జగన్ మనసు విప్పిన వేళ ?

జగన్ సాధారణంగా బయటపడరు, ఆయన ఎంతో బాధపడితే తప్ప అది వెళ్ళగక్కరు, గత కొంతకాలంగా ఏపీలో జరుగుతున్న పరిణామాలను జగన్ విజయనగరం జిల్లా పర్యటనలో ఒకసారి మననం [more]

Update: 2020-02-25 03:30 GMT

జగన్ సాధారణంగా బయటపడరు, ఆయన ఎంతో బాధపడితే తప్ప అది వెళ్ళగక్కరు, గత కొంతకాలంగా ఏపీలో జరుగుతున్న పరిణామాలను జగన్ విజయనగరం జిల్లా పర్యటనలో ఒకసారి మననం చేసుకుని తన ఆవేదనను జనంతో పంచుకున్నా రనిపిస్తోంది. తాను ఒకేసారి రాక్షసులు, ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నానని జగన్ అన్నారంటే అంతకంటే పెద్ద మాట ఉంటుందా? రాక్షసులు ఎవరంటే అందరికీ తెల్సిన విషయమే. ప్రతీ దాన్ని దారుణంగా విమర్శలు చేస్తూ వస్తున్నా టీడీపీని ఆయన ఆలా పోల్చారు. ఇక ఉన్మాదులుగా ఎల్లో మీడియాను ఆయన చిత్రీకరించారు. తప్పు జరిగితే నిగ్గదీయండి, కానీ ఏపీలోని అయిదు కోట్ల మంది జనం భవిష్యత్తును ఫణంగా పెట్టకండన్నట్లుగా జగన్ కోరడం మాత్రం ఆలోచించాల్సిన విషయ‌మే.

ఇదేనా నీతి…?

నిజంగా జగన్ మీడియా మీద ఇలా విరుచుకుపడతారని ఎవరూ అనుకోరు. అదే ఎల్లో మీడియా మీద. దాని పని అందరికీ తెలిసిందే, చంద్రబాబుని ఆకాశానికి ఎత్తడం, అదే సమయంలో జగన్ మీద కావాల్సినంతగా బురద జల్లడం. దాన్ని జగన్ గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. మీ చంద్రబాబుని జనం మరచిపోతారని భయమా, లేక కలవరమా. ఎందుకు అలా లేనిది ఉన్నట్లుగా భ్రమలు కల్పించి దుష్ప్రచారం చేస్తారంటూ డైరెక్ట్ గానే ఎల్లో గ్యాంగ్ ని నిగ్గదీశారు.

ఏమనాలో మరి……

ఇక తమ ఇష్టానికి తగినట్లుగా రాస్తూ పరిశ్రమలు ఏపీ నుంచి తరలిపోతున్నాయని ఓ వైపు భయభ్రాంతులకు గురి చేస్తున్న ఎల్లో మీడియాపైన జగన్ మండిపడ్డారు. అదే సమయంలో ఏపీలో లేనిది ఉన్నట్లుగా చూపిస్తూ పెట్టుబడులు అసలు రాకూడదని కుటిల రాజకీయం చేస్తున్న తాము కోరుకున్న వారు అధికారంలో లేరన్న అక్కసును వ్యక్తం చేస్తూ సాగిస్తున్న ఘాతుకాలను కూడా ఆయన ఎండగట్టారు. అభివృధ్ధి అడ్డుకుంటూ ప్రతీ దానికీ దుష్ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా పత్రికలను, ఛానళ్ళనూ ఏమనాలో తెలియడం లేదని కూడా జగన్ అన్నారు.

పేదలకు శిక్షా…?

తాను ప్రతీ పధకం పేదల కోసమే ప్రవేశపెడుతున్నానని జగన్ చెప్పుకున్నారు. పేదల సంక్షేమం కోసమే పరితపిస్తున్నానని కూడా ఆయన అన్నారు. అటువంటిది చెడు ప్రచారం చేయడం వల్ల నష్టం ఎవరికి కలుగుతుందో చెప్పాలని కూడా జగన్ అంటున్నారు. అధికార వికేంద్రీకరణ అయినా మ‌రోటి అయినా ప్రజల మేలు కోస‌మే తాను చేస్తూంటే విష ప్రచారంతో అడుగడుగున్నా అవాంతరాలు కల్పిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేయడమూ గమనార్హం. పెట్టుబడులు రావద్దా, రాకుండా చేస్తారా అని జగన్ మండిపడడమూ సహేతుకమే. మొత్తం మీద చూసుకుంటే అటు చంద్రబాబు, ఆయనకు వత్తాసుగా ఉండే మీడియాని జగన్ గట్టిగానే తగులుకున్నారు. మరి దీని మీద వారేమంటారో?

Tags:    

Similar News