ఏపీకి మహిళా సీఎం…నిజమేనా?

వినేందుకే వింతగా ఉంటే అనేందుకు ఆయనకు ఎంత తెగింపు ఉండాలి. మరెంత లోతైన అవగాహన ఉండాలి. ఆయనెవరో కాదు వైసీపీ నేత పీవీపీ అంటే పొట్లూరి వర [more]

Update: 2020-02-21 02:00 GMT

వినేందుకే వింతగా ఉంటే అనేందుకు ఆయనకు ఎంత తెగింపు ఉండాలి. మరెంత లోతైన అవగాహన ఉండాలి. ఆయనెవరో కాదు వైసీపీ నేత పీవీపీ అంటే పొట్లూరి వర ప్రసాద్ అన్నమాట. ఆయన విజయవాడ ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇపుడు ఆయన తీరిగ్గా ఏపీ సీఎం మార్పు గురించి మాట్లాడుతున్నారు. ఆయన తాజాగా చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మహిళా సీఎం ఏపీకి రావాలంటూ ఆయన కోరుకుంటున్నారా. అలా జరుగుతుందని అంచనా వేస్తున్నారా అన్నది ఆయన వివేచనకే వదిలేసినా కూడా ఇలా కూడా జరుగుతుందా అన్న చర్చ మాత్రం ఇపుడు ఏపీలో వేడిగానే సాగుతోంది

తొలుత జేసీ నోట….

కొన్నాళ్ళ క్రితం మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి నోటి వెంట కూడా ఇదే మాట వినిపించింది. త్వరలో మా అమ్మాయి భారతి ముఖ్యమంత్రి అవుతుందని జేసీ చెప్పుకొచ్చారు. అంటే దాని అర్ధం జగన్ జైలుపాలు అవుతాడని ఆయన భయంకరమైన ఆలోచన అన్నమాట. పగవాడు, ప్రత్యర్ధి కాబట్టి జేసీ అలా అని ఉండొచ్చు. మరి సొంత పార్టీ నేత అయిన పీవీపీ ఈ మాటలు అంటున్నారంటే ఆలోచించాల్సిందే. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లుగా పీవీపీకి ఉన్న సమాచారం ఏమిటో అన్న మాట కూడా వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది.

సీబీఐ ఘాటు కామెంట్స్….

జగన్ జైలుకు ఎందుకు వెళ్తాడు అని కనుక ఆలోచించుకుంటే ఆయన మీద ఉన్న కేసులు ఒక్కసారిగా గుర్తుకువస్తాయి. పదకొండు కేసుల్లో జగన్ ఏ వన్ ముద్దాయిగా ఉన్నారు. ఆయన కేసుల మీద సీబీఐ ట్రయల్ కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే జగన్ గత ఏడాదిగా చూస్తే ఒక్కసారి మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరుకున్నారు. దాన్ని ట్రయల్ కోర్టు తిరస్కరించింది. హైకోర్టులో ఈ కేసు విచారణలో ఉంది. అక్కడ సీబీఐ చేసిన వాదన చూస్తే జగన్ కి అసలు బెయిల్ ఎందుకు ఇవ్వాలని అన్నట్లుగా ఉంది. జగన్ బెయిల్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని, ఆయన షరతులకు లోబడి కోర్టుకు రావడం లేదని హైకోర్టులో సీబీఐ అధికారులు ఘాటైన పిటిషన్ దాఖలు చేశారు. ఇక జగన్ మీద తీవ్రమైన ఆర్ధిక నేరాలు ఉన్నాయని. ఆయన వ్యక్తిగత హాజరు మినహాయింపు అన్న ప్రశ్నే వద్దు అంటూ సీబీఐ వాదించింది.

బెయిల్ రద్దయితే…?

ఇక జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు సీఎం హోదాలో హాజరు కావడంలేదు. వరసగా ఆయన ఏ వారానికి ఆ వారం మినహాయింపు కోరుతున్నారు. ఇది కనుక శ్రుతి మించితే జగన్ బెయిల్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటిపుడు జగన్ కేసుల్లో తీర్పు రాకపోయినా బెయిల్ రద్దు అయితే మాత్రం జైలుకి వెళ్తారన్న ప్రచారాన్ని ఓ వైపు టీడీపీ నేతలు చేస్తున్నారు. మరో వైపు స్వయంగా వైసీపీ నేత పీవీపీ సైతం మహిళా ముఖ్యమంత్రి అంటూ కొత్త మాటలు మాట్లాడడం బట్టి చూస్తూంటే ఏమైనా తెర వెనక జరగబోతుందా అన్న మాట కూడా వినిపిస్తోంది. చూడాలి మరి పీవీపీ మాటల అర్ధాలు, పరమార్ధాలు ఏంటో.

Tags:    

Similar News