ఎంత లేటైతే అంత దెబ్బ ?

జగన్ ఆలోచనల్లో వేగం ఉంది కానీ అమల్లో మాత్రం నత్త నడకగా సీన్ కనిపిస్తోంది. ఇక ఎటువంటి ముందస్తు కసరత్తు లేకుండా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా [more]

Update: 2020-03-06 02:00 GMT

జగన్ ఆలోచనల్లో వేగం ఉంది కానీ అమల్లో మాత్రం నత్త నడకగా సీన్ కనిపిస్తోంది. ఇక ఎటువంటి ముందస్తు కసరత్తు లేకుండా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా చివరికి బెడిసి కొడుతున్నాయి. దాని వల్ల ఆయన అనుకున్నది మరింత ఆలస్యం అవుతోంది. దానికి ఉదాహరణ మూడు రాజధానులు, మండలి రద్దు, లోకల్ బాడీ ఎన్నికల్లో 59 శాతం రిజర్వేషన్లు. నిజానికి జగన్ ఎన్నికైన వెంటనే మూడు నెలల తేడాలో లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తే ఆ కిక్కు వేరేగా ఉండేది. మొత్తానికి మొత్తం జగన్ ఖాతాలో పడేవి. ఇపుడు కొంత మార్పు ఉంది. మునుముందు మరెంతగా అది మారుతుందో తెలియదు.

కోరి తెచ్చుకున్నారా….?

తెలంగాణాలో ముస్లింలకు రిజర్వేషన్లు పెంచి కేసీఆర్ ఈ రకమైన ఇబ్బందినే తెచ్చుకున్నారు. యాభై శాతానికి మించి రిజరేషన్లు ఉండరాదన్నది సుప్రీం కోర్టు ఆదేశం. దాన్ని అధిగమించి బీసీల కోసం అన్నట్లుగా జగన్ చేసిన ఈ రిజర్వేషన్ల ప్రయోగం చివరికి అసలు ఎన్నికలే లేకుండా చేసింది. నిజానికి జగన్ కి లోకల్ బాడీ ఎన్నికలు వెంటనే పెట్టుకోవాలని కోరిక ఉన్నా, బీసీలను సమాదరించాలన్న ఆలోచన ఉన్నా ఓసీల్లొ వారికి ఎక్కువ సీట్లు ఇచ్చి యాభై శాతం వరకే రిజర్వేషన్ల కేటాయింపు చేసి ఉంటే ఎన్నికలు ఈ పాటికి అయిపోయేవి. ఇపుడు హైకోర్టు మొట్టికాయతో పరిస్థితి మొదటికి వచ్చింది.

మరింత జాప్యం….

ఇపుడు బీసీల రిజర్వేషన్లలో మార్పు చేర్పులు, యాభై శాతానికి లోబడి చేయమంటూ నెల రోజుల వ్యవధిని హైకోర్టు ఇచ్చింది. దాంతో ఏప్రిల్ నెల వచ్చేస్తుంది. ఈలోగా వరస పరీక్షలు ఉన్నాయి. ఇవన్నీ దాటుకుని ఎన్నికలు పెట్టాలనుకుంటే మండే ఎండలు నెత్తిమీదకు వస్తాయి. సాధారణంగా సమ్మర్ లో ఎవరూ ధైర్యం చేసి ఎన్నికలకు వెళ్ళరు. అలా వెళ్తే కనుక అధికార పార్టీకి పూర్తి ఎదురీతే అవుతుంది. ఇక సమ్మర్ దాటి వస్తే జూన్, జూలైల్లో ఎన్నికలు పెట్టుకోవాలి. అప్పటికి జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చేసి రెండో ఏడాది అవుతుంది. వ్యతిరేకత ఇంకా పెరుగుతుంది. అందువల్ల ఇపుడు వచ్చిన కోర్టు తీరు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఉంది.

సగానికి సగం……

ఎన్నికలు ఎంత లేటుగా పెడితే అంతగా విపక్ష టీడీపీకి లాభమన్న విశ్లేషణలూ ఉన్నాయి. క్షేత్రస్థాయిలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ ఈ ఎన్నికల కోసమే కాచుకుని కూర్చుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఎన్నికలు ఏవీ లేవు. అప్పటికే లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి అయ్యాయి. చివరి ఏడాది నాటికి లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినా బాబు వాయిదా వేసుకుంటూ పోయారు. దానికి కారణం వ్యతిరేక ఫలితాల భయమే. ఇపుడు జగన్ మాత్రం ఇందులో ఇరుక్కునేలా ఉన్నారు. మంచి మెజారిటీతో గెలిచి తొలి అయిదారు నెలలూ పాలన మీద పాజిటివ్ రిపోర్టులు వచ్చిన వేళ ఎన్నికలు జరిపించుకుని ఉంటే బాగుండేది. ఇపుడు మూడు రాజధానుల కధ ఎటూ తేలకుండా ఉంది. మరో వైపు లోకల్ బాడీ ఎన్నికలు లేట్ అవుతున్నాయి. అటు తిరిగి, ఇటు తిరిగి చివరికి ఏమవుతుందోనన్న భయం బెంగా వైసీపీ నేతల్లో కనిపిస్తోంది.

Tags:    

Similar News