన్ రాజకీయం బాగానే నేర్చారనుకోవాలి. ఇక ఆయనకు రాజకీయ గురువుగా ఓ విధంగా చంద్రబాబును చెప్పుకోవాలేమో. ఈ మాటంటే బాబు గర్విస్తారేమో కానీ జగన్ మాత్రం కస్సుమంటారు. [more]

Update: 2020-03-04 13:30 GMT

జగన్ రాజకీయం బాగానే నేర్చారనుకోవాలి. ఇక ఆయనకు రాజకీయ గురువుగా ఓ విధంగా చంద్రబాబును చెప్పుకోవాలేమో. ఈ మాటంటే బాబు గర్విస్తారేమో కానీ జగన్ మాత్రం కస్సుమంటారు. కానీ జగన్ కి బాబు ఏవిధంగా రాజకీయ గురువు అంటే బాబు ముందు వేసిన అడుగులు, వాటి ఫలితాలు వెనక నుంచి జగన్ గమనిస్తూ జాగ్రత్తగా సాగుతున్నారు. ఆ విధంగా తప్పులేంటి ఒప్పులేంటి అన్నది బాబుని చూసి జగన్ బాగా నేర్చుకోవాలనుకోవాలి. పొత్తుల రాజకీయాలు, విజయాలు, విఫలాలు కూడా బాబు రాజకీయం నుంచే జగన్ స్పూర్తి పొందారంటారు. అందుకే ఆయన ఎవరూ తనకు దగ్గర కాదు దూరం కాదు అన్నట్లుగా ఉంటారు.

కలసిపోయారుగా…

సరిగ్గా కొన్ని రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళిన జగన్ ప్రధాని మోడీతో ఏ సీఎం జరపనంత ఎక్కువ సేపు భేటీ జరిపారు. అది మోడీ నివాసంలో జరిగిన భేటీ. దాంతో ఢిల్లీ సర్కిళ్ళ నుంచి గల్లీ వరకూ జగన్ బీజేపీకి దాసోహం అనుకున్నారు అంతా. అది జరిగిన రెండు రోజుల తరువాత జగన్ అమిత్ షాతో భేటీ వేశారు. ఇక ఏముందు జగన్ కేంద్రంలో మంత్రి పదవులు అందుకోనున్నారని ఒకటే ప్రచారం సాగింది. అది నిజమనిపించేలా వైసీపీ మంత్రి ఒకరు చేసిన కామెంట్స్ తో వైసీపీ బీజేపీ జట్టు అని అంతా కట్టేశారు. కానీ తరువాత జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే మళ్ళీ పునరాలోచనల్లో అంతా పడాల్సివచ్చింది.

మోఢీయేన‌ట….

జగన్ ఒకే సమయంలో రెండు ముఖ్య భూమికలు పోషిస్తున్నారు. దాంతోనే ఈ రకమైన కన్ ఫ్యూజన్ అంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ కేంద్రంతో సఖ్యత కోరుకుంటున్నారు. అదే సమయంలో వైసీపీ అధినేతగా బీజేపీని తుదికంటా వ్యతిరేకిస్తున్నారు. స్వతహాగా క్రిస్టియన్ అయిన జగన్ హిందూ భావజాలం కలిగిన బీజేపీతో అంటకాగే ప్రసక్తి ఉండదు. ఇక జగన్ పార్టీకి ముస్లిం మైనారిటీలు పెద్ద దన్ను, దానికి తోడు ఎస్సీ, ఎస్టీ వర్గాలు కూడా వైసీపీకి కొండంత అండగా ఉంటున్నాయి. వీరంతా జగన్ కు పెద్ద ఆస్తి, వీరెవరూ కూడా బీజేపీతో ఏ విధమైన సాన్నిహిత్యాన్ని మెచ్చుకోరు. అందుకే జగన్ పార్టీ అధినేతగా బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తారు. ఇపుడు ప్రభుత్వాధినేతగా కూడా ఏపీలోని మైనారిటీల మనోభావాలను పరిగణనలోకి తీసుకున్నామని, అందుకే జాతీయ జనాభా పట్టికని ప్రస్తుత రూపంలో ఆమోదించలేకపోతున్నామని జగన్ అంటున్నారు. మార్పులు చేసి నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తరహాలోనే నిబంధనలు ఉంటేనే తప్ప ఏపీలో అమలు చేయమని జగన్ గట్టిగా చెప్పుకొచ్చారు. అంటే ఓ విధంగా మోడీతో ఢీ కొట్టడమే.

అసెంబ్లీలో తీర్మానం….

నిజానికి చంద్రబాబు జగన్ కంటే ఎక్కువగా బీజేపీతో క్లోజ్ గా ఉండేవారు. బాబుకు ఏ రకమైన భేషజాలు లేవు. ముందు వర్తమాన రాజకీయమే ముఖ్యమనుకునే నాయకుడు. అటువంటి బాబే బీజేపీని ఒప్పించి ఏపీకి తెచ్చిన నిధులు పెద్దగా లేవు. పైగా పొత్తులు పెట్టుకుని పాహిమాం, నీవే శరణం అంటూ మోడీ వద్ద చేతులు కట్టినా ఏపీకి ఇచ్చింది లేదు. జగన్ అయితే బాబు అంత కూడా అసలు చేయరు. ఆయన ఢిల్లీ టూర్లు కూడా పరిమితంగా ఉంటాయి. ఆయన ఏపీ సీఎం హోదాలో కొంతవరకూ బీజేపీ పెద్దల వద్ద తగ్గుతారు. అంతే ఆ దగ్గరతనాన్ని చూసి కలసిపోయారనుకుంటే పప్పులో కాలెసినట్లే. జగన్ అయిదేళ్ళ సీఎం కాదలుఛుకోలేదు. సుదీర్ఘకాలం పార్టీని నిలబెట్టాలనుకుంటున్నారు. అందుకే ఆయన తన విధానాలకు అనుగుణంగా బీజేపీకి ఒక్కోసారి దగ్గరగా, మరోసారి దూరంగా కనిపిస్తారు. జాతీయ జనాభా పట్టికలో నిబంధనలు సవరణలు చేయాలని కోరుతూ అసెంబ్లీలో జగన్ తీర్మానం చేస్తాననడం అందులో భాగంగానే చూడాలి.

Tags:    

Similar News