గ్రాఫ్ పడిపోయిందా?

గత కొంతకాలంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు, కేంద్రానికి మధ్య సత్సంబంధాలు లేవు. గడచిన రెండు రోజులుగా వరసగా ఏపీ , తెలంగాణ అగ్రనేతలు ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. [more]

Update: 2019-10-06 15:30 GMT

గత కొంతకాలంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు, కేంద్రానికి మధ్య సత్సంబంధాలు లేవు. గడచిన రెండు రోజులుగా వరసగా ఏపీ , తెలంగాణ అగ్రనేతలు ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఈ భేటీలు కేవలం పరిపాలన పరంగానే కాకుండా రాజకీయ సంబంధాల పునరుద్ధరణకూ దోహదం చేయాలనేది వారి ఉద్దేశం. అయితే ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా లు తెలుగు నేతల సంప్రతింపులను ఏరకంగా చూస్తారనేదే చర్చ. తెలంగాణలో కేసీఆర్ తో 2014, 2015ల్లో బీజేపీకి పెద్దగా సత్సంబంధాలు లేవు. కానీ ఆ తర్వాత కేసీఆర్ ప్రధాని మోడీకి గట్టి మద్దతుదారుగా మారారు. అదే సమయంలో కేంద్రం కూడా తెలంగాణ పట్ల అవ్యాజ్యమైన ప్రేమ కురిపించింది. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రశంసించని కేంద్రమంత్రి లేరు. కానీ 2018 ఎన్నికల తర్వాత కేసీఆర్ కు, మోడీకి పూర్తిగా సంబంధాలు బెడిసికొట్టాయి. తెలంగాణ ముఖ్యమంత్రి పొరపాటు రాజకీయ అంచనాలతో బీజేపీని చిన్నచూపు చూశారు. మోడీని, అమిత్ షాను నేరుగా టార్గెట్ చేశారు. ఫలితంగా బీజేపీ తన వ్యూహాలను పూర్తిగా మార్చుకుంది.

కలిసి నిలిచినా…

టార్గెట్ తెలంగాణ లక్ష్యంతో లోక్ సభ ఎన్నికల్లో కమలం పార్టీ ఊహించని విజయాన్ని సాధించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వైసీపీకి పరోక్షంగా సహకరించింది. ఎన్నికల తర్వాత కేసీఆర్, జగన్ ఒక జట్టుగా మారడంతో ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై కూడా పడింది. గడచిన మూడు నాలుగు నెలలుగా వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ, కేంద్రం గుర్రుగా ఉన్నాయి. జాతీయ కోణంలోనూ, కేసీఆర్ తో కలిసి తెలుగు రాష్ట్రాల్లో జట్టు కట్టే ప్రయత్నాలపైన కూడా కేంద్రం ఆగ్రహంగానే ఉంది. తాజాగా ఇరువురు ముఖ్యమంత్రులు ప్రధానిని కలవడంలో పరిపాలనపరమైన అంశాలకు తోడు రాజకీయ సంబంధాల పునరుద్ధరణ కూడా అజెండాలో ఉంది. అయితే అది నాయకుల మధ్య సాగే అంతర్గత వ్యవహారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కలిసి కట్టుగా గట్టిగా నిలబడితే కేంద్రానికి బలమైన సంకేతాలు పంపవచ్చని వారు భావించారు. కానీ కొన్ని బలహీనతలు రెండు రాష్ట్రాలను వెన్నాడుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డికి ఎంతగా ప్రజాదరణ ఉన్నప్పటికీ ఇంకా కేంద్ర దర్యాప్తు సంస్థల చట్రం నుంచి బయటపడలేదు. తెలంగాణలో టీఆర్ఎస్ కు అసెంబ్లీ ఎన్నికల నాటి ఆదరణ తగ్గుముఖం పడుతోంది. ఉద్యమం , రాష్ట్ర సాధన వంటి అంశాలు ప్రజల దృష్టిలో ఇక సాధారణమైపోతున్నాయి. ఈ పరిస్థితులన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రులు ఒకే మాట, ఒకే బాటగా నిలిచినప్పటికీ దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల పరిస్థితులు లేవు. పైపెచ్చు రెండు పార్టీలను రాజకీయ లక్ష్యాల కోసం ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ స్థితి నుంచి బయటపడి కేంద్రం వద్ద కనీసం తటస్థమార్కులైనా తెచ్చుకోవాలనేది జగన్, కేసీఆర్ ల యోచన.

టీడీపీ పాచికలు…

రాష్ట్ర విభజన తో అదృష్టం కలిసొచ్చిన తెలుగుదేశం పార్టీ స్వయంకృతాపరాధాలతో ప్రస్తుతం సంక్షోభపరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎన్నికలకు ముందు ఎన్డీఏకు దూరమై బీజేపీతో సంబంధాలు చెడగొట్టుకుంది. తెలంగాణలో కాంగ్రెసుతో కలిసి పోటీ చేసి వైఫల్యాన్ని మూటగట్టుకుంది . అటు తెలంగాణలో అస్తిత్వ పోరాటం, ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఘోరపరాజయం వెరసి టీడీపీ ఎదురీదుతోంది. కమలం పార్టీని టీడీపీ ఎంతగా భ్రష్టు పట్టించినప్పటికీ ప్రస్తుతం ఆ పార్టీ బీజేపీకి ప్రత్యర్థి కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విసిగి వేసారి అధికారపక్షం వేధింపులను ఎదుర్కొంటున్న తెలుగుదేశం నాయకులు, శ్రేణులు బీజేపీ వైపు చూస్తున్నారు. అదే వారికి ఆశ్రయంగా కనిపిస్తోంది. అటు తెలంగాణ రాష్ట్రసమితి, ఇటు వైసీపీ బీజేపీలో చేరిన టీడీపీ నాయకులవైపు తొంగి చూడటం లేదు. అదే ఒక రకంగా బీజేపీకి అదృష్టంగా పరిణమించింది. పైపెచ్చు టీడీపీకి భవిష్యత్ అగ్రనాయకత్వం కొరత తప్పదనే భావనతో ఉంది బీజేపీ. అందువల్ల తెలుగుదేశం పార్టీ ని ఆసరాగా చేసుకుంటూ ఎదగాలనే ఆలోచనలో ఉంది. తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం సైతం ప్రస్తుతానికి కేంద్రంలోని బీజేపీ అండ దొరికితే చాలనుకుంటోంది. రాజ్యసభ సభ్యులు, నాయకులు కమల తీర్థం పుచ్చుకుంటున్నా పెద్దగా స్పందించడం లేదు. ఆర్థిక పరమైన కేసులు, నేరపూరిత కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న పార్టీ నాయకులను బీజేపీ వైపు టీడీపీ నాయకత్వమే ప్రోత్సహిస్తోందనే అనుమానాలు సైతం నెలకొంటున్నాయి. ఇది ఉభయతారకంగా అటు బీజేపీకి లాభిస్తుంది. ఇటు టీడీపీకి తక్షణ ఉపశమనంగా ఉపకరిస్తుంది.

కమలం కలలు…

మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు తన చుట్టూ చక్కర్లు కొట్టడం బీజేపీకి సంతోషాన్నిస్తోంది. దీర్ఘకాలిక వ్యూహంతోనే ఆ పార్టీ అగ్రనాయకులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీడీపీ ఎలాగూ తమ మాట వింటుందనే నిశ్చయానికి వచ్చేశారు. జనసేన నుంచి కూడా నాయకులు, శ్రేణులు వస్తే బాగుంటుందనే దిశలో ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. వైసీపీ ఎంతగా బలపడినప్పటికీ తెలుగుదేశం మాదిరిగానే స్వయంకృతాపరాధాలతో ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటుందని అంచనా వేస్తోంది. కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు వేసిన అంచనా ప్రకారం ఎన్నికల నాటికి ఇప్పటికి జగన్ కు ఉన్న ప్రజాదరణ గ్రాఫ్ పదిశాతం పడిపోయిందని లెక్కలు తీస్తున్నారు. సంక్షేమ పథకాలే సింగిల్ పాయింట్ అజెండా . ఆ ప్రాతిపదికపైనే వైసీపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. రైతు భరోసా వంటి పథకాల్లో కేంద్రప్రభుత్వ భాగస్వామ్యాన్ని విస్త్రుతంగా ప్రచారం చేయాలని కేంద్రం ఇప్పటికే శ్రేణులకు ఆదేశాలిచ్చింది. దీంతోపాటు అభివ్రుద్ధి కావాలంటే బీజేపీనే గెలిపించాలనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళికను ఢిల్లీ వర్గాలు సిద్దం చేస్తున్నాయి. అవసరమైతే టీడీపీతో జట్టు కట్టేందుకు అయినా సిద్దమనే సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే ఈసారి టీడీపీ మేజర్ భాగస్వామిగా ఉండబోదు. మహారాష్ట్ర తరహా ఫార్ములానే వర్తింపచేస్తామని పెద్ద నాయకులు ఆంతరంగిక సంభాషణల్లో చెబుతున్నారు. అక్కడ శివసేన, బీజేపీ తరహాలో ఆంధ్రాలో టీడీపీ, బీజేపీ సగం సగం సీట్లు పంచుకోవాలనేది యోచన. టీడీపీ మరింత బలహీన పడిన తర్వాత ఈ ప్రతిపాదన ముందుకు వచ్చే అవకాశముంది. ఈ ముందు చూపు కారణంగానే వైసీపీ ఎంతగా సత్సంబంధాలకు ప్రయత్నించినా ఢిల్లీ పెద్దలు కరుణించకపోవచ్చని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News