వాయిస్ బేస్ పెంచాలనేనా?

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చి.. దాదాపు నాలుగు మాసాలు పూర్తయింది. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో పాల‌న‌లో దూసుకుపోతున్నారు. అయితే, అదే స‌మ‌యంలో [more]

Update: 2019-10-11 08:00 GMT

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చి.. దాదాపు నాలుగు మాసాలు పూర్తయింది. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో పాల‌న‌లో దూసుకుపోతున్నారు. అయితే, అదే స‌మ‌యంలో విప‌క్షాల నుంచి ఎదురుదాడులు, విమ‌ర్శల బాణాలు కూడా అధికంగానే ఉంటున్నాయి. ఈ నేప‌థ్యంలో వాటికి కౌంట‌ర్లు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏర్పడింది. కానీ, ఇప్పటి వ‌ర‌కు ప్రభుత్వ ప‌రంగా కానీ, పార్టీ ప‌రంగా కానీ, అధికార ప్రతినిధుల‌ను జ‌గ‌న్ నియ‌మించ‌లేదు. గ‌త ప్రభుత్వం విష‌యానికి వ‌స్తే.. పాల‌న ప్రారంభించిన నెల‌లోనే దాదాపు 15 మందిని అధికార ప్రతినిధులుగా నియ‌మించుకుని పాల‌న వ్యవ‌హారాల‌ను ప్రజ‌ల‌కు చేరువ చేసేందుకు చంద్రబాబు వినియోగించుకున్నారు.

కొందరు మాత్రమే…..

అదే స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో వ‌చ్చే విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్లు ఇచ్చేందుకు,ప్ర‌తిప‌క్షాల‌ను టార్గెట్ చేసేందుకు, ప్ర‌భుత్వం త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపించేందుకు ఈ అధికార ప్రతినిధుల‌ను వినియోగించుకున్నారు. దీంతో ఎప్పటిక‌ప్పుడు అధికార ప‌క్షం వ్యూహాలు ప్రజ‌ల్లోకి వెళ్లేవి. అయితే, ఇప్పుడు జ‌గ‌న్ ప్రభుత్వం ఇప్పటికీ అధికార ప్రతినిధుల‌ను నియ‌మించ‌లేదు. వ‌చ్చే నెల‌లో నియామ‌కాలు చేప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇప్పటి వ‌రకు ప్రభుత్వంపై వ‌స్తున్న విమ‌ర్శల‌కు మంత్రులు బొత్స స‌త్యనారాయ‌ణ లేదా ఏశాఖ‌కు చెందిన మంత్రి ఆశాఖ త‌ర‌పున మాట్లాడుతున్నారు. అది కూడా కేవ‌లం అంటీ ముట్టన‌ట్టు మాత్రమే కౌంట‌ర్లు ఇస్తున్నారు.

ఈ పదవుల కోసం….

ఇక కొంద‌రు మంత్రులు ఇంకా చెప్పాలంటే స‌గానికి పైగా మంత్రులు అసలు త‌మ‌కేం ప‌ట్టన‌ట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. దీంతో ఓ వైపు టీడీపీతో పాటు మ‌రో వైపు వైసీపీని గ‌ట్టిగా టార్గెట్ చేస్తోన్న బీజేపీని ఎదుర్కొనే విష‌యంలో వైసీపీ కొన్ని సంద‌ర్భాల్లో స‌రిగా కౌంట‌ర్లు ఇవ్వడం లేదు. కొన్ని సంద‌ర్భాల్లో ప్రభుత్వ వ్యూహం ఏంట‌నేది ప్రజ‌ల‌కు కూడా అర్ధం కాని ప‌రిస్థితి.. ఎవ‌రూ వివ‌రించ‌లేని ప‌రిస్థితి ఏర్పడింది. దీంతో అధికార ప్రతినిధుల నియామ‌కం జగన్ కు త‌ప్పనిస‌రిగా మారింది. ఇక‌, ఈ ప‌ద‌వుల కోసం వైసీపీ నాయ‌కులు జిల్లాకు క‌నీసం ఇద్దరు చొప్పున ఎదురు చూస్తున్నారు.

ఎవరిని ఎంపిక చేస్తారో?

గుంటూరులో చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ, విజ‌య‌వాడ‌లో య‌ల‌మంచిలి ర‌వి, జ‌గ్గయ్యపేట‌ ఎమ్మెల్యే సామినేని ఉద‌య‌భాను ఇలా చాలా మంది కీల‌క నాయ‌కులు అధికార ప్రతినిధులుగా ప‌దవుల రేసులో ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే, వీరిలో ఎవ‌రిని ఎంపిక చేస్తార‌నే విష‌యం స‌స్పెన్స్‌గానే ఉంది. బ‌ల‌మైన గ‌ళం వినిపించ‌డంతోపాటు కౌంట‌ర్లు విస‌ర‌డంలో ప‌ట్టు ఉండే నాయ‌కులే ఇప్పుడు జ‌గ‌న్‌కు ఆయ‌న ప్రభుత్వానికి అవ‌స‌ర‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి అంతిమంగా జ‌గ‌న్ ఎవ‌రిని ఎంపిక చేస్తారో ? చూడాలి.

Tags:    

Similar News