ఎమ్మెల్యేలకు జగన్ వరం…అందుకేనటగా

జగన్ వరమే ఇచ్చారనుకోవాలి. ఎందుకంటే ఆయన ఇపుడు ఎమ్మెల్యేలకే దేవుడు అయిపోయారు. వారు ఆయన్ని ఎక్కడో మీటింగుల్లో చూడడం తప్ప నేరుగా వచ్చి దర్శించుకున్నది లేదు. ఇది [more]

Update: 2020-02-28 12:30 GMT

జగన్ వరమే ఇచ్చారనుకోవాలి. ఎందుకంటే ఆయన ఇపుడు ఎమ్మెల్యేలకే దేవుడు అయిపోయారు. వారు ఆయన్ని ఎక్కడో మీటింగుల్లో చూడడం తప్ప నేరుగా వచ్చి దర్శించుకున్నది లేదు. ఇది ఒకరోజు కాదు, గత తొమ్మిది నెలలుగా సాగుతున్న బాగోతం. అంతకు ముందు కూడా జగన్ పాదయాత్రల పేరిట జనంలో ఉన్నారు. ఆ విధంగా నాడు జగన్ తో సాన్నిహిత్యం నెరిపే అవకాశం ఎమ్మెల్యేలకు లేకుండా పోయింది. బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ లో ఎమ్మెల్యేలు చాలా కాలంగా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దానికి కారణాలు వాకబు చేసే ఓపికా తీరికా ఇన్నాళ్ళుగా హై కమాండ్ కి లేకపోయింది.

ఆ హుషారేదీ ..?

వైసీపీ విపక్షంలో ఉన్నపుడే నయం. అటు పార్టీలో, ఇటు ఎమ్మెల్యేల్లో హుషార్ బాగా ఉండేది. అధినాయకత్వానికి బద్దులుగా పనిచేసేవారు. నిజానికి జగన్ ని ముఖమంత్రిగా చూడాలన్న పట్టుదలతో ప్రతీవారు నాడు గట్టిగా పనిచేశారు. ఎపుడైతే అధికారం చేతికి అందిందో నాటి నుంచి పార్టీ పూర్తిగా పడకేసింది. ఎమ్మెల్యేలు సైతం నిండా నీరుకారారు. దానికి కారణం అధినాయకత్వం పోకడలే. స్వయంగా ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలిసే సౌభాగ్యం వైసీపీ సర్కార్ లో లేదన్న విమర్శలు చాలా కాలంగా ఉంటున్నవే.

అంటీ ముట్టనట్లుగా…..

ఇక జగన్ తీరు చూస్తే అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. నాయకులు ఎవరైనా తన దగ్గరకు వస్తే సిఫార్సులు చేయాల్సివస్తుందన్నది జగన్ ఆలోచనగా ఉందని అంటున్నారు. అలాగే లేనిపోని హామీలు ఇచ్చి ఇరుకున పడతానన్న ముందు జాగ్రత్తతోనే జగన్ వారికి దూరం పాటిస్తున్నారు అన్నది ఒక టాక్. దాంతో పార్టీ సీనియర్లతో కధ నడిపిస్తున్నారు. డైరెక్ట్ గా ఎమ్మెల్యేలను జగన్ కలుసుకుని చాలా కాలం అయింది. ఈ క్రమంలో అధినాయకుడు మనసులో ఏముందో పార్టీ ఎమ్మెల్యేలకు తెలియదు, వారి పనితీరు మీద జగన్ కి కూడా అవగాహన లేదు. దీంతో పార్టీలో పెద్ద అగాధమే ఏర్పడింది.

భలే చాన్స్….

ఈ క్రమంలో జరిగిన తప్పులను జగన్ ఇపుడు తెలుసుకున్నారని అంటున్నారు. దారుణంగా పార్టీ కార్యక్రమాలు పడిపోయాయన్న నివేదికలతో జగన్ అప్రమత్తం అయ్యారని అంటున్నారు. దగ్గరలో స్థానిక ఎన్నికలు ఉండడంతో ఎమ్మెల్యేలను రీఛార్జి చేయాలని జగన్ భావిస్తున్నారుట. అందుకే వారికి తగిన సమయం ఇవ్వాలని కీలకమైన డెసిషన్ని జగన్ తీసుకున్నారు. ఇకపై ప్రతీ రోజూ మధ్యాహ్యం మూడు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకూ జగన్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. ఇది నిజంగా తమకు ఆనందం కలిగించే విషయం అని ఎమ్మెల్యేలు అంటున్నారు. ముఖ్యమంత్రి ముందు తమ విన్నపాలు నేరుగా పెట్టుకుని సమస్యలు పరిష్కరించుకుంటామని అంటున్నారు. మొత్తం మీద పార్టీకి భారీ నష్టం జరగకుండానే జగన్ స్పందించి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నేతల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఇకపైన పార్టీని కూడా జగన్ ఇలాగే పట్టించుకుంటే మునుపటి ఉత్సాహం వస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News