ఆ నలుగురూ …..డెసిషన్ ఓవర్

జగన్ విలక్షణమైన నాయకుడు. ఆయన ఇంట్లో రాజకీయం, వంట్లో రాజకీయం ఉన్నా కూడా వ్యవహార శైలి మాత్రం ఫక్తు కార్పొరేట్ స్టయిల్లో ఉంటుంది. పార్టీలో, ప్రభుత్వంలో జగన్ [more]

Update: 2020-03-03 13:30 GMT

జగన్ విలక్షణమైన నాయకుడు. ఆయన ఇంట్లో రాజకీయం, వంట్లో రాజకీయం ఉన్నా కూడా వ్యవహార శైలి మాత్రం ఫక్తు కార్పొరేట్ స్టయిల్లో ఉంటుంది. పార్టీలో, ప్రభుత్వంలో జగన్ ఆదేశం శిరోధార్యం. అక్కడ నో చర్చలు. అంతా ఫాలో కావాల్సిందే. ఇదీ జగన్ నైజం. దాని వల్ల చాలా సార్లు ఇబ్బందులు వచ్చినా కూడా జగన్ తన వైఖరిని మార్చుకోలేదు. ఇక పార్టీని పదేళ్ళుగా నడుపుతున్న జగన్ ఇపుడు ప్రభుత్వాన్నే నడుపుతున్నారు. అంటే ఆయన నిర్ణయాల మీద ఆధారపడి అయిదు కోట్ల మంది ప్రజలు ఉన్నారన్నమాట. జగన్ తన భావాలను ఎవరితోనూ పంచుకోరు అంటారు. ఆయన మదిలో మెదిలిన ఆలోచనలే ఆచరణలోకి అలా వచ్చేస్తూంటాయి.

వివాదాలు లేవు….

అదృష్టం ఏంటంటే జగన్ ఇప్పటివరకూ ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలలో పెద్దగా వివాదాలు లేవని చెప్పాలి. మూడు రాజధానుల విషయలో కూడా మంత్రి బొత్స ద్వారా లీకులు ఇప్పిస్తూ రావడం వల్ల జనాలకు అది డైజెస్ట్ అయిపోయింది. ఇక శాసన‌మండలి రద్దు వంటివి జనాలకు సంబంధం లేని విషయాలు కావడంతో పెద్దగా రియాక్షన్ లేదు. మరో వైపు జగన్ అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు పేరిట తీసుకున్న నిర్ణయం కూడా చివరి నిముషం వరకూ ఎవరూ ఊహించలేకపోయారు. ఇక ఎన్నికల్లో జగన్ అభ్యర్ధులకు ఇచ్చిన టికెట్లు చూసిన వారు కూడా జగన్ అంతరంగం పసిగట్టడం అసాధ్యమన్న భావనకు వచ్చేశారు.

ఎవరంటే…

ఇపుడు ఏపీకి నాలుగు రాజస్యసభ సీట్లు దక్కబోతున్నాయి. దాని కోసం డజన్ల కొద్దీ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. జగన్ ఇంట్లో కూడా ఓ వైపు బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి, చెల్లెలు షర్మిల ఉన్నారు. ఇంకో వైపు చూస్తే మండలి రద్దు కత్తి మెడ మీద వేలాడుతున్న ఇద్దరు మంత్రులు మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. వీరే కాదు, పార్టీలో కొత్తగా చేరిన నెల్లూరు నేత బీదా మస్తాన్ రావు. అయోధ్యారామిరెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఇలా ఆశావహులది చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి చూసుకుంటే కిల్లీ క్రుపారాణి, దాడి వీరభద్రరావు, సాంబశివరాజు వంటి వారు కూడా ఆశపెట్టుకుని ఉన్నారు. మరి వీరిలో పెద్ద మనుషులు ఎవరంటే చెప్పడం కష్టమేనని అంటున్నారు.

ఎదురు చూపులయినప్పటికీ….

ఇవన్నీ ఊహాగానాలే. జగన్ కి అందరూ దగ్గరే. ఎంత దగ్గరంటే ఆయన పెట్టిన ఓ పరిధి మేరకు మాత్రమే వారు రీచ్ కాగలరు. ఆ మీదట జగన్ వారిని అనుమతించరు. అంటే అక్కడ నుంచి జగన్ని, ఆయన మనసుని చదవడం ఎవరికీ సాధ్యం కాదు. ఇక రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ మార్చి 6 న జారీ అవుతోంది. 12 న నామినేషన్లు స్వీకరణ ఉంటుంది. అయితే ఇప్పటికే జగన్ ఎవరిని పెద్దల సభకు పంపనున్నారో అన్నది ఒక నిర్ణయానికి వచ్చేశారని కూడా వినిపిసోంది. అందరి అంచనాలు తారుమారు చేస్తూ అనూహ్యమైన రీతిలో జగన్ పెద్ద మనుషులను ఎంపిక చేస్తారని ఆయన వ్యవహార శైలిని గమనించిన వారు అంటున్నారు. మొత్తం మీద జగన్ నోట ఆ పేర్లు వచ్చేంతవరకూ ఈ సస్పెన్స్ కొనసాగాల్సిందే. అంతా జగన్ మీదనే భారం వేసి ఆశావహులు ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News