జగన్ టార్గెట్లు …. పటిష్టమైన ప్రణాళికతోనేనట

జగన్ కి పాలనానుభవం లేదని, అతని చేతిలో ఏపీ సర్వ నాశనం అవుతోందని ఓ వైపు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఆయన తమ్ముళ్ళు గగ్గోలు పెడుతున్నారు. [more]

Update: 2020-03-05 02:00 GMT

జగన్ కి పాలనానుభవం లేదని, అతని చేతిలో ఏపీ సర్వ నాశనం అవుతోందని ఓ వైపు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ఆయన తమ్ముళ్ళు గగ్గోలు పెడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి అయ్యాక‌ జగన్ తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని చాలా స్మూత్ గా ముందుకు తీసుకువస్తున్నారు. తాను మదిలో ఏమి అనుకుంటున్నానో దాన్ని ఆయన ఆచరణలో పెడుతూ 2024 నాటికి మళ్ళీ జనంలోకి గర్వంగా వెళ్ళి ఓట్లు అడిగేలా పనిచేసుకుంటూ పోతున్నారు. జగన్ బహుముఖీయంగా ఏపీ అభివృధ్ధి కోసం పధక రచన చేస్తున్నారు. వాటి ఫలితాలు రానున్న ఏడాదిలోనే చూడవచ్చునని వైసీపీ నేతలు చెబుతున్నారు.

పోలవరంతో….

ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరాన్ని 2021 జూన్ నాటికి పూర్తి చేయాలని జగన్ అధికారులకు చెప్పి వచ్చారు. జగన్ ఇంత పట్టుదలగా పోలవరం విషయంలో ఉండడానికి కారణం అది తన తండ్రి వైఎస్సార్ ప్రారంభించిన ప్రాజెక్ట్. అంతకు ముందు దశాబ్దాల క్రితం ఆగిన పోలవరాన్ని ట్రాక్ లోకి తెచ్చింది వైఎస్సారే. దాంతో ఆ ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత, చేయాల్సిన బాధ్యత కూడా జగన్ తన భుజాల మీద వేసుకున్నారు. పోలవరం పూర్తి చేస్తే ఏపీలో జగన్ కి రాజకీయంగా తిరుగు ఉండదన్నది సత్యం. అందుకే ఆయన శ్రద్ధ పెట్టి మరీ ఈ ప్రాజెక్టుని పరుగులెత్తిస్తున్నారు.

కంప్లీట్ కాపిటల్ ….

జగన్ మరో టార్గెట్ ఏపీకి గ్రోత్ ఇంజన్ లాంటి కాపిటల్. అది అమరావతితో సాధ్యం కాదన్న సంగతి చంద్రబాబు హయాం చెప్పేసింది. అందువల్ల తాను కూడా అక్కడే డబ్బులు పెట్టి ఏళ్ళకు ఏళ్ళు వెయిట్ చేయడం దండుగ అన్న భావనతోనే జగన్ విశాఖను ఎంచుకున్నారు. ఇప్పటికే అభివృధ్ధి చెందిన విశాఖను మరికాస్త ఖర్చు పెడితే మరో అయిదేళ్ళకు వైజాగ్ ఆ స్థితికి చేరుకుంటుంది. ఓ విధంగా పెట్టుబడులు కూడా విశాఖను చూసే వస్తాయన్నది కూడా వాస్తవం. అదే సమయంలో హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు ప్రస్తావన ఎపుడు వచ్చినా ఏపీకి వైజాగ్ ఉందన్నది ఇటు ప్రజలకూ, అటు పెట్టుబడిదారులకూ తెలియచెప్పాలన్నదే జగన్ మరో టార్గెట్. అందుకే ఆ దిశగానే వేగంగా అడుగులు వేస్తోంది వైసీపీ సర్కార్.

కేంద్రంతో సఖ్యత…..

ఇక ఏపీలో కాతో కూస్తో అభివృధ్ధి జరగాలంటే కేంద్ర సాయం తప్పనిసరి. అందుకే ఎటువంటి త్యాగాలు చేయాలన్నా కూడా జగన్ సిధ్ధంగా ఉంటున్నారు. కేంద్రంలో రానున్న నాలుగేళ్ళూ ఇలాగే సఖ్యతగా ఉండాలని, తద్వారా వారే చేయాల్సిన అనేక పనులను ముందుకు తీసుకువెళ్ళేలా చూసుకోవాలని యువ ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. ఏపీ పట్ల కేంద్రం సాఫ్ట్ కార్నర్ తో ఉంటే చాలు రాష్ట్రం ప్రగతిపధంలో సాగుతుందన్నది జగన్ వ్యూహంగా ఉంది. బాబు మాదిరిగా కేంద్రంపైన యుధ్ధం చేయడానికి జగన్ సిధ్ధంగా లేరని కూడా అంటున్నారు.

సంక్షేమ పధం….

జగన్ ఇప్పటికి ఏపీలో ఎన్నో పధకాలు అమలు చేశారు. వాటన్నిటికీ తలమానికంగా ఉండేది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం. భారీ లక్ష్యంతో కూడుకున్న ఈ పధకం కనుక సక్సెస్ అయితే జగన్ ని మళ్ళీ మళ్ళీ ఏపీ జనం ఎన్నుకుంటారని ఆ పార్టీ గట్టి విశ్వాసంతో ఉంది. అదే విధంగా పాతిక లక్షల ఇళ్ళను కట్టించి ఇవ్వడం అంటే మాటలు కాదు, దేశంలోనే అది రికార్డుగా ఉంటుంది. దీన్ని సాధించేందుకే జగన్ ఇపుడు అహరహం శ్రమిస్తున్నారని పార్టీ నాయకులు అంటున్నారు.

పెట్టుబడుల కోసం…..

మరో వైపు ఏపీలో పెట్టుబడుల కోసం జగన్ సర్కార్ ఇతర దేశాలకు వెళ్ళడం లేదు, తరచూ విదేశీ టూర్ల పేరిట హడావుడి చేయడంలేదు. తమ వద్దకు, తమ కోసం వచ్చిన వారితోనే మంతనాలు జరుపుతోంది. వారికి ఉన్నది ఉన్నట్లుగా చెబుతోంది. తాము ఏ విధంగా రాయితీలు ఇస్తామో కూడా జగన్, మంత్రులు వివరిస్తున్నారు. దానికి నచ్చి వచ్చేవారే పెట్టుబడులు పెడతారని, అవే వాస్తవ రూపం దాలుస్తాయని కూడా అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే 2024 ఎన్నికల్లో జగన్ మళ్ళీ జనం మెప్పు పొందేందుకు వీలుగా కచ్చితమైన ప్రణాళికతోనే ముందుకు సాగుతున్నారని అంటున్నారు.

Tags:    

Similar News