ఆ నేతలు జగన్ ని బాగా ఇబ్బంది పెడుతున్నారా…?

రాజ్యస‌భ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధమైన నేప‌థ్యంలో ఏపీలో రాజ‌కీయంగా నాయ‌కుల వ్యూహాలు ప్రారంభ‌మయ్యాయి. ఎవ‌రికి వారు త‌మ ప్రయ‌త్నాలు తాము ప్రారంభిస్తున్నారు. మొత్తం 4 స్థానాలు వైసీపీకి [more]

Update: 2020-03-03 11:00 GMT

రాజ్యస‌భ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధమైన నేప‌థ్యంలో ఏపీలో రాజ‌కీయంగా నాయ‌కుల వ్యూహాలు ప్రారంభ‌మయ్యాయి. ఎవ‌రికి వారు త‌మ ప్రయ‌త్నాలు తాము ప్రారంభిస్తున్నారు. మొత్తం 4 స్థానాలు వైసీపీకి ద‌క్కనున్న క్రమంలో ఈ నాలుగింట్లో ఎవ‌రికి అవ‌కాశం ద‌క్కుతుంద‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. అదే స‌మ‌యంలో పోటీ కూడా తీవ్రంగానే ఉంది. నోటిఫికేష‌న్ ప్రకారం తెలంగాణ‌లో రెండు స్థానాలు, ఏపీలో నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఏపీలో ఎంఏ ఖాన్‌, సుబ్బిరామిరెడ్డి(కాంగ్రెస్‌), కే కేశ‌వ‌రావు(టీఆర్ ఎస్‌), తోట సీతారామల‌క్ష్మి(టీడీపీ)ల సీట్లు ఖాళీ అవుతున్నాయి.

ఆశావహులు చాలా మంది…

దీంతో వైసీపీ ఆశావ‌హులు ఉవ్విళ్లూరుతున్నారు. జ‌గ‌న్‌ను ప్రస‌న్నం చేసుకునేందుకు అప్పుడే వారు ప్రయ‌త్నాలు ప్రారంభించారు. మ‌రో వైపు మండ‌లి ర‌ద్దవుతోంది. జ‌గ‌న్ ఎన్నిక‌ల ముందు నుంచి చూస్తే ఇప్పటి వ‌ర‌కు దాదాపుగా 30 మంది నేత‌ల‌కు పైగా మండ‌లి సీటు ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. మండ‌లి ర‌ద్దయితే మండ‌లి నుంచి మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ ప‌రిస్థితి ఏంటో తెలియ‌ట్లేదు. ఇక ఎమ్మెల్సీని చేసి మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇచ్చిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ లాంటి వాళ్ల ప‌రిస్థితి ఏంటో తెలియ‌డం లేదు.

విజయసాయిని కలసి…..

ఇంత తీవ్ర పోటీ నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు రాజ్యస‌భ సీట్ల ఎంపిక క‌త్తిమీద సాములా మారింది. అయితే, ఇప్పటికే ఒక‌టి రెండు సీట్లను జ‌గ‌న్ ఖ‌రారు చేసిన‌ట్టు వార్తలు వ‌చ్చాయి. వాటిలో ఒక‌టి టీడీపీ నుంచి ఇటీవ‌లే బ‌య‌ట‌కు వ‌చ్చి వైసీపీ తీర్థం పుచ్చుకున్న బీద మ‌స్తాన్ రావు, జ‌గ‌న్ వ్యాపార భాగ‌స్వామి రాంకీ అధినేత అయోధ్య రామిరెడ్డిలకు రాజ్యస‌భ సీటు ఖ‌రారైన‌ట్టు స‌మాచారం. మ‌రో రెండు సీట్లలోనూ పోటీ తీవ్రంగా ఉంది. ఎస్సీ వ‌ర్గం నుంచి అమ‌లాపురం మాజీ ఎంపీ పండుల ర‌వీంద్రకుమార్‌, బీసీ వ‌ర్గం నుంచి జంగా కృష్ణమూర్తి పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ ఇప్పటికే పార్టీలో నెంబ‌ర్-2 విజ‌య‌సాయిని క‌లిసి మంత‌నాలు సాగిస్తున్నారు.

వీరిద్దరిలో ఎవరికో?

ఇక‌, మ‌రో ఇద్దరు లేడీ లీడ‌ర్లు కూడా ఈ టికెట్ కోసం ప్రయ‌త్నిస్తున్నారు. వీరిలో క‌ర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక‌, శ్రీకాకుళం మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిలు ఉన్నట్టు వైసీపీ నాయ‌కుల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతోంది. 2014లో క‌ర్నూలు ఎంపీగా వైసీపీ టికెట్‌పై నే గెలిచిన రేణుక‌, మ‌ధ్యలో చంద్ర బాబుకు జై కొట్టారు. మ‌ళ్లీ 2019 ఎన్నిక‌లకు ముందు వైసీపీకి జైకొట్టారు. దీంతో ఆమె ఇప్పుడు రాజ్యస‌భ కోసం ప్రయ‌త్నిస్తున్నారు. ఇక‌, గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న కిల్లి.. ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే టికెట్ కూడా త్యాగం చేసి పార్టీ కోసం ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు ఈమె కూడా పెద్దల స‌భ రేసులో ఉన్నారు. సో.. మ‌రి వీరిలో ఎవ‌రిని జ‌గ‌న్ క‌రుణిస్తారో చూడాలి.

Tags:    

Similar News