విమానంలో ఎగిరిపోయిందా ?

రాజకీయాలూ, పారిశ్రామికవేత్తలకు మధ్యన గట్టి బంధం ఉంటుంది. అది ఎంతటిది అంటే సిమెంట్ కన్నా గట్టిది, ధృఢమైనది. వారి అవసరాలు వీళ్ళకు తెలుసు, వీరి వ్యవహారాలు వారికి [more]

Update: 2020-03-01 08:00 GMT

రాజకీయాలూ, పారిశ్రామికవేత్తలకు మధ్యన గట్టి బంధం ఉంటుంది. అది ఎంతటిది అంటే సిమెంట్ కన్నా గట్టిది, ధృఢమైనది. వారి అవసరాలు వీళ్ళకు తెలుసు, వీరి వ్యవహారాలు వారికి తెలుసు. అందుకే చెట్టాపట్టాలు వేసుకుంటూ ఈ బంధాలు ఆలా సాగిపోతూంటాయి. ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే తాజాగా ఒక ఆసక్తికరమైన భేటీ పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. హఠాత్తుగా ముంబై నుంచి విమానంలో వచ్చి జగన్ ముందు వాలిపోయిన అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కహానీ గురించే జాతీయ స్థాయిలోనూ చర్చ సాగుతోంది. ఈ భేటీ సారాంశం ఏంటి అన్నది ఎవరికి వారు తర్కించుకుంటున్నారు.

రెక్కలు కట్టుకుని…

ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఉన్నాయి. వాటిని బంపర్ మెజారిటీ కారణంగా వైసీపీయే గెలుచుకుంటుంది. అందులో ఒకదాన్ని తన సన్నిహితుని కోసం అడిగేందుకే ముఖేష్ అంబానీ విమానం రెక్కలు కట్టుకుని మరీ వచ్చి జగన్ ముందు వాలారని అంటున్నారు. తన తండ్రి కాలం నుంచి తమతో కలసి పనిచేస్తున్న వ్యాపారవేత్త. రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్న పరిమళ్ నత్వానీకి ఈసారి ఏపీ కోటా నుంచి సీటు ఇవ్వమని కోరేందుకు ముఖేష్ పెద్ద పని పెట్టుకునే జగన్ని కలిశారని అంటున్నారు. ఇదంతా కార్పోరేట్ రాజకీయాల్లొ భాగంగానే సీటు కోటా వాటా కుదిరిందని అంటున్నారు.

పెద్దాయన సూచనతో …

ఏపీ నుంచి ఒక సీటుని తమకు ఇవ్వాలని బీజేపీ పెద్దలు జగన్ ని కోరారని అంటున్నారు. ఈ మధ్య జగన్ ఢిల్లీకి వెళ్ళినపుడు అమిత్ షా ఇదే విషయాన్ని జగన్ తో చర్చించారని అంటున్నారు. పరిమళ్ నత్వానీ గతంలో రెండు పర్యాయాలు బీజేపీ కోటాలో జార్ఖండ్ నుంచి నెగ్గారని, ఇపుడు అక్కడ బీజేపీ ఓడిపోవడంతో ఏపీ నుంచి ఆయనకు సీటు ఇవ్వాలని అమిత్ షా అడిగారని భోగట్టా. దాంతో బీజేపీతో మంచి సంబంధాలు నెరుపుతున్న జగన్ కూడా సరేనని అన్నారని అంటున్నారు. ముఖేష్ సన్నిహితునికి ఆ విధంగా మూడవసారి రాజ్యసభకు ఏపీ ముఖద్వారంగా ప్రవేశం లభించిందని చెబుతున్నారు.

సీటు గోవిందా….

ముఖేష్ అంబానీ జగన్ తో భేటీని చూసిన వైసీపీ వర్గాలు ఒక సీటు గోవిందా అనుకుంటున్నారుట. ఉన్న నాలుగు సీట్లలోనే గట్టి పోటీ ఏర్పడిందని, ఇపుడు మూడుతోనే సర్దుకోవాలని వారు మధనపడుతున్నారని టాక్. ముఖేష్ వంటి అపర కుబేరుడు, అందునా అమిత్ షా రికమండేషన్ తో జగన్ని వచ్చి కలిస్తే కచ్చితంగా ఆ సీటు ఇవ్వకుండా ఉంటారా అన్న చర్చ వైసీపీలో జరుగుతోంది. అంటే వైసీపీకి ఇపుడు మూడు సీట్లే మిగిలాయన్న క్లారిటీ అయితే వచ్చేసింది. దాంతో ఆశావహుల్లో నీరసం, నిరాశ ఆవహించాయి. ఏది ఏమైనా బీజేపీ తెలివిగా కదిపిన పావులతో ఏపీ నుంచి ఏ మాత్రం బలం లేకపోయినా తమ మనిషిని నెగ్గించుకుని రాజ్యసభకు తీసుకెళ్తోందని అంటున్నారు. దీని వల్ల అటు ముఖేష్ అంబానీ ఏపీకి చేయబోయే మేలు ఏంటి, బీజేపీతో జగన్ దోస్తీ వల్ల కలిగే లాభాలు ఏంటి అన్నవి భవిష్యత్తులో రాజకీయ తెర మీద చూడాల్సిందే.

Tags:    

Similar News