ట్రాప్ లో పడిపోయినట్లేనా?

రాజకీయ పార్టీలకు ఉండాల్సింది పెద్ద నోరు. ఎందుకంటే గట్టిగా ప్రత్యర్ధులపైన విమర్శలు చేయడంతో పాటు, తమ వాదనను కూడా బలంగా వినిపించుకోవడానికి. ఇక అధికార వైసీపీ తీరు [more]

Update: 2020-02-24 13:30 GMT

రాజకీయ పార్టీలకు ఉండాల్సింది పెద్ద నోరు. ఎందుకంటే గట్టిగా ప్రత్యర్ధులపైన విమర్శలు చేయడంతో పాటు, తమ వాదనను కూడా బలంగా వినిపించుకోవడానికి. ఇక అధికార వైసీపీ తీరు చూస్తే చాలా మంది నేతలకు నోళ్ళు ఉన్నాయి కానీ లాజిక్ తో వాదించే సత్తా లేదని అంటున్నారు. అలాగే ప్రత్యర్ధులు జల్లే బురద కడుక్కోవడంలోనూ పొరపాటూ, తడబాటూ పడుతున్నారు, అదే సమయంలో తాము జనాలకు ఏం మేలు చేశామో కూడా వివరంగా చెప్పుకోలేకపోతున్నారు. ఓ విధంగా టీడీపీ ట్రాప్ లో వైసీపీ పడిపోయినట్లుగా అనిపిస్తోంది.

చెడ్డ పేరు….

ప్రస్తుతం ఏపీలో రద్దుల పర్వం సాగుతోందని బస్సెక్కి ఊరూరా తిరుగుతూ చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారు. పెన్షన్లు కట్ చేస్తున్నారని, రేషన్ కార్డులు తీసేశారని ఆయన జనాల్లోకి వెళ్ళి మరీ గొల్లు పెడుతున్నారు. అదే విధంగా ప్రతీ చోటా బలమైన టీడీపీ నేతలు క్షేత్ర స్థాయిలో ఇదే రకమైన ప్రచారం చేస్తూ వైసీపీ సర్కార్ పరువు తీసేస్తున్నాయి. వైసీపీ అన్నింటా విఫలం, గత సర్కారే నయం అన్న భావన వ్యాప్తి చేసేందుకు పసుపు పార్టీ పెద్ద ఎత్తున బురద జల్లుతోంది.

ఇది కదా సంగతి….

నిజానికి ఏపీలో వైసీపీ సర్కార్ సంక్షేమం పేరిట పెద్ద ఎత్తున పధకాలు అమలు చేస్తోంది. అది ఎలాగంటే కులం, మతం, పార్టీ రంగులు చూడకుండా అర్హత ప్రాతిపదినక అందరికీ ఫలాలు అందేలా చూస్తున్నారు. తెలుగుదేశం పెద్దలు ఆరోపించినట్లుగా ఏపీలో ఏడు లక్షల రేషన్ కార్డులు రద్దు చేయడంలో నిజాలు ఎంత అన్నది పక్కన పెడితే కొత్తగా మరో పద్నాలుగు లక్షల మందికి కొత్త కార్డులు అందేలా చూస్తున్నారు. మరి దీన్ని వైసీపీ ఎందుకు చెప్పుకోవడంలేదో అర్ధం కాని పరిస్థితిగా ఉంది. అలాగే పెన్షన్లు కూడా గత సర్కార్ కంటే ఎక్కువగా జనాలకు అందిస్తున్న ప్రభుత్వంగా వైసీపీ ఉంది. ఆ డేటా అధికారుల వద్దనే ఉంది. ఇక పెన్షన్లు కూడా వివిధ వర్గలా వారీగా చూస్తే చాలా పెద్ద ఎత్తున పెంచుతూ పోయారు. సగటున నూరు శాతం పైగా రెట్టింపు పెన్షన్ ఇపుడు కొత్త సర్కార్ అందిస్తోంది.

వేరే కార్డులుగా….

ఇక ఇప్పటివరకూ చూసింది ఒకటే రేషన్ కార్డు. దాన్ని పెద్దవాళ్ళు కూడా దగ్గర పెట్టుకుంటున్నారు. వారికి ఇతర ప్రయోజనాలు కూడా అదే కార్డు ద్వారా అందిస్తారన్న కారణంతోనే వాటిని ఉంచుకుంటున్నారు. దాంతో వారికి ఇచ్చే బియ్యం కోటా డీలర్ స్వాహా అవుతోంది. దీన్ని అరికట్టేందుకే బియ్యం కార్డులను వేరు చేసి ఆరోగ్యశ్రీ కార్డులు, ఫీజు రీ ఎంబర్స్ మెంట్ కార్డులు, పింఛ‌ను కార్డులుగా విడగొట్టి మరీ వైసీపీ సులువు చేసింది. దాంతో ఏ కేటగిరీ వారికి ఆ కార్డులు అందేలా చూస్తున్నారు.

పెరిగిన పించన్లు….

నిజంగా ఇది మంచి పని. ఈ విధంగా బియ్యం అవసరం లేని వారి కార్డులే లక్షల్లో ఉన్నాయి. వాటిని రద్దు చేస్తూంటే టీడీపీ రచ్చ చేస్తోంది. అలాగే అర్హులకు కార్డులు ఇంతకు రెట్టింపు ఇస్తున్నా వైసీపీ సర్కార్ పెద్దలు దాన్ని చెప్పుకోవడంలేదు. నోరు విప్పడంలేదు. ఇక దివ్యాంగులకు పెంచిన పించన్లు, కిడ్నీ రోగులకు ఒకేసారి నెలకు పదివేల రూపాయలకు చేసిన పించన్ల గురించి కూడా మచ్చుకైనా వైసీపీ మంత్రులు ఎక్కడా ప్రస్తావించడంలేదు. దాంతో వైసీపీ సర్కార్ పేదల పొట్ట కొడుతోందని టీడీపీ చేస్తున్న ప్రచారమే జనంలోకి పోతోంది. దీని మీద మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు అంటున్న మాట చూస్తే వైసీపీ నేతల చేతగానితనం వల్లనే అన్నీ చేసి కూడా అపఖ్యాతిపాలు అవుతున్నారన్నది నిజమనిపిస్తుంది.

Tags:    

Similar News