మ‌నం కాపీ కొట్టడం కాదు ..వాళ్లే కాపీ కొడుతున్నారు

రాష్ట్రంలో జ‌గ‌న్ ప‌రిపాల‌న ప్రారంభ‌మై ప‌ది నెల‌లు పూర్తయింది. ఈ క్రమంలో జ‌గ‌న్ ప‌రిపాలన తీరు ఎలా ఉంది? ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ అంటున్నట్టు అరాచ‌కంగా ఉందా? [more]

Update: 2020-02-28 14:30 GMT

రాష్ట్రంలో జ‌గ‌న్ ప‌రిపాల‌న ప్రారంభ‌మై ప‌ది నెల‌లు పూర్తయింది. ఈ క్రమంలో జ‌గ‌న్ ప‌రిపాలన తీరు ఎలా ఉంది? ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ అంటున్నట్టు అరాచ‌కంగా ఉందా? లేక విభిన్నశైలిలో ప్రజ‌ల‌కు మేలు చేసేలా ఉందా? ఇప్పుడు ఈ ప్రశ్నే నెటిజ‌న్లను అడిగితే అదిరిపోయే ఆన్సరిచ్చారు. అనుసరించడం కాదు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే నిర్ణయాలను తీసుకోవడంలో జ‌గ‌న్‌ ప్రభుత్వం కొత్త ట్రెండ్‌ సెట్‌ చేస్తోందని నెటిజన్లు అంటున్నారు. ముఖ్యంగా ప‌క్క రాష్ట్రాల‌ను చూసి గ‌త ప్రభుత్వం అనేక ప‌థ‌కాల‌ను ఇక్కడ అమ‌లు చేసేద‌ని, కానీ, ఇప్పడు మ‌న‌ల్ని చూసి ప‌క్క రాష్ట్రాలే కాకుండా సుదూరంలో ఉన్న రాష్ట్రాలు కూడా థ‌కాలు కాపీ చేసుకుంటున్నాయ‌ని అంటున్నారు.

స్వాగతిస్తున్న నిర్ణయాలు….

తెలుగు వారి ఆత్మగౌర‌వం ఇదే అంటూ.. టీడీపీకి చుర‌క‌లు అంటిస్తున్నాయి. ప్రధానంగా పాలనా వికేంద్రీకరణ, దిశ బిల్లు, పోలీస్‌ వీక్లీ ఆఫ్, స్పందన వంటి నిర్ణయాలను నెటిజన్లు స్వాగ‌తిస్తున్నారు. మూడు రాజధానులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపి పాలనా వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ పాలిత కర్ణాటక కూడా తాజాగా ఇదే బాట పట్టడం గమనార్హం. ఇందులో భాగంగా అక్కడి యడియూరప్ప ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లును ఆమోదించింది కూడా. అక్కడ బెంగళూరుతోపాటు బెళగావిలో కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

స్థానిక సంస్థల ఉద్యోగాల్లో…..

తాజాగా.. బెంగళూరు నుంచి కొన్ని కార్యాలయాలను ఉత్తర కర్ణాటకకు తరలించాలని ఆ సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. పాలనా వికేంద్రీకరణకు సంబంధించి సీఎం వైఎస్‌ జగన్‌ బాటలోనే బీజేపీ ముఖ్యమంత్రి యడియూరప్ప నడుస్తున్నారంటూ విద్యావంతులు, మేధావులు విశ్లేషిస్తున్నారు. దీనికితోడు పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిని కూడా అనుసరిస్తూ కర్ణాటక సర్కారు కొద్ది రోజుల క్రితం తీర్మానం చేయడం విశేషం.

పోలీసులకు వీక్లీ ఆఫ్…

ఇక 24 గంటలు కష్టపడే పోలీసులకు వారంలో ఒక రోజైనా విశ్రాంతి ఇవ్వాలనే ప్రతిపాదనను అమల్లోకి తెచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మరో నిర్ణయాన్ని కూడా అనుసరించేందుకు పలు రాష్ట్రాలు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా దీనికి సంబంధించి వివరాలు కోరిన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఏపీ పోలీసు అధికారులు ఇప్పటికే నివేదించారు. ప్రజల కష్టాలు తీర్చే ‘స్పందన’ కార్యక్రమాన్ని అమలుచేసేందుకు పలు రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి.

స్పందన కార్యక్రమాన్ని….

దేశంలోనే తొలిసారిగా ఏపీలో స్పందన అమలుచేస్తున్న తీరుతెన్నులపై కూడా అనేక రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు ఇప్పటికే ఏపీ పోలీసుల నుంచి వివరాలు సేకరించారు. మొత్తంగా చూస్తే ప‌క్క రాష్ట్రాల‌ను చూసి నాడు చంద్రబాబు కాపీ కొట్టి ప‌థ‌కాలు అమ‌లు చేస్తే.. ప్రస్తుత జ‌గ‌న్ ప్రభుత్వం మాత్రం ప‌క్కరాష్ట్రాలు ఏపీని చూసి కాపీకొట్టేలా పాలిస్తున్నార‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Tags:    

Similar News