ఇక నోళ్లు తెరవలేరుగా

వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఐదేళ్లు చేయలేని పనిని జగన్ చేసి చూపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఇటీవల కాలంలో [more]

Update: 2019-10-06 05:00 GMT

వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఐదేళ్లు చేయలేని పనిని జగన్ చేసి చూపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఇటీవల కాలంలో ఎన్నో రకాల విమర్శలు విన్పిస్తున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలపై దాడులు చేస్తూ వారిపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు గత కొంతకాలంగా నిత్యం మీడియా ముందుకు అరుస్తున్నారు. సామాన్య జనం కూడా ఇది నిజమేనని అనుకుంటున్నారు.

కోడెల ఆత్మహత్యతో….

ముఖ్యంగా కోడెల శివప్రసాద్ ఆత్మహత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఇది జగన్ ప్రభుత్వ హత్యేనంటూ టీడీపీ విస్తృత ప్రచారం చేసింది. కోడెల పై అక్రమ కేసులు బనాయించి జగన్ సర్కార్ మానసికంగా వేధించినందువల్లే ఆయన చనిపోయారని చంద్రబాబు పదే పదే చెప్పుకొచ్చారు. దీంతో వైసీపీ నేతలకు వాయిస్ లేకుండా పోయింది. కోడెల శివప్రసాద్ వంటి నేత ఆత్మహత్యకు పాల్పడటమేంటన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి.

టీడీపీ ఎమ్మెల్యేలపై….

ఇక టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, కూన రవికుమార్, అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు వంటి వారిపై కేసులను కూడా పదే పదే చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. జగన్ కేవలం కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, రాష్ట్రాభివృద్ధిని పక్కన పెట్టేశారని టీడీపీ ఆరోపిస్తోంది. చింతలపూడి, కూన రవికుమార్ వంటి వారు తప్పులు చేసినా అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడిపై కేసులు పై కొంత ప్రజల్లోనూ అనుమానాలున్నాయి.

ఎవరికీ లొంగరని….

ఈ నేపథ్యంలో జగన్ తీసుకున్న నిర్ణయంతో ఈ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయించడం పార్టీలోనూ చర్చనీయాంశమయింది. జగన్ కు కోటంరెడ్డి అత్యంత ఆప్తుడు. పార్టీనే నమ్ముకుని ఉన్న కోటంరెడ్డిని అరెస్ట్ చేయించడం నిజంగా సంచలనమే. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే అరెస్ట్ చేయించడంతో ఇక టీడీపీ నేతలు నోరు తెరిచే అవకాశం లేదు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తరచూ వివాదాల్లో చిక్కుకుంటుండటంతో జగన్ ఆదేశాల మేరకే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద జగన్ తాను అనుకున్నది అనుకున్నట్లు చేస్తారని, ఎవరికీ లొంగరన్నది కోటంరెడ్డి అరెస్ట్ తో తేటతెల్లమయింది.

Tags:    

Similar News