ఇప్పుడే బయటకు వస్తున్నాడే

వైసీపీ అధినేత జగన్ పదేళ్ళ రాజకీయంతోనే పండిపోయారు. అందరూ ఈసారి ఎన్నికల్లో జగన్ కి వేవ్ ఉన్నా చివరి నిముషంలో తన చాణక్యాన్ని ఉపయోగించి చంద్రబాబు మళ్ళీ [more]

Update: 2019-10-13 08:00 GMT

వైసీపీ అధినేత జగన్ పదేళ్ళ రాజకీయంతోనే పండిపోయారు. అందరూ ఈసారి ఎన్నికల్లో జగన్ కి వేవ్ ఉన్నా చివరి నిముషంలో తన చాణక్యాన్ని ఉపయోగించి చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తారని ఊహించారు. కానీ జగన్ తన వ్యూహాలను నమ్ముకుని పూర్తి ఆత్మవిశ్వాసంతో గెలిచిన తీరుకు రాజకీయ మేధావులు సైతం భళా అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక జగన్ ముఖ్యమంత్రిగా కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్ధి పార్టీల విమర్శలను పక్కన పెట్టి తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. జనంలోనే ఉంటూ వారికోసం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రేపటి రోజున తాను ఏం చేసినది చెప్పుకోవడానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే నాలుగు నెలల పాటు పాలించిన జగన్ లో ముఖ్యమంత్రి మెల్లగా కొంచం తప్పుకుని వైసీపీ అధినేత ఇపుడిపుడే బయటకు వస్తున్నాడు. పార్టీని పటిష్టం చేయడంపైన జగన్ దృష్టిపెడుతున్నారు. రాబోయేవి స్థానిక సంస్థల ఎన్నికలు. అందువల్ల వాటిని ఎదుర్కోవడం కోసం జగన్ తగిన వ్యూహాలను సిధ్ధం చేసుకుంటున్నారు.

గోదావరి టార్గెట్….

బంపర్ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి రావడానికి గోదావరి జిల్లాలే ప్రధాన కారణం. ఆ సంగతి బాగా గుర్తించిన జగన్ అక్కడ పార్టీకి బలమైన పునాదులు వేయడానికి రెడీ అవుతున్నారు. గోదావరి జిల్లాల్లో టీడీపీకి బలం బాగానే ఉంది. అదే సమయంలో పవన్ సామజికవర్గం కూడా ఎక్కువగా ఉన్నారు. అందువల్ల ఆ రెండు పార్టీలకు దెబ్బ కొట్టాలన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. గోదావరి జిల్లాల్లో వైసీపీకి మంచి నాయకులు ఉన్నా కూడా ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకోవడం ద్వారా ప్రత్యర్ధిని బలహీనపరచాలని చూస్తున్నారు. అందులో భాగంగానే రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత తోట త్రిమూర్తులుని జగన్ పార్టీలోకి తీసుకున్నారు. మరింతమంది టీడీపీ నేతలకు కూడా ఆయన గాలం వేస్తున్నారు.

జనసేన‌ నుంచి కూడా….

ఇక మరో వైపు జనసేనను సైతం జగన్ వదలడంలేదు. కొద్దో గొప్పో ఉన్న నాయకులను లాగేస్తే ఆ పార్టీ బెడద తగ్గుతుందని జగన్ వ్యూహంగా ఉంది. ఇప్పటికైతే మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను వైసీపీలో చేర్చుకోవడానికి జగన్ పచ్చజెండా ఊపారు. ఆయన సీనియ‌ర్ నేత కావడమే కాదు, తాజా ఎన్నికల్లో రాజమహేంద్రవరం నుంచి ఎంపీ అభ్యర్ధిగా జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయారు. బలం, బలగం ఉన్న ఆకులను తేవడం ద్వారా స్థానిక ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని పట్టాలని జగన్ ఆలోచన‌గా చెబుతున్నారు. ఇక జనసేనలో అనేకమంది నాయకులు ఉన్నారు. వారిలో కూడా మంచి గుర్తింపు కలిగిన నేతలు ఉంటే పార్టీ కండువా కప్పేయాలని జగన్ ఆరాటపడుతున్నారు.

జనాన్ని తిప్పుకుఏ వ్యూహం…..

ఇక జగన్ గోదావరి జిల్లాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామ సచివాలయాలకు శ్రీకారం తూర్పు గోదావరి జిల్లా నుంచి చుడితే, వైఎస్సార్ వాహనమిత్రను పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రారంభించారు. ఇలా ప్రతిష్టాత్మకమైన పధకాలను గోదావరి జిల్లాల నుంచే ప్రారంభించడం వెనక ఈ జిల్లాలను వైసెపీ వైపుగా తిప్పుకోవాలన్న ఎత్తుగడ ఉందని అంటున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పధకాలను కూడా జగన్ ఈ జిల్లాల నుంచే అమలు చేయాలనుకుంటున్నారు. మొత్తానికి చూసుకుంటే ఆపరేషన్ గోదావరితో జగన్ కొత్త రాజకీయాన్ని స్టార్ట్ చేశారనుకోవాలి.

Tags:    

Similar News