ఫ్యాన్ పార్టీ రెక్కలు..ముక్కలవుతున్నాయా?

ఏడాది కాకముందే వైసీపీ అసలు రంగు బయటపడుతోంది. ఇన్నాళ్లూ జగన్ మాట వేదం.. ఆయన చెప్పినట్లే నడుస్తామన్న నేతలు సయితం జబ్బలు చరుస్తున్నారు. ప్రాంతీయ పార్టీల్లో అధినేత [more]

Update: 2020-02-29 15:30 GMT

ఏడాది కాకముందే వైసీపీ అసలు రంగు బయటపడుతోంది. ఇన్నాళ్లూ జగన్ మాట వేదం.. ఆయన చెప్పినట్లే నడుస్తామన్న నేతలు సయితం జబ్బలు చరుస్తున్నారు. ప్రాంతీయ పార్టీల్లో అధినేత చెప్పిందే ఫైనల్. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు పార్టీ అధినేత ముఖ్యమంత్రి కావడంతో ఆయన పార్టీ విషయాలను పట్టించుకోవడం లేదు. పాలనపైనే జగన్ దృష్టి పెట్టారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం, మ్యానిఫేస్టోలో అంశాలను అమలు పర్చడమే లక్ష్యంగా జగన్ పనిచేసుకు పోతున్నారు.

పట్టించుకోక పోవడంతో….

జగన్ పార్టీ విషయాలను పట్టించుకోక పోవడంతో అనేక జిల్లాల్లో వర్గ పోరు మొదలయింది. జిల్లా ఇన్ ఛార్జి మంత్రులు కూడా విభేదాలను సెటిల్ చేయలేకపోతున్నారు. అందరూ జగన్ కు కావాల్సిన వారే కావడంతో ఎవరి పక్షాన నిలిచేందుకు మంత్రులు సిద్ధపడటం లేదు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి నేతలు కూడా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటంతో వైసీపీలో విభేదాలు మరింత రచ్చకెక్కుతున్నాయి.

ఏ నియోజకవర్గమైనా…?

ఏ నియోజకవర్గం చూసినా గ్రూపు విభేదాలే. రోడ్డుపైకి వచ్చి దాడులు చేసుకుంటున్నా తాడేపల్లి నుంచి జగన్ స్పందించడం లేదు. రామచంద్రాపురంలో జరిగిన సంఘటన ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఇక నెల్లూరు జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలే వర్గాలుగా విడిపోయి పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి, ఎమ్మెల్యేలకు మధ్య పొసగడం లేదు. పంచాయతీ పెద్దదిగానే ఉంది. ఇదే జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరి దారి వారిదేనన్నట్లు వ్యవహరిస్తున్నారు. మానుగుంట మహేందర్ రెడ్డి సీనియర్ నేత అయినా నియోజకవర్గానికే పరిమితమయ్యారు.

సీనియర్ నేతలు సయితం…..

ఇక రాజధాని ప్రాంతంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే విడదల రజనీ, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిల మధ్య వివాదాలు జగన్ వరకూ వెళ్లినా ఇంతవరకూ సాల్వ్ కాలేదు. దీనికి ప్రధాన కారణం జగన్ పార్టీని పట్టించుకోక పోవడమేనంటున్నారు. సీనియర్ నేతలు కూడా మూడు రాజధానులు, మండలి రద్దు అంశం వంటి విషయాల్లో బిజీగా ఉండటంతో వారి మధ్య సఖ్యత కుదర్చలేకపోతున్నారంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బ తగలడం ఖాయంగా కన్పిస్తుంది. అయితే ఒకే ఒక నమ్మకం. జగన్ ఎంటర్ అయి ఒక మాట చెబితే అంతా సెట్ రైట్ అవుతుందని వైసీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించడం గమనార్హం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పార్టీలో ఇంతగా విభేదాలు బయటపడటం మంచి పరిణామం కాదంటున్నారు.

Tags:    

Similar News